Telangana | ‘ఆపరేషన్ స్మైలీ’లో తెలంగాణ అగ్రస్థానం
x
తప్పిపోయిన పిల్లల్ని కాపాడిన పోలీసులు(ఫొటో కర్టసీ : రాచకొండ పోలీసు)

Telangana | ‘ఆపరేషన్ స్మైలీ’లో తెలంగాణ అగ్రస్థానం

తప్పిపోయిన పిల్లల్ని దర్పణ్ సహాయంతో గుర్తించిన పోలీసులు వారిని రక్షించి కన్నవారి ఒడికి చేర్చారు. ‘ఆపరేషన్ స్మైలీ’కార్యక్రమంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.


దేశంలో తప్పిపోయిన పిల్లల్ని రక్షించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఆపరేషన్ స్మైల్ పథకం కింద తప్పిపోయిన పిల్లలను కాపాడి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో తెలంగాణ పోలీసులు విశేష కృషి చేశారు. దేశంలో ఒక్క జనవరి నెలలోనే 4,357 మంది పిల్లలను పోలీసులు రక్షించారు. రాష్ట్రంలోని 126 సబ్ డివిజన్లలో 706 మంది పోలీసులను నియమించారు. దర్పణ్ ఇన్ హౌస్ ఫేషియల్ రికగ్నిషన్ అప్లికేషన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తప్పపోయిన పిల్లలను ట్రాక్ చేయడానికి దర్పణ్ యాప్ ఉపయోగపడుతోంది. తప్పిపోయిన పిల్లల్లో 91 శాతం మందిని తాము రక్షించామని మహిళా విభాగం పోలీసు అధికారిణి శిఖా గోయెల్ చెప్పారు.


పోలీసుల ప్రత్యేక ఆపరేషన్
పిల్లల అక్రమ రవాణ, కిడ్నాప్ లను నిరోధించి వారిని కన్నవారి చెంతకు చేర్చడం, లేదా వారికి పునరావాసం కల్పిస్తున్నామని శిఖా గోయెల్ పేర్కొన్నారు. జనవరి నెలలో పిల్లల కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని చెప్పారు. పరిశ్రమలు, ఇటుకబట్టీల్లో బాల కార్మికులతో చట్టవిరుద్ధంగా పనిచేపిస్తుండగా వారిని పట్టుకొని పునరావాసం కల్పించామని తెలిపారు. బాలకార్మికులు, బిక్షాటన చేసేవారు, బలవంతపు భిక్షాటన రాకెట్లలో చిక్కుకున్న వారిని రక్షించడానికి పోలీసు బృందాలు కృషి చేస్తున్నాయన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, ట్రాఫిక్ జంక్షన్లు, మెకానిక్ దుకాణాలు, ఇటుక పరిశ్రమలు, భారీ నిర్మాణ ప్రదేశాలు, దుకాణాలు, టీ స్టాళ్లు, ఫుట్‌పాత్‌లలో ఎక్కువ మంది పిల్లలను రక్షించారు.ఇతర రాష్ట్రాల నుంచి 1793 మందిని, 68మంది వీధి పిల్లల్ని, భిక్షాటన నుంచి 30 మంది పిల్లల్ని రక్షించామని పోలీసులు వివరించారు.



రాచకొండలో 1051 మందిని రక్షించిన పోలీసులు

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 1051 మంది తప్పిపోయిన పిల్లల్ని పోలీసులు రక్షించి వారిని కన్నవారి చెంతకు చేర్చారు. తప్పిపోయిన పిల్లల ఘటనలపై పోలీసులు 410 జనరల్ డైరీలో ఎంట్రీలు పెట్టి, 464 కేసులు నమోదు చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో తప్పిపోయిన పిల్లలు, బాలికార్మికులను రక్షించేందుకు 9 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.పోలీసులతోపాటు షీ టీం బృందాలు కూడా బాలకార్మికులను కాపాడాయి. ఒక్క జనవరి నెలలోనే 512 మంది బాలురు, 28 మంది బాలికలను రక్షించారు.బయటి రాష్ట్రాల్లో 473 మది బాలురు, 38 మంది బాలికలను పోలీసులు రక్షించారు. పోలీసులు జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ ప్రొబేషన్ యూనిట్, కార్మిక శాఖ, బచ్ పన్ ఆందోళన్, ఛైల్డ్ లైన్ నెంబర్ల సహాయంతో బాలకార్మికులను రక్షించారు. తప్పిపోయిన బాలలను రక్షించడంతో తమ రాచకొండ పోలీసు కమిషనరేట్ ముందుందని సీపీ జి సుధీర్ బాబు చెప్పారు.


Read More
Next Story