Telangana| భర్తల కోసం భార్యల పోరాటం
x
ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్న బాధితులు జల, కాశమ్మ

Telangana| భర్తల కోసం భార్యల పోరాటం

ఉపాధి కోసం థాయ్ లాండ్ దేశానికి పోయిన ఇద్దరు యువకులు అరవింద్,సాగర్ లు ఆచూకీ లేకుండా పోయారు.తమ భర్తల ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ జల, కాశమ్మలు ఫిర్యాదు చేశారు.


థాయ్ లాండ్ దేశంలో హోటల్ పని ఇస్తామని చెప్పి ఓ ఏజెంటు విజిట్ వీసాపై ఇద్దరు తెలంగాణ యువకులను థాయ్ లాండ్ దేశానికి పంపించారు.నవంబరు 11వతేదీన ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిజామాబాద్ జిల్లా షెట్పల్లి కి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరు కు చెందిన కొండ సాగర్ లు బ్యాంకాక్ కు వెళ్లారు.

- థాయ్ లాండ్ వెళ్లాక తెలంగాణ యువకుల పాస్ పోర్టులు, ఫోన్లను లాక్కున్నారు. గత నెల 21వతేదీ నుంచి తమ భర్తల జాడ లేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని అరవింద్ భార్య జల, సాగర్ భార్య కాశమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
- థాయిలాండ్ లో తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ తెలుసుకోవాలని, ఏజెంట్ పై పోలీసు కేసు నమోదు చేయాలని బాధితుల భార్యలు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు.

థాయిలాండ్ లో తప్పిపోయిన ఇద్దరు తెలంగాణ యువకుల ఆచూకీని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు డా. బిఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు కోరారు. ఒక ఏజెంటుకు రూ.2 లక్షల చొప్పున చెల్లించి విజిట్ వీసాపై ఉద్యోగం కోసం థాయిలాండ్ కు వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అక్కడ తప్పిపోయారని వారు తెలిపారు.

హోటల్ పని లభిస్తుందనే ఆశతో అప్పు చేసి ఏజెంటుకు రూ.2లక్షల చొప్పున చెల్లించి థాయ్ లాండ్ వెళ్లి మోసపోయారని, వారి జాడ కూడా లేదని అరవింద్ భార్య జల, సాగర్ భార్య కాశమ్మ మంగళవారం హైదరాబాద్ లో ఆవేదనగా చెప్పారు. తమ భర్తల ఆచూకీ కనుగొనే వరకు తాము పోరాడుతామని వారు పేర్కొన్నారు.


Read More
Next Story