తెలంగాణలో మళ్ళీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయా..!
తెలంగాణలో ఎమర్జెన్సీ పరిస్థితితులు రానున్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారంటే..
తెలంగాణలో పరిస్థితితులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని కాంగ్రెస్ పాలనను ఉద్దేశించి అన్నారు కేటీఆర్. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమేమో కానీ.. ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ పరిస్థితులు అయితే తప్పకుండా వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు సంక్షేమానికి బదులుగా సమస్యలనే అందిస్తోందీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీస్ యాక్ట్ అమలు అంశంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణలో ఎమర్జెన్సీ వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవని, ఇన్నాళ్లూ ప్రజాస్వామికంగా ఉన్న తెలంగాణలో బూటుకాళ్లతో తెల్లవారే పరిస్థితి రానున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు, హక్కులు అడిగితే బెదిరింపులు, పోరాడితే సస్పెన్షన్లు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇది ప్రజాస్వామ్య రాజ్యం కాదని, నియంతృత్వ రాజ్యమని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతెన్నులను ఎంచారు. ప్రభుత్వం ప్రజలను నిర్భందిస్తుందని అన్నారు. తెలంగాణకు పోరాటం చేయడం కొత్తేమీ కాదని, ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం మరోసారి పోరాటం చేయడానికి తెలంగాణ సన్నద్ధంగా ఉందని, ఈ ఉద్యమాన్ని మరోసారి ముందుడి నడపడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని అన్నారు.
పోరాడి తీరుతాం
‘‘పోరాడి సాధించుకొని..
పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..
ప్రజాస్వామిక తెలంగాణలో..
మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..
ఇందిరమ్మ రాజ్యంలో
ప్రశ్నిస్తే కేసులు...
హక్కులను అడిగితే బెదిరింపులు..
పోరాడితే సస్పెన్షన్లు...
ఇది నియంతృత్వ రాజ్యం...నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం..
పోరాటం తెలంగాణకు కొత్తకాదు..ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది..
ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం..
ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం’’ అని వెల్లడించారు కేటీఆర్.
పశు సంపదలోనూ పండగే..
‘‘పంటల దిగుబడిలోనే కాదు..
పశు సంపదలోనూ గత పదేళ్లూ పండగే..
కులవృత్తులకూ కేసిఆర్ కొండంత అండగా..
నిలవడం వల్లే పశుసంపదలోనూ గణనీయ వృద్ధి
గ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపన
సంపద సృష్టిలో... అందరినీ భాగస్వామ్యం చేయాలనే తాపత్రయం
తెలంగాణలో ఉన్న డిమాండ్ తగ్గట్టుగా..
ఇక్కడే మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నం
ఇతర రాష్ట్రాలనుంచి ప్రతినిత్యం వచ్చే..
వందలాది లారీల దిగుబడికి పదేళ్లలో కళ్లెం
ప్రతి ఆలోచన వెనక.. ఒక సుదీర్ఘ అధ్యయనం
కేసిఆర్ లక్ష్యం.. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం..
పదేళ్లలో (2000)వేల కోట్ల వృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించడం సంతోషం
ఈ అద్భుత స్కీములను.. స్కాములు అని..
దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు..
ఇకనైనా తీరు మార్చుకోవాలి..
కళ్లముందు ఆవిష్కృతమైన ఈ అద్భుతాలను
చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి
కానీ నేడు గొర్ల పంపిణీ లేక - చేప పిల్లల పంపిణి నిలిపేసి కుల వృత్తులను రూపుమాపే కుట్రలు చేస్తున్న పాలకులారా కేంద్ర లెక్కలు చూసైనా బుద్ధి తెచ్చుకోండి’’ అని తెలిపారు.