దానం నాగేందర్, కడియంకు మరోసారి నోటీసులు
x

దానం నాగేందర్, కడియంకు మరోసారి నోటీసులు

అనర్హత పిటిషన్లపై అఫిడవిట్‌లు దాఖలు చేయాలని చెప్పిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.


ఫిరాయింపు నేతల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు డెడ్‌లైన్ పెట్టడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే గురువారం అరెకెపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని స్పీకర్ విచారించనున్నారు. ఇదే సమయంలో అనర్హత పిటిషన్లపై తాను ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వని కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు తాజాగా నోటీసులు జారీ చేశారు. వారు తమ అఫిడవిట్‌లను తప్పనిసరిగా దాఖలు చేయాలని స్పీకర్ తన నోటీసుల్లో స్పష్టం చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల్లోనే దాదాపు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్.. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ న్యాయపోరాటం స్టార్ట్ చేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే మూడు నెలల్లో ఫిరాయింపు నేతలపై నిర్ణయం తీసుకోవాలంటూ ధర్మాసనం.. జూలై 31న ఆదేశించింది. అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఆ గడువులోగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే ధర్మాసనం ఇచ్చిన గడువులోగా తీర్పు ఇవ్వలేకపోయామని, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి తమకు మరో రెండు నెలల సమయం కావాలని కోరుతూ స్పీకర్ తరఫున శాసనసభ కార్యదర్శి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. కార్యదర్శి మిసిలేనియస్ దాఖలు చేసిన అప్లికేషన్ 14వ నంబరులో లిస్ట్ అయింది. సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంలో స్పీకర్‌కు మరో నాలుగు వారాల సమయం ఇచ్చింది. దీంతో స్పీకర్ ఈ అంశంలో స్పీడ్ పెంచారు.

ఢిల్లీకి దానం నాగేందర్..

తెలంగాణలో ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ వేగవంతం చేశారు. ఈ సమయంలో దానం నాగేందర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆయన కలవనున్నారని తెలుస్తోంది. విచారణ నేటితో ముగిసినా కూడా ఆయన ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయలేదు. విచారణకు హాజరైతే అనర్హత వేయబడే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో దానం ఉన్నట్లు సమాచారం. అనర్హత వేటు పడితే మళ్ళీ ఆరేళ్ల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు..! అప్పటివరకు వేచి చూస్తే నష్టమని.. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తే నే మంచిదనే యోచనలో దానం ఉన్నారని తెలుస్తోంది. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం..గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. మిగతా పార్టీ మారిన ఎమ్మెల్యేల మాదిరిగా దానం కు తప్పించుకునే అవకాశాలు లేవు. కాంగ్రెస్ తరుపు నుంచి ఎంపీగా పోటీ చేయడే అందుకు కారణం. ఇటీవల సుప్రీమ్ కోర్టు స్పీకర్ ను గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో.. స్పీకర్ త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది... ఈ రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తేనే మంచిదని న్యాయ నిపుణులు దానం కు సూచించినట్లు తెలిస్తోంది. ఈ అంశాలపైనే పార్టీ పెద్దలతో చర్చించడానికి దానం ఢిల్లీకి వెళ్లాడని చర్చ జరుగుతోంది.

విచారణ చివరి రోజు

పార్టీ ఫిరాయింపుల కేసుల్లో విచారణ ఈరోజుతో (గురువారం) ముగియనుంది. విచారణ ఆలస్యం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కేసులను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. రెండో విడత విచారణలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను ఈరోజు పిలిపించారు. ఉదయం పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి కేసును స్పీకర్ పరిశీలించారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్నారు. మధ్యాహ్నం అరికెపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరగనుంది. ఈ విచారణలు పూర్తయితే మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల కేసులు పూర్తవుతాయి.

Read More
Next Story