కోట్లు వెచ్చించినా తీరని తెలంగాణ కోతుల బెడద
x
పంటలకు కోతుల బెడద...నష్టపోతున్న రైతులు

కోట్లు వెచ్చించినా తీరని తెలంగాణ కోతుల బెడద

హిమాచల్ ప్రయోగానికి సిద్ధమవుతున్న అధికారులు


తెలంగాణ రాష్ట్రంలో కోతుల బెడదకు తెరపడటం లేదు. 2020 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు గడచిన అయిదేళ్లలో కోతుల బెడద నివారణకు తెలంగాణ (Telangana)రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేసింది. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా గత అయిదేళ్లలో కేవలం 1750 కోతులకే కుటుంబనియంత్రణ ఆపరేషన్లు(sterilization) చేశారు. కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ముందుకు రావాలి. ఒక కోతిని పట్టుకునే ఎనిమల్ హ్యాండ్లర్స్ కు 500 రూపాయల నుంచి 800 రూపాయలు ఇవ్వాలి. కానీ ఆ నిధులు లేక కోతులకు ఆపరేషన్లు చేయడం లేదు.ఆపరేషన్లు చేసేందుకు కోతుల రక్షణ, పునరావాస కేంద్రం ఉన్నా, పంచాయతీలు,మున్సిపాలిటీల కోతులను తీసుకురాకపోవడంతో ఆశించిన మేర ఆపరేషన్లు జరగడం లేదు.


తెలంగాణలో కోతుల బెడద ఎక్కడంటే...
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి ,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువ గా ఉంది.



దక్షిణాదిలోనే ప్రథమం...

దక్షిణాదిలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోని కోతుల బెడదను తీర్చేందుకు వీలుగా నిర్మల్ జిల్లా (Nirmal District) చించోలి గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కోతుల రక్షణ, పునరావాస కేంద్రాన్ని( Monkey Rescue and Rehabilitation Center) 2020 డిసెంబరు 20వతేదీన అప్పటి అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. రైతులు, గ్రామస్థులకు కోతుల బెడద సమస్యను పరిష్కరించేందుకు వీలుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా తరహాలో కోతుల సంఖ్యను నిరోధించాలని నిర్ణయించారు. సిమ్లా తరహాలో కోతుల బెడదను దూరం చేయాలని అక్కడ అధ్యయనం చేసి, అక్కడికి తెలంగాణ పశుసంవర్ధకశాఖ అధికారులకు శిక్షణ ఇప్పించి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కోతులకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేసి వీటి సంఖ్య పెరగకుండా నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కోతుల నిరోధానికి సిమ్లా మోడల్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా ప్రాంతంలో సందర్శించే టూరిస్టులకు, యాపిల్ తోటలకు కోతుల బెడదను నివారించాలని అక్కడి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 8 కోతుల రక్షణ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.సిమ్లాలో అత్యంత విలువైన ఆపిల్ తోటలున్నాయి. కోతుల బెడద వల్ల ఆపిల్ పంట రైతుల చేతికి అందటం లేదు. దీంతో పాటు సిమ్లాలో పర్యటించేందుకు వస్తున్న పర్యాటకులపై కోతులు దాడులు చేస్తున్నాయి. దీంతో కోతుల సంఖ్యను నిరోధించడానికి కోతుల రక్షణ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, కోతులను పట్టుకోవడానికి ఎనిమల్ హ్యాండ్లర్లకు నిధులిచ్చి వాటికి లాప్రోస్కోపిక్ పద్ధతిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశారు.దీంతో కోతుల బెడద తగ్గి సిమ్లాలో ఈ కేంద్రాలు సక్సెస్ అయ్యాయి.



ఇద్దరు పశుసంవర్థకశాఖ వైద్యులకు శిక్షణ

తెలంగాణకు చెందిన ఇద్దరు పశుసంవర్థకశాఖ వైద్యులు సిమ్లాకు వెళ్లి కోతులకు స్టెరిలైజేషన్ ఎలా చేయాలనే అంశంపై శిక్షణ పొందారు.ప్రతీ ఏటా ఒక్కో కోతి మూడు సార్లు పిల్లలను పెడుతుంది. కోతుల సంఖ్యను నిరోధించేందుకు కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని దక్షిణాదిలోనే మొట్టమొదటిసారి నిర్మల్ జిల్లాలోని చించోలి గ్రామంలో కోతుల రక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఒకే కేంద్రం ఏర్పాటు చేయడంతో ఆశించిన మేర కోతులకు స్టెరిలైజేషన్ చేయలేక పోయారు.ఈ కేంద్రం ఆశయం మంచిదైనా ఆచరణలో విఫలమైంది.సిమ్లాలో కోతులను పట్టి తెచ్చే ఎనిమల్ హ్యాండ్లర్లకు ప్రభుత్వమే బడ్జెట్ నిధులు ఇస్తుండటంతో అక్కడ సిమ్లా ప్రయోగం సక్సెస్ అయింది. కానీ కోతులను పట్టి తీసుకువచ్చి అప్పగించే బాధ్యతను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. కోతులు పట్టే ఎనిమల్ హ్యాండ్లర్లకు డబ్బులు లేక పంచాయతీలు, మున్సిపాలిటీలు చేతులు ఎత్తేశాయి.

కోట్ల రూపాయలు వెచ్చించినా...సాధించని లక్ష్యం
కోతుల నియంత్రణ కోసం వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు నిర్మల్ కోతుల రక్షణ, పునరావాస కేంద్రానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించినా, కోతులను పట్టించే వారు లేక ఆ నిధులు ఖర్చు కాలేదు. దీనికి తోడు అటవీశాఖ కోట్లాది రూపాయలు వెచ్చించినా కోతుల నియంత్రణ కాగితాలకే పరిమితమైంది. గత అయిదేళ్లలో కోట్లాదిరూపాయలు వెచ్చించినా కేవలం 1749 కోతులకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.59.00 లక్షలు, 2019-20లో రూ.30.00 లక్షలు , 2020-21లో రూ.40.00లక్షలు, 2021-22లో రూ.30.00 లక్షలు,2022-23లో రూ.35 లక్షలు, 2023-24లో రూ.50 లక్షల బడ్జెట్ విడుదల చేసినా కోతుల బెడద నివారణకు బ్రేకు పడటం లేదు. మగ కోతులకు వేసెక్టమీ (Vasectomy in Male Monkey), ఆడ కోతులకు లాప్రోస్కోపిక్ ( Laparoscopy in Female) ఆపరేషన్లు చేయాలి.



1749 కోతులకు కు.ని. ఆపరేషన్లు

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎనిమల్ హ్యాండ్లర్లు 4,133 కోతులను పట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేందుకు నిర్మల్ లోని కోతుల రక్షణ, పునరావాస కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే పిల్ల కోతులకు, అప్పటికే గర్భం దాల్చిన కోతులకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయకూడదనే నిబంధన ఉందని, దీని వల్ల తాము కేవలం 1749 కోతులకు లాప్రోస్కోపిక్ విధానంలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేశామని నిర్మల్ కోతుల రక్షణ, పునరావాస కేంద్రం డాక్టర్ శ్రీకర్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 992 కోతులకు కు. ని ఆపరేషన్లు చేశామని చెప్పారు. మెదక్ జిల్లాకు చెందిన 256 కోతులకు, ఆదిలాబాద్ కు చెందిన 159 కోతులకు, నిజామాబాద్ కు చెందిన 205 కోతులకు కు. ని. ఆపరేషన్లు చేసి వాటిని తీసుకువచ్చిన ప్రాంతాల్లోని అడవుల్లో వదిలివేశామని డాక్టర్ తెలిపారు.


పంటలు, గ్రామాల బాట పట్టిన కోతులు

అడవుల్లో కోతులకు తినడానికి పండ్ల చెట్లు కొరవడటంతో అవి గుంపులుగా అటవీ గ్రామాలపై పడ్డాయి. పంట పొలాలను కోతులు ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పంటలకు తోడు గ్రామాలపై కోతుల దండు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో 30 లక్షల కోతులు ఉన్నాయని అటవీశాఖ అధికారులు అంచనా వేయగా, వాస్తవానికి 3కోట్ల కోతులున్నాయని అనధికార అంచనా.




పంటలపై వానరమూకల దాడి

అడవుల రాష్ట్రమైన తెలంగాణలో కోతుల బెడద తీరడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ పంటలపై వానర మూకలు మూకుమ్మడి దాడులు చేస్తుండటంతో రైతులకు పంట చేతికి అందక తీవ్రంగా నష్టపోతున్నారు. అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో కోతుల దండు మొక్కజొన్న,వేరుశనగ, కంది, మినుములు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలను నాశనం చేస్తున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అటవీ ప్రాంత గ్రామాల్లో రాత్రివేళ కోతుల దండు మక్క చేలపై పడి నాశనం చేస్తున్నాయి. మొక్కజొన్న కంకులను విరిచి తినడమే కాకుండా వాటి విరగగొట్టి పడేస్తున్నాయి. పాలు పట్టే దశలో మొక్కజొన్న పంట కోతుల వల్ల దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. పొట్టదశలో ఉన్న వరి పొలాలపై కోతులు పడి వరి దుబ్బులను పీకేస్తున్నాయని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కోతుల వల్ల పంట నష్టంపై సర్వే ఏది ?
తెలంగాణ రాస్ట్రంలో కోతుల వల్ల 72,133 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని గుర్తించినట్లు 2023వ సంవత్సరంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.కానీ ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో కోతుల వల్ల జరిగిన పంట నష్టంపై సర్వే చేయలేదు. కోతుల వల్ల పంట నష్టంపై సర్వే ఎందుకు చేయలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఏడాది కోతుల బెడద పెరగడం వల్ల పంట నష్టం ఎక్కువగా జరిగిందని వ్యవసాయ శాఖ అధికారి ఎన్డీఆర్కే శర్మ చెప్పారు. గతంలో కంటే పంట నష్టం ఎక్కువగా జరిగిందని శర్మ తెలిపారు. జన్నారం మండలం మొర్రిగూడ గ్రామంలో బి రమేష్ అనే రైతు 9 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా కోతుల దాడితో తీవ్రంగా నష్టపోయారు.కోతుల వల్ల పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ములుగు జిల్లాలో 48 అటవీ గ్రామాల రైతులు కోతుల వల్ల తమ పంట నష్టం జరిగిందని ఇటీవల పస్రా ఫారెస్టు ఆఫీసు ముందు ధర్నా చేశారు.



కోతులు తిన్న పంటలకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

తెలంగాణలో పెచ్చు పెరిగిపోతున్న కోతుల బెడదను నిరోధించేందుకు రాష్ట్ర ప్ఱభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత కిసాన్ సంఘ్‌ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కోతులు పంటలపై పడి తింటున్నందు వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు.గడచిన రెండు దశాబ్దాలుగా అడవిలో ఆహారం లభించక పోవడంతో వానర మూకలు పంట పొలాలపై పడి మేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పంటల సాగు విధానం మారింది...
‘‘తెలంగాణ రాష్ట్రంలోని అడవుల జిల్లాల్లో గతంలో రైతులు వేరుశనగ, మొక్కజొన్న, పండతోటలు ఎక్కువగా సాగు చేసే వారు...కానీ కోతులదండు పంట పొలాలపై పడి తినేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, దీని వల్ల రైతులు కోతుల బెడద వల్ల పంటలు సాగు విధానాన్ని మార్చుకున్నారు. గతంలో లాగా వేరుశనగ, మొక్కజొన్న, పండతోటల స్థానంలో పత్తి, సోయాబీన్ ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు’’ అని అఖిల భారత కిసాన్ సంఘ్‌ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఇక కోతులు వన్యప్రాణులు కాదు...
కోతులు వన్యప్రాణులు కావని, వాటికి ఆ గుర్తింపు రద్దు చేసిన నేపథ్యంలో కోతుల నియంత్రణ బాధ్యత నుంచి తమ అటవీశాఖ వైదొలగిందని తెలంగాణ వన్యప్రాణుల విభాగం ప్రత్యేక అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఇక నుంచి కోతుల నియంత్రణ బాధ్యత తెలంగాణ పశుసంవర్థక శాఖ, వ్యవసాయశాఖ, పంచాయతీ, మున్సిపల్ శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కోతులు వన్యప్రాణులు కావని వైల్డ్ లైఫ్ యాక్ట్ నుంచి తొలగించిన దృష్ట్యా వీటిని అడవుల్లోకి అనుమతించలేమన్నారు. ప్రజలే కోతులకు ఆహారాన్ని వేస్తుండటంతో వీటి సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు.

కోతుల బెడద తగ్గేదెన్నడు?
కోట్లాది రూపాయలు వెచ్చించినా తెలంగాణలో కోతుల బెడద మాత్రం తగ్గలేదు. ప్రభుత్వానికి ఉన్న సంకల్పం మంచిదైనా, అమలు స్థాయిలో సమన్వయం లేకపోవడం, పంచాయతీలు,మున్సిపాలిటీల నిర్లక్ష్యం వల్ల లక్ష్యం చేరువ కాలేదు.రైతుల పంటలు కోతుల దాడులతో నష్టపోతుండగా, పునరావాస కేంద్రాలు ఖాళీగానే ఉన్నాయి. కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇకనైనా ప్రభుత్వం అన్ని శాఖలతో కలిసి సమగ్ర వ్యూహం రూపొందించి, రైతులకు నష్టం జరగకుండా, కోతుల సంఖ్య నియంత్రించే చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.


Read More
Next Story