రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా.. కారణమేంటి?
x

రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా.. కారణమేంటి?

లోగో ఫైనల్ అయిపోయింది, ఇక జూన్ 2న ఆవిష్కరించడమే తరువాయి అని వార్తలు జోరందుకున్నాయి. కానీ, రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రాష్ట్రంలో అనేక మార్పులకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ కొత్త లోగో ని దశాబ్ది వేడుకల్లో ఆవిష్కరించాలని భావించింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై కళాకారుడు రుద్ర రాజేశం, కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. దీంతో లోగో ఫైనల్ అయిపోయింది, ఇక జూన్ 2న ఆవిష్కరించడమే తరువాయి అని వార్తలు జోరందుకున్నాయి. కానీ, రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర చిహ్నాన్ని మొదట జూన్ 2న రిలీజ్ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 2న కాకుండా మరో రోజు రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం మాత్రం జూన్ 2నే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

నిరసనల నేపథ్యంలోనే...?

రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తుండటంపై వ్యతిరేకగళం వినిపిస్తోంది. రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించడాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు గుర్తులు కాదు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ ను తొలగిస్తే సహించేది లేదని, చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమేనని బీఆర్ఎస్ వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

"రాజ్యం తెచ్చిన నిజమైన రాజులు ఎవరయ్యా అంటే మన తెలంగాణ అమరవీరులు. వారి ఉనికిని ప్రశ్నార్థకం చేసి, రాజ్యం ఏలే రాజులు.. మేమే తెలంగాణకు సర్వం.. సర్వస్వం అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది ప్రజా తెలంగాణ.. ఇక్కడ ప్రస్తుతం నడుస్తుంది ప్రజాపాలన. ప్రజా పాలనలో ప్రజలే మాకు దేవుళ్ళు.. వారి త్యాగాలే మాకు ఆనవాళ్ళు. ఆ ఆనవాళ్ళకు పట్టం కడుతూ మన రాజముద్రను వారి ఆశయాలకు అనుగుణంగా మార్చబోతున్నాం" అని కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. అయినప్పటికీ నిరసనలు వస్తున్న నేపథ్యంలో లోగో ఆవిష్కరణ వాయిదా వేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

చార్మినార్ వద్ద నిరసనలు...

రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఉద్యమం చేస్తామన్న కేటీఆర్... గురువారం చార్మినార్ వద్ద నిరసనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికార చిహ్నంలో చార్మినార్ తొలగింపుకు నిరసనగా చార్మినార్ వద్ద కేటీఆర్ తోపాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... "హైదరాబాద్‌కు ప్రతీక చార్మినార్. ప్రపంచ చరిత్రలోనే హైదరాబాద్‌ కు, చార్మినార్‌ కు విడదీయరాని సంబంధం ఉంది. అలాంటి చార్మినార్‌ ను, కాకతీయ కళాతోరణంను రాజముద్ర నుండి తీసే అవసరం ఏమొచ్చింది. ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి లేదంటే దీనిపై నిరసనలు చేపడుతాం" అని హెచ్చరించారు.

Read More
Next Story