మహాశివరాత్రి పర్వదినం (MahaShivaratri) సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శివాలయాలు ముస్తాబయ్యాయి.శివరాత్రి సందర్భంగా భక్తులు శివాలయాల్లో అభిషేకాలు చేసి ప్రదక్షిణలు చేసేందుకు సమాయత్తం అయ్యారు. శివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాసాలుండి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక శాఖల అధికారులు మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. లక్షలాది మంది భక్తులు మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలను దర్శించుకోనున్నారు.కేవలం పండ్లు తిని ఉపవాసాలుండి శివుడికి పూజలు చేసేందుకు సమాయత్తం కావడంతో వీటి ధరలు పెరిగాయి.(Namah Shivaya,Shiva temples resound)
కాళేశ్వరంలో పవిత్ర సంగమం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరి తీరంలో ఉన్న కాళ్లేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని మహాశివరాత్రి వేడుకలకు సిద్ధం చేశారు. ఒకే పీఠంపై రెండు శివలింగాలు ఉన్నాయి. దేశంలో త్రిలింగ్ దేశంగా ప్రస్థావించిన మూడు శివాలయాల్లో కాళేశ్వరం ఒకటి. పవిత్రమైన కాళేశ్వరం వద్ద భక్తి , ఆధ్యాత్మికతల సంగమం మరపురాని ప్రకాశాన్ని అందిస్తుంది.
ఉత్సవాలకు రాజన్న సన్నిధి సిద్ధం
తెలంగాణలోని పురాతన సుప్రసిద్ధ శివాలయమైన శ్రీ రాజరాజేశ్వర ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం చేశారు. రాజన్న సన్నిధిని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు.సోమశిల ఆలయంలోనూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తనున్నారు.
కీసరగుట్ట
హైదరాబాద్ మహా నగరానికి సమీపంలో 40కిలోమీటర్ల దూరంలోని కీసరగుట్ట శివాలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తనున్నారు.ఈసీఐఎల్ కు 12 కిలోమీటర్ల దూరంలో చిన్న కొండపై ఉన్న ఈ దేవాలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పురాతన మైన ప్రసిద్ధ దేవాలయమైన కీసరగుట్టలో భక్తులు అభిషేకాలు చేయనున్నారు. శివుడికి రుద్రాభిషేకం, పాలు, తేనెతో అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించనున్నారు.భక్తుల కోసం టీజీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
రామప్ప మందిరం
వరల్డ్ హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. నాడు కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయానికి మహా శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలు తరలిరానున్నారు. గ్రానైట్, డోలరైట్, పోరస్ ఇటుకలతో పిరమిడ్ ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం ప్రసిద్ధ చెందింది.రుద్రేశ్వర ఆలయంగా పేరొందిన రామప్ప వరంగల్ నగరానికి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలం - హైదరాబాద్ మార్గంలో మహేశ్వరం శివాలయాన్ని పుష్కరిణిపై నిర్మించారు. నల్గొండ జిల్లా పానగల్ గ్రామంలోని ఛాయా సోమేశ్వర ఆలయంలోనూ శివరాత్రి ఉత్స జరగనున్నాయి.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి గ్రామంలోని ఒక కొండపై కొమురవెల్లి మల్లన్న ఆలయం ఉంది. ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం సిద్దిపేటకు సమీపంలో ఉంది. ప్రధాన దేవత మల్లన్న లేదా మల్లికార్జున స్వామి, శివుని రూపంగా వెలుగొందుతోంది. కరీంనగర్ జిల్లా విలాసాగర్ గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ త్రిలింగ సంఘమేశ్వర స్వామి ఆలయంలో మూడు శివలింగాలున్నాయి.శ్రీ త్రిలింగ సంఘమేశ్వర స్వామి ఆలయం కరీంనగర్ పట్టణం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మహా శివరాత్రికి ఏర్పాట్లు చేశాం : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం శివాలయాల్లో పటిష్ఠ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు,మున్సిపల్, విద్యుత్, ఇతర శాఖలతో సమన్వయంగా పని చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉపవాసం ఉండే భక్తులకు ఉచితంగా పండ్లు, అల్ఫాహారాన్ని పంపిణీ చేయాలని మంత్రి సూచించారు.