
రికార్డ్ స్థాయిలో మద్యం.. రెండు రోజుల్లో ఎంత బిజినెస్ అంటే..!
గాంధీ జయంతి ఎఫెక్ట్‌తో ముందురోజు కొనుగోళ్లు పెరిగాయన్న ఎక్సైజ్ శాఖ.
దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో పండగ రోజు మద్యం లేకుండా పోయింది. ఈ లోటును ఎలా భర్తీ చేసుకోవాలి మద్యం ప్రియులకు బాగా అర్థమైనట్లు ఉంది. అందుకే ముందు రోజుల్లోనే భారీగా మద్యం కొనేసినట్లు ఉన్నారు. ఈ మాట మేం చెప్తున్నది కాదు.. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మద్యం అమ్మకాల గణాంకాలు చెప్తున్నాయి. ఈరెండు రోజుల్లో జరిగిన అమ్మకాలు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించిన గణాంకాలకు అక్టోబర్ 3న అధికారులు వెల్లడించారు. ఆ నెంబర్లు చూస్తే ఎవరికైనా కిక్కెక్కాల్సిందే. రెండు రోజుల్లో దాదాపు రూ.419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30 ఒక్క రోజే రూ.333 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
అక్టోబర్ 1న మద్యం అమ్మకాలు రూ.86 కోట్లేనని అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు సెప్టెంబర్ 26 నుంచే పుంజుకున్నాయి. గాంధీ జయంతి, దసరా పండగ ఒకే రోజు కలిసి రావడంతో ఒకరోజు ముందుగానే మద్యం షాపుల దగ్గర రద్దీ భారీగా పెరిగింది. వైన్స్, లిక్కర్ మార్ట్‌ల ముందు మందుబాబులు క్యూలు కట్టారు. గాంధీ జయంతి సందర్బంగా మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు బంద్ కావడంతో ఒకరోజు ముందుగానే మద్యం బాబులు స్టాక్ పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా రెండు రోజుల్లో రూ.419 కోట్ల మద్యం అమ్మకాలంటే మామూలు విషయం కాదు.