తెలంగాణలో అడవులు మాయం...
x

తెలంగాణలో అడవులు మాయం...

2014-2024 మధ్య అటవీ భూములు కోల్పోయిన రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ త్రీ


తెలంగాణలో 2014- 2024 మధ్య దశాబ్దంలో అభివృద్ధి పేరుతో జరిగిన అటవీ భూముల నిర్మూలన అంతా ఇంతా కాదు. అడవులను చెడమడా నరికేసిన రాష్ట్రాలలో తెలంగాణ దేశంలో మూడవది. ఇదే విషయంలో దక్షిణాది రాష్ట్రాలలో నెంబర్ వన్.

ఈ పదేళ్ల కాలంలో వివిధ ప్రాజెక్టుల కోసం రాష్ట్రం 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని తెలంగాణ కోల్పోయిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.

బీహార్ నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ ఎంపీ రాజా రామ్ సింగ్ కుష్వాహా లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యాదవ్ ఈ విషయం వెల్ల డించారు.

ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, 2023 లో చెప్పినట్లు 1996- 2023 మధ్య అభివృద్ధి కార్యకలాపాల కోసం పెద్ద ఎత్తున అడవులను నిర్మలించారనే విషయం వాస్తవమేనా అని కుష్వాహ ప్రశ్నించారు.

అదే విధంగా గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి కార్యకలాపాల కోసం ఎంత అటవీ భూమిని నిర్మూలించేందుకు అనుమతినిచ్చారని కూడి లిబరేషన్ ఎంపి అడిగారు.,

2014-15, 2023-24 మధ్య అటవీ సంరక్షణ చట్టం, 1980 నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సహా వివిధ అటవీయేతర ప్రయోజనాల కోసం మొత్తం 1,73,396.87 హెక్టార్ల (4,28,473 ఎకరాలు) అటవీ ప్రాంతాన్నివిడుదల చేసినట్లు కేంద్రమంత్రి యాదవ్ తెలిపారు.

అటవీ నిర్మూలనలో తెలంగాణ వాటా మొత్తం వాటాలో దాదాపు ఏడు శాతం ఉంది. గత భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వం 'పోడు' సాగు పేరుతో అటవీ భూమిని పంపిణీ చేసిన వివరాలు ఇందులో లేవు.

ఇలా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సుమారు 38,553 హెక్టార్ల భూమికి అనుమతులు పొందడం ద్వారా మధ్యప్రదేశ్ రాష్ట్రం ముందుంది. తర్వాత 24,459 హెక్టార్లను మళ్లించిన ఒడిశా రాష్టం రెండో స్థానంలో ఉంది.

తెలంగాణలో మళ్లించబడిన మొత్తం అటవీ భూమిలో, 3,168.13 హెక్టార్లు (7,829 ఎకరాలు) ప్రస్తుతం పనిచేయని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చారు. ఈ భూమి మహదేవ్పూర్, కరీంనగర్-సిర్సిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్సువాడ, నిర్మల్ వంటి ఎనిమిది అటవీ డివిజన్లతో పాటు వన్యప్రాణుల అభయారణ్యాల భూమి కూడా ప్రాజక్టులకు బలయింది.

మిషన్ భగీరథ, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేయడం వంటి ఇతర ప్రాజెక్టులకు కూడా అటవీ భూములు మళ్లాయి.

Read More
Next Story