Birdflu
x

ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులు బంద్.. ప్రభుత్వ హెచ్చరికే కారణం

మనుషులకు బర్డ్ ఫ్లూ సోకితే మరణమే శరణ్యమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోంది.


ఆంధ్ర కోళ్ల దెబ్బకు తెలంగాణ ప్రభుత్వం హైఅలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని చికెన్ ప్రియులు, కోళ్ల పెంపకందారులు, చికెన్ వ్యాపారులు అంతా కూడా తస్మాత్త్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది తెలంగాణ సర్కార్. ఆంధ్ర నుంచి వస్తున్న కోళ్లను రాష్ట్రంలో ఎంటర్ కానివొద్దని పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ బోర్డర్‌లో పోలీసులు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. తమ కళ్లుగప్పి ఒక్క కోడి కూడా తెలంగాణలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆంధ్ర కోళ్లకు ఇంతలా భయపడానికి కారణం.. అక్కడ బర్డ్‌ఫ్లూ ప్రబలుతుండటమే. ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీని వల్ల మరణిస్తున్న కోళ్లు కూడా భారీగానే ఉన్నాయి. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ఇతర జిల్లాల్లో కూడా భారీ సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించాయి. ఇందుకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా(హెచ్5ఎన్1- బర్డ్ ఫ్లూ) కారణమని వైద్యులు నిర్దారించారు. ఈ వ్యాధి ఏపీలో వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా తెంగాణలోకి కూడా వ్యాపించే ప్రమాదం ఉందని తెలంగాణ అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తెలంగాణలోకి ఏపీ నుంచి కోళ్లు, కోళ్ల ఉత్పత్తులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం ఎక్స్ రోడ్ లోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు, వెటర్నరీ డాక్టర్లు తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేసి వాటిని తెలంగాణలోకి రాకుండా వెనక్కి పంపుతున్నారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గత వారం రోజులుగా ఈ తనిఖీలను చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు, వెటర్నరీ డాక్టర్లు కోడి మాంసం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

బర్డ్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది?

బర్డ్ ఫ్లూ అనేది పెంపుడు పక్షులు, అడవి జాతి పక్షులకు సంబంధించి అంటు వ్యాధి. ఇది పక్షులతో పాటు నక్కలు, అడవి కుక్కలు, అటవీ జంతువులు, సముద్ర జలచరాలకు వస్తుంది. ఒక్కోసారి కుక్కలు, ఆవులు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కూడా వస్తుంటుంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యాధి ఏమీ కాదు.. దాదాపు వందేళ్ల్ నుంచే ఉందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. కాగా తొలి కేసు మాత్రం 1996లో చైనాలో బయటపడింది. పక్షుల రెట్టలు, వాటి లాలా జలం, కలుషిత ఆహారం, కలుషిత నీరు వంటి వాటి ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఈ వ్యాధి మనుషులకు అంత త్వరగా సోకదు. కానీ వ్యాధి బారిన పడిన జంతువులతో కలిసి ఉంటే మాత్రం ఈ వ్యాధి ప్రమాదం తప్పకుండా ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 20ఏళ్లలో 888 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వారిలో 463 మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు కోలుకున్నారు. ఈ వ్యాధి వల్ల 52శాతం మరణాల రేటు నమోదైంది. ఈ వైరస్ సోకిన వారిలో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్‌ఫెక్షన్లు, నిమోనియా వంటి వ్యాధి లక్షణాలు కనిపించవచ్చని నిపుణులు చెప్తున్నారు.

Read More
Next Story