
తెలంగాణకు మొంథా ముప్పు.. హైఅలెర్ట్ ఇచ్చిన ఐఎండీ
మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాటు దంచికొట్టనున్నాయని చెప్పిన వాతావరణ శాఖ.
బంగాళాఖాతంలో వాయుగుండంగా మొదలై బలపడిన మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా భారీగా ఉండనుందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడతాయని అధికారులు వెల్లడించారు. అత్యంత భారీ వర్షాల సూచన ఉన్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం ‘మొంథా తుఫాను’ కాకినాడుకు 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల పరిధిలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారానికి ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశలో కదిలి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనుందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయానికి తుఫాను మచిలీపట్నం, కళింగపట్నం చేరొచ్చని, ఇంచుమించు కోస్తా ఆంధ్రప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
తుఫాను తీరం దాటే సయమంలో గంటలకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం.. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వివరించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మంగళవారం, బుధవారం నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని, మంగళవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఈ జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మంగళవారం మొత్తం 19 జిల్లాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.
బుధవారం.. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని చెప్పారు. తుఫాను ఉన్ననేపథ్యంలో ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.

