బీసీల రిజర్వేషన్ల విషయంలో రేవంత్ ముందున్నమార్గమేమిటి ?
బీసీలకు ఇచ్చిన హామీని అమలుచేసేందుకు రేవంత్ దగ్గర ఒకే మార్గముంది.
ఎన్నికల్లోలబ్డికి నోటికొచ్చిన హామీలిస్తే అధికారంలోకి వచ్చినతర్వాత తలెత్తే సమస్యలు ఏమిటో పార్టీలకు బాగా అనుభవమే. ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో గెలుపుకోసం ఆచరణసాధ్యంకాని హామీలిచ్చిన చంద్రబాబునాయుడు(Chandrababunaidu) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిఇబ్బందులు పడుతున్నారో అందరు చూస్తున్నదే. ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణలో కులగణన నివేదికను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నివేదికప్రకారం బీసీల జనాభా ఎంతన్నది అధికారికంగా తేలిపోయింది. రాష్ట్రంలో బీసీల జనాభా(BC reservations) 56.33 శాతం ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిలీజ్ చేసిన నివేదిక స్పష్టంచేసింది. దాంతో ఇపుడందరి దృష్టి బీసీల జనాభామీదే కేంద్రీకృమైంది. రాష్ట్రంలో అనేక సామాజికవర్గాలుండగా ఒక్క బీసీ సామాజికవర్గంమీద మాత్రమే ఎందుకు కేంద్రీకృమైందంటే రాజకీయంగా కాకరగిల్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టే.
అసలువిషయం ఏమిటంటే తొందరలోనే స్ధానికసంస్ధల ఎన్నికలు(Local body elections) జరగబోతున్నాయి. స్ధానికఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని 2023 అసెంబ్లీఎన్నికలకు ముందు కామారెడ్డి(Kamareddy declaration)లో జరిగిన బీసీల సదస్సులో రేవంత్ రెడ్డి(Revanth) హామీ ఇచ్చాడు. స్ధానికఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యంకాదని హామీఇచ్చిన రేవంత్ కు తెలుసు అలాగే బీసీ సంఘాలకు, మేథావులకు కూడా బాగాతెలుసు. అయినాసరే ఎన్నికల్లో లబ్దికోసమే రేవంత్ హామీఇచ్చాడు. అందుకనే అప్పుడు హామీఇచ్చేసి ఇపుడు అధికారికంగా తగులుకున్నట్లయ్యింది. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి రేవంత్ సీఎం కాగానే స్ధానికఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని బీసీ సంఘాలు, నేతలు డిమాండ్లు మొదలుపెట్టారు. రేవంత్ ను ఇరుకునపెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా బీసీ సంఘాలకు మద్దతుగా రంగంలోకి దిగి గోలచేస్తున్నాయి.
42 శాతం రిజర్వేషన్ కోసం వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక రేవంత్ బీసీ జనాభా ఎంతని తేల్చేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమీషన్ వేశారు. ఇదేసమయంలో కులగణన(Family survey) కూడా జరిగింది. కమిషన్ జిల్లాల్లో తిరిగి నివేదికను ప్రభుత్వానికి అందించింది. స్ధానికఎన్నికలు జరపాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీసంఘాలు గోలచేసినపుడల్లా డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు రానివ్వండని మంత్రులు చెప్పేవారు. ఈ నేపధ్యంలోనే రిపోర్టు ప్రభుత్వానికి అందివ్వటం, దాన్ని క్యాబినెట్ చర్చించి సబ్ కమిటీ పరిశీలనకు పంపటం, సబ్ కమిటీ నివేదికను పరిశీలించి మళ్ళీ క్యాబినెట్ లో సబ్మిట్ చేయటం అయిపోయింది. కులగణన నివేదిక+బూసాని నివేదికను పరిశీలించి, క్యాబినెట్ ఆమోదించిన రిపోర్టునే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో విడుదలచేశారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రజనాభా 3.7 కోట్లు. సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 3.54 కోట్ల కుటుంబాలు. గుర్తించిన కుటుంబాలు 1.15 కోట్లు. సర్వేలో పాల్గొన్న కటుంబాలు 1.12 కోట్లు. సర్వేకు 3 లక్షల కుటుంబాల్లోని 16 లక్షలమంది దూరంగా ఉన్నారు. ఇంటికి తాళంవేసిన ఇళ్ళు సుమారు 1 లక్షలు. రిపోర్టు ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319(17.43శాతం). ఎస్టీల జనాభా 37,05,929(10.45శాతం). ముస్లిమేతర బీసీల జనాభా 1.64 కోట్లు(46.25శాతం). ముస్లింమైనారిటీలు 35,76,588(10.08శాతం). ముస్లిం మైనారిటీల్లో ఓసీల జనాభా 8,80,424(2.48శాతం), ముస్లిం మైనారిటీల్లో టోటల్ అంటే బీసీ+ఓసీ జనాభా 44,57, 012(12.56శాతం). ఓసీల జనాభా 47,21,115(13.31శాతం), ఓసీల జనాభా జనరల్+ముస్లింలు కలిసి 56,01,539(15.79శాతం) ఉందని మంత్రి వివరించారు. దీనిప్రకారమే అచ్చంగా బీసీల జనాభా శాతం 46.25 శాతం అని ముస్లిం మైనారిటీల్లోని బీసీలను కూడా కలుపుకుంటే బీసీల టోటల్ జనాభా శాతం 56.33 శాతంగా తేలింది.
కులగణననివేదికతో పాటు బీసీ డెడికేటెడ్ రిపోర్టు కూడా వచ్చేసింది, దాన్ని పబ్లిక్ డొమైన్లో కూడా ప్రభుత్వం పెట్టేసింది. కాబట్టి స్ధానికసంస్ధల ఎన్నికల నిర్వహణకు సామాజకవర్గాలపరంగా రిజర్వేషన్లు కల్పించేందుకు అడ్డంకులు తొలగిపోయినట్లే. తాజానివేదికలోని జనాభాశాతం ప్రకారమే స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లు, ఛైర్మన్లు, మేయర్ పోస్టులకు రిజర్వేషన్ నిర్ణయిస్తుంది. కులగణన సర్వే, డెడికేటెడ్ కమిషన్ కసరత్తు ప్రక్రియతో పోల్చుకుంటే ఎన్నికలకమీషన్ రిజర్వేషన్ను ఫైనల్ చేయటం కష్టమేమీకాదు. గ్రామపంచాయితీలు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఫైనల్ అయిపోతాయి. అవసరమైన చోట్ల లక్కీ డిప్ కూడా తీసే అవకాశముంది. తాజా పరిణామాల ప్రకారం స్ధానికఎన్నికల నిర్వహణకు రంగం అంతా సిద్ధమైపోయింది.
రేవంత్ ఏమి చేయబోతున్నారు ?
ఈనేపధ్యంలోనే రేవంత్ రెడ్డి ఏమిచేయబోతున్నారన్న విషయం ఆసక్తిగా మారింది. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి కారణాలు చెప్పి వాయిదావేసేందుకు లేదు. అలాగని నివేదికలోని అంశాలవారీగా ఏకపక్షంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకూ లేదు. ఎందుకంటే టోటల్ రిజర్వేషన్ శాతం 50 శాతానికి మంచకూడదని సుప్రింకోర్టు తీర్పుంది. సుప్రింకోర్టు తీర్పును కాదని ఇపుడు రేవంత్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించారని అనుకుందాం. ప్రభుత్వనిర్ణయాన్ని ఎవరైనా కోర్టులో చాలెంజ్ చేస్తే వెంటనే కోర్టు ప్రభుత్వనిర్ణయాన్ని కొట్టేస్తుంది. మరపుడు రేవంత్ ప్రభుత్వం ఏమిచేస్తుంది ? తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అనుకున్నా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఎదురుదాడులకు దిగుతుంది. రిజర్వేషన్ అంశం నుండి తప్పించుకోవటానికి రేవంత్ కు ఇదితప్ప మరో ప్రత్యామ్నాయం కనబడటంలేదు. ఇదికాకపోతే బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచాలని అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రానికి పంపాలి. కాంగ్రెస్ ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకుంటుంది ?
రేవంత్ కు ఒక్కటే మార్గముందా ?
అధికారికంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుసాధ్యంకాదని బీసీ సంఘాల నేతలు కూడా అనుమానిస్తున్నదే. అందుకనే బీసీలకు ఇచ్చిన హామీని అమలుచేసేందుకు రేవంత్ దగ్గర ఒకే మార్గముంది. అదేమిటంటే పార్టీపరంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించటం. ప్రభుత్వపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించటం సాధ్యంకానపుడు పార్టీపరంగా అమలుచేయటమే. బీసీల జనాభా ఎంతన్నది అధికారికంగా తేలిపోయింది కాబట్టి ప్రభుత్వపరంగా బీసీలకు రిజర్వేషన్ హామీని అమలుచేయలేనపుడు పార్టీపరంగా అమలుచేయటమే మార్గం. అధికారికంగా 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలంటే అనేక సాంకేతిక సమస్యలు అడ్డువస్తాయి. అదే పార్టీపరంగా అమలుచేయాలంటే ఎలాంటి సమస్యలు ఎదురుకాదు. జనాభా శాతం ఆధారంగా బీసీలకు 56 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా కల్పిస్తామని పార్టీ నిర్ణయిస్తే కోర్టులుకూడా అడ్డుకునేందుకు లేదు.
ఇప్పుడు రేవంత్ ఏమిచేయాలంటే స్ధానికసంస్ధల్లో రాజ్యాంగబద్దంగా నిర్ణయించిన రిజర్వేషన్లు పోను ఓసీలు పోటీచేసే సీట్లలో కూడా వీలైనన్ని సీట్లను బీసీలకు కేటాయించటం ఒక్కటే రేవంత్ చేయగలిగింది. అనధికారికంగానే అయినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పుకోవటానికి ఓసీ సీట్లలో కూడా కొన్నింటిని బీసీలకు కేటాయించాల్సిందే. ఈమార్గంలో తప్ప రేవంత్ కామారెడ్డి డిక్లరేషన్ హామీని నిలబెట్టుకునే అవకాశంలేదు.
జగన్ మార్గమే శరణ్యమా ?
ఏపీలో 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohanreddy) అనుసరించిన మార్గం ఒక్కటే రేవంత్ కు శరణ్యం. స్ధానికసంస్ధల ఎన్నికల్లో రిజర్వేషన్ సీట్లుపోను ఓసీలకు దక్కిన సీట్లలో కూడా జగన్ చాలావరకు బీసీలకే కేటాయించారు. జగన్ లెక్కలప్రకారం జిల్లా పరిషత్ ఛైర్లన్లు, మేయర్ పోస్టుల్లో 70 శాతం బీసీలకే దక్కాయి. అదేసూత్రాన్ని ఇపుడు తెలంగాణలో రేవంత్ ఫాలో అయితే మాత్రమే బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లవుతుంది. లేకపోతే బీసీలు రేవంత్ కు రివర్సవటం ఖాయం. ఇదికూడా అనధికారికమే కాని అధికారికం కాదని గుర్తుంచుకోవాలి.
42 శాతం రిజర్వేషన్ సాధ్యంకాదు
తాజా నివేదికపై బీసీ సంఘాల ప్రముఖుల్లో ఒకరైన రిటైర్డ్ అధికారి చిరంజీవి ది తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయటం సాధ్యంకాద’న్నారు. టోటల్ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని 2010లో సుప్రింకోర్టు తీర్పున్నట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం హామీని అమలుచేయాలని రేవంత్ ను పదేపదే డిమాండ్ చేస్తున్న కేటీఆర్(KTR), హరీష్, కవిత విషయాన్ని ప్రస్తావిస్తు కేసీఆర్ హయాంలో బీసీల రిజర్వేషన్ను 34 శాతం నుండి 23కి తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘రాజ్యాంబద్దంగా ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లో పోగా మిగిలింది 22 శాతమే కదా’ అని చిరంజీవి ఎదురు ప్రశ్నించారు.
అధికారికంగా బీసీలకు రేవంత్ కేటాయించగలిగింది 22 శాతం మాత్రమే అన్నారు. అలాకాదని ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అనుకుంటే అందుకు కోర్టులు ఒప్పుకోవ’న్నారు. ‘కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, జనాభా ఆధారంగా బీసీల రిజర్వేషన్ పెంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపాల’ని చెప్పారు. ‘తెలంగాణ అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని కేంద్రం పరిశీలించి క్యాబినెట్లో చర్చించి, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చర్చకు పెట్టి ఆమోదించాల’న్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన అసెంబ్లీ తీర్మానానికి కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వ సానుకూలంగా స్పందించటం అనుమానమే’ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. మరీనేపధ్యంలో రేవంత్ ఏమిచేస్తారో చూడాల్సిందే.