
క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలి...
క్రీడా పోటీలు, సబ్ కమిటీల ఏర్పాటుపై తీర్మానాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్ర క్రీడా భవిష్యత్తుపై తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కీలక తీర్మానం చేసింది. ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించినా అందులో రాష్ట్రానికి అవకాశం కల్పించాలని ఈ తీర్మానంలో పేర్కొంది. దాంతో పాటుగానే రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపర్చడం, కోచ్‌లు, ట్రైనర్‌లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు సబ్ కమిటీల ఏర్పాటుకు బోర్డు తీర్మానాలు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశం హైదరాబాద్‌లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలని ఆకాంక్షించారు. తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. క్రీడా రంగం ప్రోత్సాహానికిగానూ గతంతో పోల్చితే 16 రెట్లు బడ్జెట్ పెంచామని సీఎం వివరించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు. క్రీడా రంగం ప్రాధాన్యతను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టేడియాలు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని, వాటిని సమగ్రంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు బోర్డు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం కోరారు. క్రీడా రంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే బోర్డులో ప్రముఖ కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని సీఎం తెలిపారు.
ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ తొలుత క్రీడా సంస్కృతిని పెంపొందించాలని... ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని అభిప్రాయపడ్డారు. హర్యానాలో కుస్తీతో ప్రతి క్రీడకు పల్లెల్లో చోటు ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు, వ్యాయామ సంచాలకుడు ఉండేలా చూడాలన్నారు. ధాని ఫౌండేషన్ వీతా ధానీ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని... వ్యాయామ అక్షరాస్యత (Physical literacy)పై అవగాహన పెంపొందించాల్సి ఉందన్నారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీలు దశలవారీగా ఉండాలని.. అప్పుడు మెరుగైన క్రీడాకారుల ఎంపిక సాధ్యమవుతుందన్నారు...హబ్ కో ఛైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల మాట్లాడుతూ ఫిజియోథెరపిస్టు కోర్సులను క్రీడా యూనివర్సిటీలో ప్రారంభించాలని కోరారు. అలాగే స్పోర్ట్స్ సామగ్రిపై పన్నుల భారం భారీగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. హబ్ ఛైర్‌పర్సన్ డాక్టర్ సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ ప్రపంచ ప్రముఖ కంపెనీల సీఈవోలు ఈ ప్రాంతం నుంచే ఉన్నందున వారి సేవలను క్రీడాభివృద్దికి వినియోగించుకోవాలన్నారు.
విశ్వ సముద్ర ఫౌండేషన్ చింతా శశిధర్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి అవసరమైన సామగ్రిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు...క్రీడా నిర్వాహకులు బియ్యాల పాపారావు మాట్లాడుతూ ఐఐటీ ప్రొఫెసర్లు మాదిరి స్పోర్ట్స్ యూనివర్సిటీలో కోచ్‌లు ఉండాలన్నారు. ఫుట్ బాట్ టీమ్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో స్టేడియాలు, క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు. ఇంగ్లాండ్‌లో ప్రతి ఆటకు లీగ్స్ ఉంటాయని...అలాగే మన దగ్గర ప్రతి ఆటకు లీగ్స్ ఉండాలన్నారు.
ప్రముఖ క్రీడాకారుడు రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ మనకు ఉన్న స్టేడియాలను మెరుగ్గా వినియోగించుకోవాలని, వాటి నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న క్రీడా పోటీల విధానాన్ని మార్చుతూ గ్రామ, మండల, శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. శాసనసభ నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్ల మధ్య పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించి అంతిమంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేస్తామన్నారు.. క్రీడా సామగ్రిపై ఉన్న పన్నుల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని... తమ స్థాయిలో అవసరమైన ప్రోత్సాహాకాలు అందిస్తామని తెలిపారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ, ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెడతామని బోర్డు సభ్యులకు తెలియజేశారు. స్టేడియాలు పెద్ద సంఖ్యలో ఉన్నా తగిన సంఖ్యలో కోచ్‌లు లేరని, ఉన్న కోచ్‌లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినట్లు శిక్షణ ఇప్పించాల్సి ఉందన్నారు. రానున్న మూడేళ్లలో మనం సాధించాల్సిన లక్ష్యాలపై బోర్డు తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. సమావేశంలో క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోని బాల దేవి తదితరులు పాల్గొన్నారు.