
తెలంగాణ కు మరో రెండు ‘వందే భారత్ ’ రైళ్లు
వచ్చే పదేళ్లలో తెలంగాణలో 80 కోట్ల ఖర్చుతో రైల్వే అభివృద్ధి
అతి త్వరలోనే మరో 2 వందే భారత్ రైళ్లు రాబోతున్నాయి. సికింద్రాబాద్ నుండి పూణె వరకు, హైదరాబాద్ నుండి నాందెడ్ వరకు కొత్త వందే భారత్ రైళ్లను నడపాలనే ప్రతిపాదనలు రడీ అయ్యాయి. త్వరలోనే రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ విప్లవం స్రుష్టిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 150 వందే భారత్ రైళ్ల ద్వారా ఇప్పటి వరకు 3 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని అన్నారు.
మంచిర్యాలలో నేటి నుండి ‘‘వందే భారత్’’ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సందర్భంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి జి.వివేక్, స్థానిక ఎంపీ వంశీక్రిష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ లో రైలు మార్గాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
"భారతీయ రైల్వే చరిత్రలో ‘‘వందే భారత్’’ చరిత్ర స్రుష్టిస్తొంది. 2019 ఫిబ్రవరిలో మొదటి ‘‘వందేభారత్’’ రైలు ప్రారంభమైంది. ఇయాళ దేశవ్యాప్తంగా 150 వందేభారత్ రైళ్లు నడుస్తున్నయ్. ఈ రైళ్ల ద్వారా ఇప్పటి వరకు 3 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలను చేర్చింది. ఒక్కో వందే భారత్ రైలు తయారీకి 130 కోట్లు ఖర్చవుతుంది. మన రాష్ట్రంలో 5 వందేభారత్ రైళ్లు (సికింద్రాబాద్ – విశాఖపట్నం (2 రైళ్లు), సికింద్రాబాద్ – తిరుపతి (1 రైలు), కాచిగూడ – యశవంత్‌పూర్ (1 రైలు), సికింద్రాబాద్ – నాగపూర్ (1 రైలు)) నడుస్తున్నాయి. ఇయాళ మన ప్రాంత ప్రజలకు సైతం ఈరోజు నుండి వందే భారత్ రైలు అందుబాటులోకి రావడం, నా చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మన రాష్ట్రానికి మరో 2 వందే భారత్ రైళ్లు నడపాలనే ప్రతిపాదన కూడా ఉంది. 1.హైదరాబాద్ నుండి పూణె, 2. హైదరాబాద్ నుండి నాందెడ్ వరకు వందే భారత్ రైళ్లను నడపాలనే ప్రతిపాదనలు రడీ అయ్యాయి. త్వరలోనే రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది," అని ఆయన అన్నారు.
రాబోయే 10 ఏళ్లలో తెలంగాణలో రైల్వేల అభివ్రుద్ధికి దాదాపు 80 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు బండి సంజయ్ కుమార్ చెప్పారు. మోదీ పాలనలో రైల్వే వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయని, గత పదేళ్లలో ఒక్క తెలంగాణలోనే రైల్వేల అభివ్రుద్ధి కోసం 42 వేల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసిందని చెప్పారు.
బిజెపి నినాదాలతో గందరగోళం
ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. జై బీజేపీ, జై బండి సంజయ్ నినాదాలతో మంచిర్యాల రైల్వే స్టేషన్ మారుమోగింది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది. పరిస్థితిని గమనించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మైక్ అందుకుని ‘‘మీరు ఇట్లా నినాదాలు, గొడవలు చేసి డిస్ట్రబ్ చేస్తే ఇక్కడ ఒక్క అభివ్రుద్ధి కూడా జరిగే అవకాశం లేదు. ఒక్క పని కూడా రాదనే సంగతి గుర్తుంచుకోవాలి’’అని గట్టిగా చెప్పడంతో ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలు సద్దు మణిగాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ సహకారంతోనే మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలు అల్లాడుతున్నారని, ఈ విషయాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులను కోరారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ
మంచిర్యాల ప్రజలకు శుభవార్త
అతి త్వరలో రూ.3.5 కోట్ల వ్యయంతో మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేస్తామని. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని బండి ప్రకటించారు. అట్లాగే మంచిర్యాల స్టేషన్ ను అమ్రుత్ భారత్ పథకం కింద రూ.26 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అతి త్వరలో మంచిర్యాలను ఎయిర్ పోర్టులా మారుస్తాం. మంచిర్యాలతో నాకు అనుబంధం ఉంది. ఏబీవీపీ నుండి ఇప్పటి వరకు మంచిర్యాలకు వచ్చి వెళుతుంటా. మంచిర్యాల అభివ్రుద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తాం. రాజకీయాలను పక్కనపెడదాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేపదే కేంద్రంపైన, మోదీని తిట్టడంవల్లే రాష్ట్రానికి నిధులు రాకుండా పోయాయి. వాటిని పక్కనపెట్టి కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో అభివ్రుద్ధి చేసుకుందాం. వివేక్ ను కోరుతున్నా... దయచేసి కేంద్రాన్ని తిట్టడం ఆపాలని మీ మంత్రులకు చెప్పండి. రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానమంత్రి మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లకు ధన్యవాదాలు చెప్పండి...