Telangana Projects | ప్రాజెక్టుల్లో పూడిక, రబీలో సాగు ప్రశ్నార్థకం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టు జలాశయాల్లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గింది.రబీ సీజనులో ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో పూడిక చేరడంతో నీటి నిల్వ సామర్ధ్యం గణనీయంగా తగ్గింది. వరదల వల్ల ఇసుక ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి కొట్టుకువచ్చి జలాశయంలో మేట వేసింది. దీని వల్ల జలాశయాల్లో నీటి నిల్వ తగ్గి ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందకుండా పోతోంది. దీనికి తోడు రబీ పంటల సాగుకు ప్రాజెక్టుల జలాశయాల్లో పూడిక పేరుకు పోవడం వల్ల నీరందించలేదని పరిస్థితి నెలకొంది.
పూడికతో తగ్గిన నీటి నిల్వ సామర్ధ్యం
తెలంగాణ రాష్ట్రంలోని 159 ప్రాజెక్టు జలాశయాల్లో 929 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉంది.పలు ప్రాజెక్టులు నిర్మించి 25 ఏళ్లకు పైబడటంతో జలాశయాల్లో వరదనీటి ప్రవాహాల వల్ల పూడిక చేరింది. 14 ప్రాజెక్టుల్లో పూడిక చేరడం వల్ల 35 టీఎంసీ ల నీటి నిల్వ తగ్గిందని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు అధ్యయనంలో వెల్లడైంది. అందులోనూ కడెం, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టు జలాశయాల్లో ఎక్కువ పూడిక చేరిందని తేలింది. ఒక టీఎంసీ నీటి నిల్వ కోసం కొత్తగా జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాలని అంచనా వేశారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించే కంటే పాత ప్రాజెక్టు జలాశయాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడమే మేలని ఇంజినీరింగ్ నిపుణులు నిర్ణయించారు.
జలాశయాల్లో పేరుకున్న పూడిక
తెలంగాణలోని ఎం బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టు, నిజాంసాగర్, ప్రియదర్శిని జారాల, రాజోలిబండ డైవర్షన్ స్కీం, కాళేశ్వరం, కుప్టి, లోయర్ పెనుగంగా, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయాల్లో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిందని ఇంజినీరింగ్ నిపుణులు జరిపిన అధ్యయంలో తేల్చారు. పెద్ద ప్రాజెక్టులే కాకుండా మధ్యతరహాప్రాజెక్టు లైన ఆసిఫ్ నగర్, బయ్యారం, బొగ్గులవాగు, చెల్మలవాగు, దిండి, గడ్డెన్న సుద్దవాగు, ఘన్ పూర్, గొల్లవాగు, గుండ్లవాగు, కిన్నెరసాని, కాటేపల్లి, కౌలాస్ నాలా, లక్నవరం, లంకాసాగర్, మల్లూరువాగు, నల్లవాగు, పాఖాల, పెద్దవాగు, పోచారం, ఎర్రవాగు,రాళ్లవాగు, రామడుగు, రామప్ప, సదర్ మాట్, సాత్నాల, శనిగరం, స్వర్ణ, తాలిపేరు ప్రాజెక్టుల్లోనూ పూడిక వల్ల నీటి నిల్వ సామర్ధ్యం తగ్గింది.
పూడిక వెలికితీతకు కేంద్ర జలశక్తి శాఖ విధానం
ప్రాజెక్టు జలాశయాల్లోని పూడిక వెలికితీతకు కేంద్ర జలశక్తి శాఖ రూపొందించిన కొత్త విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని నిర్నయించారు. దీని కోసం భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి వారు తవ్విన ఇసుకను విక్రయించుకునేందుకు అనుమతించడం ద్వారా ప్రభుత్వంపై భారం పడకుండా చూడనున్నారు.
కడెం ప్రాజెక్టులో...
1949వ సంవత్సరంలో నిర్మించిన కడెం ప్రాజెక్టులో పూడిక చేరడం వల్ల మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం తగ్గింది. ఈ ప్రాజెక్టు కింద కడెం, దస్తురాబాద్, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట, హాజిపూర్, ఖానాపూర్ మండలాల్లో 68,150 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు జలాశయంలోకి ఎగువ నుంచి వచ్చిన వరదలతో పూడిక చేరింది. దీనివల్ల నీటి నిల్వ సామర్ధ్యం తగ్గి రబీ సీజనులో 20వేల ఎకరాలకే నీరందుతోంది.
మూడు ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపునకు...
కడెంతోపాటు లోయర్ మానేరుడ్యామ్, మిడ్ మానేరు జలాశయాల్లోని పూడికను తొలగించేందుకు నీటిపారుదల శాఖ టెండర్లు ఆహ్వానించింది. జవవరి 27వతేదీలోగా టెండరు దరఖాస్తులు సమర్పించాలని నీటిపారుదల శాఖ చివరితేదీగా నిర్ణయించింది. జలాశయంలో పేరుకుపోయిన ఇసుకను వాణిజ్య ప్రయోజనాల కోసం విక్రయించనున్నారు. జలాశయంలో మేట వేసిన సారవంతమైన మట్టిని తొలగించి దాన్ని రైతుల పొలాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ వేసవికాలంలో పైలట్ ప్రాజెక్టు కింద మూడు ప్రాజెక్టుల్లో పూడికను తొలగించిన తర్వాత రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టుల్లోనూ పూడికతీత పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు యోచిస్తున్నారు.
నీటిపారుదల శాఖ పైలట్ ప్రాజెక్టు
- తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టు జలాశయాల్లో పేరుకు పోయిన పూడికను తొలగించేందుకు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా కడెం, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టు జలాశయాల్లో పూడికను తొలగించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద తాజాగా టెండర్లు ఆహ్వానించారు.
- పూడిక తొలగింపుతో కాంట్రాక్టర్లకు లభించే ఇసుకను విక్రయించుకునేందుకు నీటిపారుదల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూడిక తీతలో లభించిన ఇసుక మెట్రిక్ టన్ను బిడ్డింగ్ ధర రూ.406.64 రూపాయలుగా నిర్ణయించింది. భారీ యంత్రాలతో జలాశయంలోని ఇసుకను తవ్వి అమ్ముకునే అవకాశం కల్పించింది.
- మూడు ప్రాజెక్టుల్లో పూడిక వెలికితీతకు టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కరీంనగర్ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీరును ఆదేశించారు.
ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
వేసవి కాలం రాకముందే ప్రాజెక్టుల్లోని పూడిక చేరడం వల్ల జలాశయాల్లో నీటి నిల్వ సామర్ధ్యం గణనీయంగా తగ్గింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, శుక్రవారం 1085.60 అడుగులకు తగ్గింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 61.88 టీఎంసీలకు తగ్గింది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్, వరదకాల్వ, గుత్ప, ఇతర ఎత్తిపోతల పథకాలకు ఈ జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్‌లో తగ్గుతున్న నీటిమట్టం
నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం వేగంగా తగ్గుతుంది. శుక్రవారం సాగర్ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,058 క్యూసెక్కుల నీరు చేరింది. సాగర్ కుడి కాల్వ ద్వారా 9,853 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,712 క్యూసెక్కులు, ఎస్ ఎల్ బీసీ కెనాల్ ద్వారా 2,400, వరద కాల్వ ద్వారా 280 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్థుతం శుక్రవారం నాటికి 562.1 అడుగులుంది.సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్థుతం జలాశయంలో 237.3 టీఎంసీల నీరే ఉంది.
శ్రీశైలంలోనూ...
శ్రీశైలం ప్రాజెక్టు జలాశయంలోనూ నీటి నిల్వలు తగ్గుతున్నాయి. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 856.4 అడుగులుంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో ఏమీ లేకపోగా, అవుట్ ఫ్లో మాత్రం 7,171 క్యసెక్టుల నీటిని సాగర్ జలాశయానికి వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్థుతం 95.59 టీఎంసీలు మాత్రమే ఉంది.
Next Story