అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్
అమెరికాలో వారం రోజులుగా మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ వార్త కలకలం రేపుతోంది. మే 2 నుంచి అతని ఆచూకీ తెలియకుండా పోయింది.
అమెరికాలో వారం రోజులుగా మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ వార్త కలకలం రేపుతోంది. తెలంగాణలోని హన్మకొండ కి చెందిన రూపేష్ చంద్ర చింతకింది షికాగో విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. అయితే మే 2 నుంచి అతని ఆచూకీ తెలియకుండా పోయింది.
రూపేష్ మే 2 న కుటుంబసభ్యులతో వాట్సాప్ కాల్ మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి అతనికి కాల్ చేయడానికి ప్రయత్నిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అతని రూమ్మేట్స్ కి కాల్ చేసి ఆరా తీయగా.. ఎవర్నో కలవడానికి వెళ్లి తిరిగి రాలేదన్నారు. ఎవర్ని కలవడానికి వెళ్ళాడో మాత్రం తెలియదని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు రూపేష్ చంద్ర అదృశ్యమైనట్లు షికాగో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు అమెరికా ఎంబసీని కూడా సంప్రదించారు.
దీనిపై స్పందించిన షికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, రూపేష్ చంద్ర ఆచూకీ కోసం పోలీసులు, అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కాన్సులేట్ జనరల్ ట్విట్టర్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టింది.
"రూపేష్ చింతకింది ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని" షికాగో పోలీసులు ఒక ప్రకటనలో ప్రజలను కోరారు. ప్రకటన ప్రకారం.. అతను N షెరిడాన్ రోడ్, 4300 బ్లాక్ నుండి తప్పిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది మార్చిలో తప్పిపోయిన హైదరాబాద్ కి చెందిన మరో భారతీయ విద్యార్థి అబ్దుల్ అర్ఫాత్ అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. అతని మరణంపై సమగ్ర దర్యాప్తు జరిగేలా స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు.
అలాగే ఇదే ఏడాది, ఏప్రిల్ లో క్లీవ్‌ల్యాండ్ లో భారత విద్యార్థి గద్దె ఉమా సత్య సాయి మృతి కూడా మిస్టరీగానే ఉంది. దీనిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది.
ఈ ఫిబ్రవరిలో షికాగోలో ఒక భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. దాడి తరువాత, షికాగో లోని భారత కాన్సులేట్... బాధితుడు సయ్యద్ మజాహిర్ అలీతో పాటు భారతదేశంలోని ఆయన భార్యతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది.
కాగా, అమెరికాలో తరచూ భారత విద్యార్ధులపై దాడులు జరుగుతుండటం వారి కుటుంబసభ్యుల్ని ఆందోళనకి గురి చేస్తోంది.