‘ముగ్గురు మహిళా మాతృమూర్తులను తెలంగాణ మరిచి పోకూడదు’
x

‘ముగ్గురు మహిళా మాతృమూర్తులను తెలంగాణ మరిచి పోకూడదు’

తెలంగాణ సాధనలో ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషించారు. ఆఖరి రోజున వీరి తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్లే ఏళ్ల తరబడి తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం సాకారమైంది.


సాక్షి దిన పత్రికలో ఈ రోజు వచ్చిన మిత్రుడు బి నర్సన్ వ్యాసం చాలా బాగుంది. అవన్ని వాస్తవాలు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయగలిగి ఉండి కూడా పదేళ్లు తెలంగాణ ప్రజలను కష్ట పెట్టింది. వాయిదా వేస్తూ వచ్చింది వాస్తవం. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్ర ఎంపీలు, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆంధ్ర లాబీలో అర్థబలంతో పాటు రాజకీయంగా అధికంగా ఎంపీలు కలిగి ఉండి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టగలిగే స్థాయి, సంఖ్యాబలం మొదలైనవి ప్రధాన కారణాలు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం ఒకసారి రాజీనామా చేసినా ఇంత నిర్బంధం, ఇన్ని బలిదానాలు, ఇంత ఆలస్యం కావడాలు ఉండేవికావు.

2006, 2009 లలో రావలసిన తెలంగాణ మరో అయిదేళ్లు వాయిదా పడడానికి కాంగ్రెస్, టిఆర్‌ఎస్ కెసిఆర్ రాజకీయ చదరంగం ఆటలు ప్రధాన కారణం. అయినప్పటికీ తెలంగాణను సాకారం చేసిన కీర్తి సోనియా గాంధీకి, మన్మోహన్ సింగ్‌కు, స్పీకర్ మీరా కుమార్‌కు , బిజేపి నేత సుష్మా స్వరాజ్‌కు దక్కుతుంది. ముగ్గురు మహిళల పట్టుదల చివరి క్షణంలో వేసిన ఎత్తుగడలను మరచి పోకూడదు. ముగ్గురు మహిళల కృషిని సాహసాన్ని ఎంత పొగిడినా తక్కువే అని మరచి పోరాదు. కాంగ్రెస్ 2004 నుండి 2014 దాకా అనేక పార్టీల కలయిక స్వయంగా స్వశక్తిలేని మైనారిటీ ప్రభుత్వం. 148 కాంగ్రెస్ సీట్లలో ఎక్కువ సీట్లు ఎ పి సమైక్య రాష్ట్రానివే. ఆంధ్ర లాబీ రాజకీయంగా ఆర్థికంగా పారిశ్రామిక వేత్తలుగా కాంట్రాక్టర్లుగా అత్యంత బలీయమైన శక్తులు. వారితో పోలిస్తే తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు బలహీనులు.

పార్లమెంటు ఆఖరి ఘడియలు అయిపోవస్తున్నాయి. అందరిలో టెన్షన్. తెల్లారితే పార్లమెంటు ఇక మళ్ళీ జరగదు. సినిమాల్లో క్లైమాక్స్ సీన్లు పెట్టే టెన్షన్ కన్నా ఎన్నో రెట్లు టెన్షన్! ఒక రోజు ముందు నుండి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేయని ప్రయత్నం లేదు. తాము ఎంపీగా ఉన్నపుడే తెలంగాణ తేవాలి. తరువాత ఎవరు గెలుస్తారో? ఏ ప్రభుత్వం వస్తుందో? టెన్షన్... భరించ లేని టెన్షన్. టెన్షన్‌తో తల పగిలి పోతున్నది. చిట్ట చివరి ప్రయత్నంగా తెలంగాణ ఎంపీలు ఉదయమే లేచారు. వెంటనే తయారయ్యారు. అందరు పరస్పరం ఫోన్లు చేసుకున్నారు. సోనియా గాంధీని కలిశారు. స్పీకర్ మీరా కుమార్‌ను కలిశారు. మరో వైపు లగడపాటి వంటి వారు వారి ప్రయత్నాలు చేస్తున్నారు . పార్లమెంటు సమావేశాలు ఆఖరి రోజు. తప్పితే మళ్లీ ఎలక్షన్ల తరువాతే!

ముగ్గురు మహిళలు హామీ ఇచ్చారు. మేము చూసుకుంటాం అని. కోట్లాది తెలంగాణ ప్రియులకు టెన్షన్. టీవీలకు అతుక్కు పోయారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా చర్చలు పొడిగించే ట్రిక్కులు చర్చలు సాగదీసే కుట్రలు కొనసాగుతున్నాయి. చివరి నిమిషంలో లగడపాటి పెప్పర్ స్ప్రేలు ప్రయోగించారు. చిట్ట చివరకు మీరా కుమార్ స్పీకర్ ఓటింగ్ ప్రకటించి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టాన్ని లోక్‌సభ ఆమోదించింది అని ప్రకటించారు . ఆ మాట టీవీలో విన్న తెలంగాణ ప్రజలు , 1968 నుండి స్వరాష్ట్రాన్ని కలగంటున్న ఉద్యమ కారులు, సీనియర్ సిటిజన్ల గుండెలు పగిలి పోతాయో ఏమో అన్నంత సంతోషం. ఆనందంతో ఎందరికి గుండె పోటు వచ్చిందో లెక్క లేదు.

ఆ రోజు రాత్రంతా ఆనంద హేల, కోలాహలం. ఆ సందర్భం ఆ ఆనందం వర్ణించలేనివి. ఆనాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు కూడా దేశ ప్రజలు ఇంత ఆనందంగా లేరు. ఒక వైపు దేశ విభజన, మరోవైపు వేలాది మంది వలసలు, హత్యలు, దోపిడి, దౌర్జన్యాలు, మాన భంగాలు, ప్రాణాలు అరచేత పట్టుకొని అటు ఇటు రైల్లలో పరుగులు శవాల గుట్టలు. అదొక బీభత్సమైన హత్యాకాండ. అది ఆనందం కలిగించని దురదృష్ట క్షణాలు. చరిత్రలో మాయని మచ్చలుగా నిలిచి పోయిన చీకటి రోజులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన అందుకు భిన్నంగా మన కష్టాలన్నీ తీరాయని పట్టలేని ఆనంద సన్నివేశం. ఆ చివరి క్షణాల ఉత్కంఠ భరిత సన్నివేశాలకు సాహసంతో ముందుకు సాగిన ముగ్గురు మహిళా నాయకులు సోనియా గాందీ, మీరాకుమార్, సుష్మా స్వరాజ్‌లు భారత దేశ చరిత్రలో తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి పోయారు.

నాలుగు దశాబ్దాలు ఉద్యమాలను చేసిన , చూసిన ఉద్యమకారులు, సీనియర్ సిటిజన్లు ఆనందం పట్టలేక, కృతజ్ఞతను తెలపడం ఎలానో తెలియక, తెలంగాణ తల్లికి సోనియమ్మ ముఖాన్ని పోస్టు చేసి ఫ్లెక్సీ బ్యానర్లు కరపత్రాలు పంచుకున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి 2014 జూన్ రెండవ తేదీని తెలంగాణ అపాయింటెడ్ డేగా ప్రకటించడం దాకా సాగిన ఉత్కంఠ వర్ణించలేనిది. మాటలకందని ఇన్ని ఘట్టాలకు త్రిమూర్తుల వంటి ముగ్గురు మహిళా నాయకులు తెలంగాణ ప్రజలకు చిరస్మరణీయులు. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో వీరి కృషి, సాహసం, పట్టుదల అంతర్భాగం. వారి కృషిని సహకారాన్ని మర్చిపోవడం అంటే మనకు మనమే చరిత్రకు ద్రోహం చేసిన వారమవుతాము.

Read More
Next Story