మరోసారి తెరపైకి వీఆర్వోల రద్దు అంశం..
x

మరోసారి తెరపైకి వీఆర్వోల రద్దు అంశం..

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తూ ఆనాటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది.


తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేస్తూ ఆనాటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. రద్దు చేసేముందు వీఆర్వోలతో సంప్రదింపులు జరపలేదు. కనీసం సమాచారం లేకుండా ఆ వ్యవస్థను రద్దు చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో వారిని ఇతర శాఖల్లోకి మార్చారు. దీంతో వీఆర్వోలు సర్వీసు సీనియారిటీతోపాటు పదోన్నతులనూ కోల్పోయారు. మరోవైపు కొత్త శాఖలో పదోన్నతి రావడం దాదాపు అసాధ్యంగా మారింది. ప్రభుత్వం మారడంతో తమకి మంచిరోజులు వస్తాయేమో అని ఆశాజనకంగా ఎదురుచూస్తున్నారు.

మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్ లో తెలంగాణ వీఆర్వో జేఏసీ సభ్యులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆయనకి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోల్కొండ సతీష్, సభ్యులు తమ సమస్యలను తెలియజేశారు. గత ప్రభుత్వం వీఆర్వోలపైన కక్ష్యగట్టి గ్రామ రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏ ఇతర ఉద్యోగులకు జరగని నష్టం వీఎర్వోలకు జరిగిందని, భారత రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా లాటరీ పద్ధతి ద్వారా రాత్రికి రాత్రే ఆర్డర్లు ఇచ్చి కలెక్టర్లను, ఆర్డిఓలను, డిఆర్ఓలను, తాసిల్దారులను, పోలీసులను తమ ఇండ్ల వద్దకు పంపి.. బెదిరింపులకు గురిచేసి కార్లలో ఎక్కించుకొని పోయి బలవంతంగా వీఆర్వోలను ఇతర శాఖల్లోకి పంపారని తెలిపారు. దీంతో తామంతా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని, కొంతమంది మంది వీర్వోలకు గత రెండు సంవత్సరాల నుండి జీతం కూడా రావట్లేదని చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. చాలా మందిని ప్రభుత్వేతర శాఖల్లోకి పంపారని... దీంతో తమ మానిటరీ బెనిఫిట్స్ కోల్పోతున్నామని తెలియజేశారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన ద్వారా మీడియాకి వివరాలు వెల్లడించారు.

రెవెన్యూ శాఖలోకి తీసుకుంటేనే సమస్యల పరిష్కారం..?

వీఆర్వోలను వివిధ క్యాడర్లలో ఇతర శాఖల్లోకి పంపడం ద్వారా ఉద్యోగుల సర్వీస్ కు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియారిటీ, ప్రమోషన్ సమస్యలతోపాటు అక్కడున్న శాఖలో ఖాళీ లేక అవమానాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ పరిపాలనా వ్యవస్థలో గ్రామ రెవెన్యూ అధికారుల పాత్ర కీలకమైనది. గ్రామ రెవెన్యూ అధికారులు 49 అధికార విధులు నిర్వహిస్తారు. పాలనా సామర్థ్యాలను, నిర్వహణ సామర్థ్యాలను నిండి ఉన్న వ్యవస్థ రద్దు రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి నష్టమని తెలియజేశారు. మన రాష్ట్రంలో సుమారు 70 శాతం ప్రజలు భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారు. భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటి పరిష్కారం గ్రామ రెవెన్యూ అధికారులు నిర్వహించే గ్రామ లెక్కల మీద ఎక్కువగా ఆధారపడి ఉందని వారు చిన్నారెడ్డికి తెలిపారు.

గ్రామ రెవెన్యూ వ్యవస్ధను మళ్ళీ తీసుకొస్తే వీఆర్వోల అనుభవము ప్రజా పాలనలో గ్రామాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపుడుతుందని వీఆర్వో జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు. వీఆర్వోల రద్దు చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో wp no 31725/2022 ద్వారా కేసు వేసి స్టే తీసుకురావడం జరిగినదని వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ధరణి వెబ్సైట్ తప్పిదాల వలన ఎంతోమంది రైతులు ఇబ్బందులకు గురవుతూ.. వారి సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ధరణి వెబ్సైట్ ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాలనను చిన్నాభిన్నం చేసి రెవెన్యూ ఉద్యోగుల మధ్య ప్రజల మధ్య విరోధాలు పెరిగే విధంగా గత ప్రభుత్వ పాలకులు కృషి చేశారు. ధరణి వలన ఒక తాసిల్దారును చరిత్రలో దేశంలో ఎక్కడాలేని విధంగా కాల్చి చంపారని గుర్తు చేశారు. వీఆర్వోల సమస్యలు విన్న చిన్నారెడ్డి వీఆర్వోలకు జరిగిన అన్యాయం పైన తనకు పూర్తి అవగాహన ఉందని, గ్రామ రెవెన్యూ వ్యవస్థ అవసరమని అన్నారని తెలిపారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే గ్రామ రెవెన్యూ వ్యవస్థ అవసరమని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారని వీఆర్వో జేఏసీ నేతలు వెల్లడించారు. భేటీలో వీఆర్వో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్,సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్ రావు, అదనపు సెక్రటరీ జనరల్ పల్లేపాటి నరేష్, వైస్ చైర్మన్ ప్రతిభ, వైస్ చైర్మన్ చింతల మురళి ఉన్నారు.

Read More
Next Story