
తెలంగాణలో కూడా గ్వాంగ్‌డాంగ్ పద్దతి: రేవంత్
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 20 సంవత్సరాల్లో సాధించిన వృద్ధి, పెట్టుబడుల అనుభవం తెలంగాణకు మార్గదర్శకమన్న రేవంత్.
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చదిద్దడానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కూడా ఒకటని వివరించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తసుకెళ్లనున్నామని చెప్పారు. అతి త్వరలో భారత దేశ జీడీపీలో తెలంగాణది 10శాతం ఉండేలా అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్ దిశానిర్దేశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన, ప్రపంచస్థాయిలో ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.
స్వాతంత్ర్యం అనంతరం భారతీయ నేతలు రూపొందించిన రాజ్యాంగం నుండి ప్రేరణ పొందినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘తెలంగాణ భవిష్యత్తు కోసం మేము ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను రూపొందించాము. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పదేళ్లుగా పోరాడారు. 2014లో ఈ కల సాకారం అయింది’’ అన్నారు.
ముఖ్యమంత్రి చెప్పారు, ‘‘తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు ఈ సమ్మిట్ బీజం వేసింది. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను స్వీకరించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, నిపుణుల సహాయం తీసుకొని ఈ విజన్ రూపొందించాం’’ అన్నారు.
ఈ సందర్భంగా, తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టారు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ జనాభా 2.9% ఉండగా, దేశ జీడీపీలో 5% వాటాను ఇస్తున్నప్పటికీ, 2047 నాటికి 10% వాటా అందించాలనే దృఢ సంకల్పం ఉన్నదని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కొత్త మోడల్‌ను తీసుకువచ్చారు. రాష్ట్రాన్ని CURE (Core Urban Region Economy), PURE (Peri Urban Region Economy), RARE (Rural Agriculture Region Economy) మూడు ప్రాంతాలుగా విభజించి, భవిష్యత్తు లక్ష్యాలను నిర్ధేశించారని వివరించారు.
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 20 సంవత్సరాల్లో సాధించిన వృద్ధి, పెట్టుబడుల అనుభవం తెలంగాణకు మార్గదర్శకమని పేర్కొన్న ఆయన, చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధులను, వ్యాపార వేత్తలను, నిపుణులను, దౌత్యవేత్తలను, ప్రభుత్వ అధికారులు, పెట్టుబడిదారులను తెలంగాణ రైజింగ్ విజన్ కోసం మద్దతు ఇవ్వాలని, భాగస్వామ్యంగా ఉండాలని ఆహ్వానించారు.

