TELANGANA | పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చేదెన్నడు?
పదేళ్లుగా పలు సార్లు కేంద్ర బడ్జెట్లు వచ్చినా తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించలేదు. తెలంగాణ ప్రాజెక్టులు కేంద్రం వద్ద ప్రతిపాదనల్లోనే మగ్గుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని మొట్టమొదటిసారి 2023వ సంవత్సరం డిసెంబరు 26వతేదీన కలిశారు. విభజన హామీలు నెరవేర్చాలని, తెలంగాణకు బకాయిలు ఇవ్వాలని, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం, డిప్యూటీ సీఎంలు అభ్యర్థించారు.
మూడో సారి మోదీ ప్రధాని అయ్యాక...
మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక 2024వ సంవత్సరం జులై 14వతేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విన్నవించారు.బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించాలని వారు ప్రధానిని కోరారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు.
మోదీని బడేభాయ్ అని సంబోధించినా...
2024 మార్చి 22వతేదీన ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అధికారిక సభలో తెలంగాణ సీఎం ప్రధాని మోదీని బడేభాయ్ అంటూ సంబోధించారు. పెడరల్ వ్యవస్థలో ప్రధాని పెద్దన్న అని, అన్ని రాష్ట్రాలకు బాధ్యత వహిస్తారని, అందుకే రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీకి సీఎంగా స్వాగతం పలికానని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏమేం కావాలో తాను ప్రధానికి వివరించానని సీఎం చెప్పారు.గతంలో తెలంగాణకు మోదీ వచ్చినా గత బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం పలకలేదు. మోదీ, కేసీఆర్ లు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు.
కేంద్రమంత్రులను కలిసినా కనికరించలేదు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో కేంద్రమంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరీలను కలిసి తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం సీఎం కేంద్ర సాయాన్ని అభ్యర్థించారు.
కేంద్రబడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినా తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించలేదు. 2024-25 కేంద్రబడ్జెట్ లోనూ తెలంగాణకు చేసిన అన్యాయంపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మళ్లీ తాజాగా 2025-26 కేంద్ర బడ్జెట్ లోనూ తెలంగాణకు కేంద్రం నిధులు విడుదల చేయలేదు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రం వైఖరికి నిరసనగా ధర్నా కూడా చేశారు.
సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వండి
పాలమూరు-డిండి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జాతీయ హోదా కల్పించి కేంద్రం నిధులు ఇవ్వాలని సీెం లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదు. హైదరాబాద్ రెండో దశలో భాగంగా బీహెచ్ఈఎల్- లక్డీకాపూల్, నాగోల్- ఎల్ బినగర్, రాయదుర్గ్ -శంషాబాద్ మెట్రోరైలు నిర్మాణానికి నిధులు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల్లో రోడ్ల అభివృద్ధి కోసం 15 ప్రతిపాదనలను ప్రధానికి ఇచ్చినా మోదీ నుంచి స్పందన లేదు. కల్వకుర్తి -మాచర్ల కొత్త రైలు మార్గం నిర్మాణ ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు.
తెలంగాణలో కేంద్ర సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలు కాగితాల్లోనే...
హైదరాబాద్ నగరంలో నేషనల్ డిజైన్ సెంటరును ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర టెక్స్ టైల్స్, కామర్స్, పరిశ్రమల శాఖ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది జనవరి 13వతేదీన సమగ్ర ప్రతిపాదనలతో లేఖ రాసినా అది పెండింగులోనే ఉంది. తెలంగాణలో రెండు మెగా లెదర్ పార్కులను ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించినా వీటికి కేంద్రం నుంచి క్లియరెన్స్ రాలేదు.తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, టీజీ సీఎస్ బీలకు నిధులు కేటాయించాలని కోరినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలుకూ లేదు. ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం లేఖ రాసినా కేంద్రం వద్ద ఆ కాగితాలు పెండింగులో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు చేయాలని కోరినా కేంద్రం కనికరించలేదు.
కార్యరూపం దాల్చని తెలంగాణ ప్రతిపాదనలు
హైదరాబాద్ నగరంలో ఐఐఎం ను ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ మోదీకి లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదు. ఐఐఎం కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్థలాన్ని లేదా మరో స్థలాన్ని కేటాయిస్తామని రాష్ట్ర సీఎం చెప్పినా కేంద్రం ఐఐఎం ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఆయుష్మాన్ ఆరోగ్య పథకం కింద రూ.347 కోట్లను కేటాయించాలని కోరినా కేంద్ర ఆరోగ్య శాఖ పెండింగులోనే ఉంది.ధర్మసాగర్ మండలం ఎల్కతుర్తి గ్రామంలో సైనిక స్కూలును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదం తెలుపలేదు.మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరినా కేంద్రం దాన్ని కూడా తొక్కిపట్టి ఉంచింది.వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ వద్దే పెండింగులో ఉంది. 16 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను నెలకొల్పాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు.
విభజన హామీలు అమలు చేయాలని కోరినా...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన హామీలను అమలు చేయాలని, షెడ్యూల్ 9లోని ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల విభజన, ఆస్తుల విభజన, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించాలని సాక్షాత్తూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ 2023 వ సంవత్సరం డిసెంబరు 26వేతేదీన లేఖ రాసినా, ఇంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణకు అదనంగా మరో 29 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని సీఎం గత ఏడాది రెండు లేఖలు రాసినా కేంద్ర కేబినెట్ వద్ద పెండింగులోనే ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం గ్రాంటు ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు. జాతీయ క్రీడల నిర్వహణ బాధ్యత తెలంగాణకు ఇవ్వాలని కోరినా కేంద్రం నుంచి సమాధానం లేదు.
పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షమెప్పుడు?
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 57 పెండింగ్ ప్రాజెక్టుకులకు కేంద్రం నుంచి క్లియరెన్స్ అందలేదు. పలు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పలు మంత్రిత్వశాఖల్లో పెండింగులోనే ఉన్నాయి. దీనిపై ప్రధాని మోదీ పెదవి విప్పరని, కేంద్రమంత్రులు కూడా పట్టించుకోవడం లేదని తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించి నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పలు లేఖలు రాసినా కేంద్రం స్పందించడం లేదు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలున్నా కేంద్రం నిధులు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళుతున్నాయి తప్ప తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు మాత్రం కాగితాల్లోనే మగ్గుతున్నాయి.
Next Story