సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపులు
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. సెక్రటేరియట్‌ను పేల్చేస్తామంటూ బెదిరించారు.
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. సెక్రటేరియట్‌ను పేల్చేస్తామంటూ బెదిరించారు. ఈ మేరకు ఆగంతకుడు సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వోకి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఎస్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్ అంతా తనిఖీలు చేపట్టారు. అంగుళం అంగుళం వెతికారు. ఎక్కడా బాంబు కానీ, పేలుడు పదార్థం ఏదీ కానీ లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. కాగా సీఎం పీఆర్ఓకి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో కీలక విషయాలు వెళ్లడయ్యాయి. తన సమస్యను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో మండి ఒక వ్యక్తి ఇలా చేసినట్లు పోలీసుల గుర్తించినట్లు సమాచారం.
లంగర్ హౌస్‌కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ అనే వ్యక్తి సీఎం పీఆర్ఓకు మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు. దర్గాకు సంబంధించి ఓ సమస్య పై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో అధికారులకు బెదిరింపు కాల్స్ చేసినట్లు అతడు అంగీకరించాడు. ఈ మేరకు సీఎం పీఆర్ఓకు ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకొని పోలీసులు విచారించారు. ఈ క్రమంలోనే నిందితుడు పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అయితే అసలు బెదిరింపు కాల్స్ ఎందుకు చేశాడు అన్న కోణంతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.