
అవయవదానంలో తెలంగాణయే అగ్రగామి..
ఒక్క సంవత్సరంలో 205 అవయవాల దానం చేసిన మైలురాయిని అందుకున్న తెలంగాణ.
మనం మరణించినా.. మరొకరికి జీవించే అవకాశం కల్పించే ప్రక్రియే అవయవదానం. అందులో తెలంగాణ టాప్‌లో నిలిచింది. అత్యధిక అవయవదానాల మైలురాయిని అందుకుంది. అవయవదానాలు, ట్రాన్స్‌ప్లాటేషన్స్‌లో తెలంగాణ ముందంజలో ఉంది. ఒక్క ఏడాదిలోనే 205 ట్రాన్స్‌ప్లాన్టేషన్స్‌లో ఈ ఘనత అందుకుంది. 2013లో కేవలం 41గా ఉన్న డోనర్ల సంఖ్య 2025 నాటికి 205కి పెరగడం చాలా గొప్ప విషయమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ గణాంకాలు ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్‌దాన్ ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రాం ద్వారా వెల్లడయ్యాయి.
ఈ 205 ఆర్గన్ డొనేషన్స్ ద్వారా మొత్తం 2025వ సంవత్సరంలో 758 అవయవాలు, టిష్యూలను సేకరించి, వాటిని విజయవంతంగా వినియోగించడం జరిగిందని జీవన్‌దాన్ డాటా స్పష్టం చేసింది. ఈ అవయవదానాల సంఖ్యతో తెలంగాణలో ప్రతి మిలియన్ జనాభాకు 5 కంటే ఎక్కువ దాతల రేటు నమోదయింది. ఇది దేశ సగటు 0.8 పర్ మిలియన్ పాపులేషన్(pmp) కన్నా ఎక్కువ. ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఇటీవల అవయవ దానాల అంశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ఉత్తమ రాష్ట్రం అవార్డు పొందింది.
తాజాగా, తెలంగాణ రాష్ట్రం.. హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చట్టం (THOTA)ను దత్తత తీసుకుంది. ఇది బ్రెయిన్-డెత్ నిర్ధారణను సులభతరం చేస్తుంది. అనస్తీషియాలజిస్టులు, వైద్యులు మరణాన్ని సర్టిఫై చేయడానికి అధికారం పొందడం ద్వారా క్రిటికల్ ఆలస్యాలను తగ్గించడం THOTA లక్ష్యం. కొత్త చట్టం అక్రమ అవయవ వ్యాపారంపై కఠిన శిక్షలు కూడా విధిస్తుంది. అక్రమ అవయవ రవాణా చేస్తే.. సదరు దోషికి రూ. 1 కోటి వరకు జరిమానా, 10 సంవత్సరాల జైలు విధించే అవకాశం ఉంది.
అవయవ దానాల అంశంలో తెలంగాణ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ.. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాటేషన్ మొత్తాన్ని కార్పొరేట్ ఆసుపత్రులో రన్ చేస్తున్నాయి. 2025లో తెలంగాణలో 205 అవయవ దానాలు జరిగితే వాటిలో 197 అంటే 96.10శాతం ప్రైవేట్ హాస్పిటల్స్‌లో జరిగాయి. కేవలం 8 అంటే 3.9 శాతం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో జరిగాయి.
205 క్యాడవర్ బ్రెయిన్-డెత్ అవయవ దాతల్లో 160 మంది పురుషులు, 45 మంది మహిళలు ఉన్నారు. దానాల్లో సుమారు 45.3 శాతం ట్రామా (ఆకస్మిక ఘటనల) కారణంగా, మిగతా దానాలు ట్రామా కాని కారణాల వల్ల జరిగినవే.
ట్రాన్స్‌ప్లాంట్ వివరాలు:
కిడ్నీస్: 291
లివర్స్: 186
లంగ్స్: 95
హార్ట్‌లు: 32
కోర్నియాస్: 154

