హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ షాక్
x

హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ షాక్

20శాతం మేర సిటీ బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో సిటీ బస్సుల చార్జీల మోత మోగించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి సర్వీసుల్లో మొదటి మూడు స్టేజీలకు రూ. 5, నాలుగో స్టేజీ నుంచి రూ. 10 అదనంగా వసూలు చేయనున్నారు.ఈ అదనపు చార్జీలు అక్టోబర్ 6వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లోనూ ఇదే స్థాయిలో పెంపు ఉంటుంది. ఈ ధరల పెరుగుదల ప్రయాణికులకు ఒక రకంగా పిడుగులాంటి విషయం . ఏకంగా 20 శాతం పెంచడంతో ప్రయాణీకులపై తీవ్రంగా భారం పడనుంది.

హైదరాబాద్‌లో బస్సు చార్జీలు పెరగడం ఇదే మొదటిసారి కాదు. గత కొంత కాలంగా, ముఖ్యంగా డీజిల్ ధరలు, విడి భాగాల ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ సంస్థ తరచుగా చార్జీల సవరణ చేస్తోంది. హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో చివరిసారిగా 2023 సంవత్సరంలో కూడా చార్జీలు స్వల్పంగా పెరిగాయి. ఆ సమయంలో కూడా స్టేజీల వారీగా కొంత మొత్తాన్ని పెంచడం జరిగింది.అయితే ఇటీవలే బస్ పాస్ ల ధరలు పెంచింది.
చార్జీల పెంపుపై టీజీఎస్‌ఆర్టీసీ వివరణ
చార్జీల పెంపునకు ప్రధాన కారణం నిర్వహణ వ్యయాలు, కార్మికుల జీతభత్యాలు , పెరుగుతున్న ఇంధన ధరలను సమన్వయం చేసుకోవడమేనని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.భారీగా పెరిగిన ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోతున్నామని సంస్థ స్పష్టం చేసింది. నగర ప్రయాణికులకు మెరుగైన వసతులు, నాణ్యమైన సేవలు అందించాలంటే,టికెట్ ధరలను పెంచడం తప్పనిసరైందని అధికారులు తెలిపారు. ఈ పెరిగిన ధరలు సోమవారం నుంచి అమలులోకి వస్తున్నందున, హైదరాబాద్ నగర ప్రజలు సహకరించాలని టీజీఎస్‌ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ ,సికిందరాబాద్ పరిధిలో దాదాపు 40 లక్షల మందికి పైగా ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు నిత్యం సేవలందిస్తున్నాయి. జన సాంద్రత అధికంగా ఉన్న జంట నగరాల ప్రాంతంలో ఈ ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.బస్సుల్లో ప్రయాణించే వారికి ఒక్కొక్కరికీ నెలకు 500 రూపాయల వరకూ అదనపు భారం పడే అవకాశం వుంది. ఆకస్మాత్తుగా ఆర్టీసీ సిటీ బస్సుల చార్జీలను అమాంతం పెంచడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
Read More
Next Story