
తెలంగాణలో మరింత పెరగనున్న ఎండలు
ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశముందని, వడగాలులు వీచే ప్రమాదం కూడా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే వడదెబ్బకు పలువరు మరణించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ సూచించింది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలపింది. కాగా రాష్ట్రంలో మారనున్న వాతావారణంపై హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయని తెలిపింది. ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. పలు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
దక్షిణ, ఉత్తర ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్లు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం పేర్కొంది.