ఈ సైన్స్ టీచర్ కు ఒళ్లే బ్లాక్ బోర్డు! | తెలంగాణ గురువు గారికి సెల్యూట్
x
A biology teacher teaching about Human Organs to the children

ఈ సైన్స్ టీచర్ కు ఒళ్లే బ్లాక్ బోర్డు! | తెలంగాణ గురువు గారికి సెల్యూట్

పిల్లలకు పాఠాలు చెప్పాలంటే ఈ టీచర్ పరకాయప్రవేశం చేసేస్తారు


పిల్లలకు పాఠాలు బోధించటంలో ఒక్కొ టీచర్ ది ఒక్కో శైలి. చాలామంది పుస్తకాల్లో ఉన్నది చెప్పుకుంటుపోతారు. కొంతమంది పుస్తకాల్లో ఉన్నదానికి బ్లాక్ బోర్డును ఉపయోగించి పాఠాలు చెబుతారు. కొద్దిమంది మాత్రమే పిల్లల మనసుకు హత్తుకునేలా యాక్టివిటీ బేస్డ్ గా పాఠాలు చెబుతారు. అయితే మంచిర్యాల(Manchiryal) జిల్లా, మందమర్రి మండల కేంద్రం, ఫిల్డర్ బెడ్ మండల పరిషత్ స్కూలు బయాలజీ(Biology Teacher) టీచర్ భీమ్ పుత్ర శ్రీనివాస్ స్టైలే వేరు. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే ఈ టీచర్ పరకాయప్రవేశం చేసేస్తారు. తన ఒంటినే బ్లాక్ బోర్డుగా మార్చేస్తారు. పిల్లలకు మానవ శరీరంలోని(Human Organs) అవయవాలను పరిచయంచేసి, వాటి పనితీరు గురించి వివరించే పాఠం చెప్పటంకోసం టీచర్ ఏమిచేశారంటే మానవ అవయాలన్నింటినీ ప్రింట్ చేయించాలని అనుకున్నారు. అందుకని దానికోసం ప్రత్యేకంగా ఫుల్ సూట్ కొన్నారు. దానిపై స్ర్కీన్ ప్రింటింగ్ చేసేవాళ్ళకు చెప్పి మానవశరీరంలోని అవయాలన్నింటినీ ప్రింట్ చేయించారు.


రోజూ వచ్చినట్లే ఒకరోజు శ్రీనివాస్ స్కూలుకు వచ్చారు. స్కూలు వచ్చిన టీచర్ నేరుగా క్లాసులోకి వెళ్ళి వేసుకున్న చొక్కాను విప్పేశారు. టీచర్ చొక్కా విప్పటాన్ని పిల్లలంతా ఆశ్చర్యంగా చూశారు. తర్వాత పంచను కూడా విప్పేసిన టీచర్ ను చూసి పిల్లలు నమ్మలేకపోయారు. కారణం ఏమిటంటే చొక్కా, పంచలోపల మానవ అవయవాలను ప్రింట్ చేసిన సూట్ కనబడింది పిల్లలకు. నెత్తిన పెట్టుకున్న క్కాపు మీద బ్రెయిన్, సూట్ అప్పర్ పార్ట్ పైన గుండె, ఊపిరితిత్తులు, పొట్టలోపల చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు కనిపించాయి. సూట్ లోయర్ పార్ట్ నడుంమీద అబ్డమెన్, తొడలు, మోచిప్పలు, ఎముకలు, రక్తం లాంటివన్నీ ప్రింట్ చేసున్నాయి. అలాగే వెనుకవైపు వెన్నుపూస, పక్కటెముకలు ముద్రించున్నాయి. టీచర్ ధరించిన సూట్ ను చూసి పిల్లలందరు ఆశ్చర్యపోయారు. అప్పుడు పిల్లలకు టీచర్ మానవశరీరంలోని అవయవాలు, వాటి పనితీరు గురించి వివరించారు.


టీచర్ కాన్సెప్ట్ ఏమిటంటే పిల్లలకు పుస్తకాల్లో ఉన్నది చదివి వినిపించటం కన్నా కళ్ళకు కట్టినట్లు చెప్పమే కాకుండా మనసుకు హత్తుకునేలా చెప్పాలి. అప్పుడు పిల్లలు వినటం కన్నా, చూడటం, చూడటం కన్నా ముట్టుకుని అనుభూతి చెందితే జీవితాంతం పాఠాలను మరచిపోలేరు. టీచర్ చేస్తున్నది ఇదే. మానవ అవయవాలను ప్రింట్ చేసిన సూట్ ధరించి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. దీనివల్ల ఏమవుతున్నదంటే గుండె గురించి వివరించేటపుడు పిల్లలు టీచర్ ధరించిన సూట్ లో గుండెను తాకుతారు. పిల్లలు గుండెను తాకినపుడు దాని పనితీరు, రక్త ప్రసరణ, గుండె కవాటాల బాధ్యతలు ఏమిటి ? బాధ్యతల నిర్వహణలో విఫలమైతే జరిగే నష్టాలు ఏమిటన్న విషయాలను వివరించి చెబుతున్నారు.


గుండె ఒక్కటే కాదు ఊపిరితిత్తులు, చిన్నప్రేవులు, పెద్ద ప్రేవులు, కాలేయం, మెదడు, వెన్నుపూస, పక్కటెముకల్లాంటి అవయవాల గురించి వివరించేటపుడు టీచర్ ఇదే పద్దతిని పాటిస్తారు. పిల్లలు అవయావాల ప్రింట్ ను దగ్గరనుండి చూడటమే కాదు వాటిపనితీరును టీచర్ వివరించేటపుడు చాలా శ్రద్ధగా వింటున్నారు. ప్రత్యక్షంగా అనుభూతి చెందటం వల్ల పిల్లల మెదళ్ళు చాలా చురుకుగా పనిచేయటమే కాకుండా చూసినదాన్ని, అనుభూతించిన దాన్ని గట్టిగా మెదళ్ళల్లో రిజిస్టర్ చేసుకుంటుంది కాబట్టి మరచిపోయే అవకాశాలు తక్కువ. ఈ పద్దతిలో పిల్లలకు పాఠాలు చెప్పటాన్ని శ్రీనివాస్ మూడేళ్ళ క్రిందట మొదలుపెట్టారు. అప్పట్లో టీషర్టుల మీద అవయవాలను ముద్రించి వాటిని చూపిస్తు పాఠాలు చెప్పేవారు. ఆ ప్రయోగం సక్సెస్ కావటంతో మరింత మెరుగ్గా పాఠాలు చెప్పే విషయమై ఆలోచించి తాజాగా సూట్ మీద మానవఅవయవాలన్నింటినీ స్క్రీన్ ప్రింట్ చేయించి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.


ప్రకృతి, వ్యవసాయం గురించి పాఠాలు చెప్పాలంటే పిల్లలను టీచర్ పొలాల్లోకి తీసుకుని వెళతారు. రైతులతో మాట్లాడిస్తారు. రైతులు పొలాల్లో చేస్తున్న పనులను పిల్లలతో కూడా టీచర్ చేయిస్తారు. పొలంలోకి దిగి రైతులతో పాటు పనులు చేసినపుడే తాము చేసిన పనులగురించి పిల్లలకు బాగా అర్ధమవుతుందన్నది టీచర్ కాన్సెప్ట్.

పిల్లలు కూడా టీచర్ కాన్సెప్ట్ కు బాగా కనెక్టయ్యారు. అందుకనే బాడీ సూట్ లో అవయవాలగురించి అయినా, పొలంలో పనులగురించి అయినా పిల్లలకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది.


సామాజిక స్పృహ కూడా ఎక్కువే


పిల్లల మనసులకు హత్తుకునేలా పాఠాలు చెప్పటమే కాదు ఈ టీచర్ కు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. 2019లో కరోసా కారణంగా రెండేళ్ళు స్కూళ్ళు మూతపడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ‘కోవిడ్ వాలంటీర్ గ్రూపు’ను ఏర్పాటుచేశారు. ఆసమయంలో టీచర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నెన్నెల మండలం నార్వాయిపేట స్కూలులో పనిచేసేవారు. తన మిత్రులందరితో మాట్లాడి వాలంటీర్ గ్రూపును ఏర్పాటు చేసిన టీచర్ రు. 1.40 లక్షలు వసూలుచేశారు. కోవిడ్ తో బాధపడుతున్న వారికి మాస్కులు, అవసరమైన మందులు, భోజనాలు ఏర్పాటుచేశారు. అలాగే ‘సోపతి వెల్ఫేర్ సొసైటి’ ని ఏర్పాటుచేసి 10వ తరగతి మిత్రులు 100తో కలిసి భారీఎత్తున చందాలు వేసుకున్నారు. రక్తదానం చేయటం, అవయవదానంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. అవయవదానంపై తనతో పాటు తన భార్య కూడా ప్రతిజ్ఞ తీసుకున్నారు. మిత్రులు అందించిన సుమారు రు. 8లక్షలతో పేదలకు వైద్యం చేయించటమే కాకుండా పేదపిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. ఇద్దరు వృద్ధులకు చెరో లక్ష రూపాయలు ఖర్చుచేసి ఇళ్ళు కూడా ఏర్పాటుచేయించారు.


2001లో ప్రైవేటు స్కూలులో ఉద్యోగజీవితాన్ని మొదలుపెట్టిన భీంపుత్ర శ్రీనివాస్ 2003లో ప్రభుత్వ టీచర్ గా చేరారు. ఆదిలాబాద్ జిల్లా, భీమిని మండలం, బొగడగూడెం స్కూలులో కొంతకాలం పనిచేశారు. తర్వాత 2005-10 మధ్య భీమినిమండలంలోనే ఉన్న గొల్లగూడెం మండల స్కూలులో పనిచేశారు. 2010-24 మధ్యలో నెన్నెల మండలంలోని నార్వాయిపేట స్కూలులో పనిచేశారు. ఇక్కడ పనిచేస్తున్నపుడు పిల్లల్లో ఎక్కువగా బంజారా పిల్లలే ఉండేవారు. వారికి పాఠాలు అర్ధమవ్వటానికి టీచర్ కష్టపడి బంజారా భాషను నేర్చుకున్నారు. బంజారా భాషలో మాట్లాడుతున్న టీచర్ ను చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. బంజారా భాషలో మాట్లాడుతు తెలుగులో పాఠాలు చెప్పటంతో పిల్లలు టీచర్ చెప్పిన పాఠాలను శ్రద్ధతో వినేవారు. ఈ విషయాన్ని టీచరే ‘తెలంగాణ ఫెడరల్’ తో చెప్పారు.

బంజారా భాషలోనే టీచింగ్



‘‘పిల్లల్లో చాలామందికి తెలుగు సరిగారాద’’ని టీచర్ చెప్పారు. తనకేమో బంజారా భాష రాదన్నారు. అందుకనే ‘‘కష్టపడి బంజారా భాషను నేర్చుకుని మాట్లాడటం మొదలుపెట్టడంతో పిల్లలంతా తనతో చాలా దగ్గరైపోయార’’ని టీచర్ వివరించారు. ‘‘2011 నుండి బంజారా పిల్లలకు బంజారా భాషలోనే మాట్లాడుతు పాఠాలు చెప్పాన’’ని తెలిపారు. ‘‘పిల్లలకు పాఠాలు చెప్పటంలో తన కాన్సెప్టు గురించి విన్న అప్పటి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తనకు ఫోన్ చేసి అభినందించటాన్ని తాను ఎప్పటికీ మరచిపోన’’ని చెప్పారు. ‘‘పిల్లల మనసుకు హత్తుకునేట్లు పాఠాలు చెప్పాలన్న తన ఆలోచనే కొత్త కాన్సెప్టుల సృష్టికి నాందిపలుకుతున్న’’ట్లు భీంపుత్ర చెప్పారు.

Read More
Next Story