ఆస్ట్రేలియాకు అరిసెలు, బ్రిటన్ కి బూరెలు! రెడీమేడ్ పిండివంటల ఆర్డర్లు!
x
sankanti pindivantalu courtesy: UGC

ఆస్ట్రేలియాకు అరిసెలు, బ్రిటన్ కి బూరెలు! రెడీమేడ్ పిండివంటల ఆర్డర్లు!

ఊరంతా ఉమ్మడిగా వండుకునే పిండివంటలు రెడీమేడ్ అయ్యాయి. అరిసెలు, పోకుండలు, సున్నండలు ఇప్పుడు చిటికెలో ఆర్డర్ ఇస్తే సిద్ధమవుతున్నాయి.


శంకర్ వడిశెట్టి

సంక్రాంతి అంటే పల్లె పండుగ. వ్యవసాయదారుల పండుగ అనేది ఒకనాటి మాట. ఇప్పుడు పల్లె మారుతోంది.. వ్యవసాయం కూడా కాలానుగుణంగా పలుమార్పులను సంతరించుకుంటోంది. దానికి తగ్గట్టుగానే సంక్రాంతి సంబరాల్లోనూ అనేక మార్పులు కనిపిస్తున్నాయి. అదే క్రమంలో సంక్రాంతి అంటే కనిపించే ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగి మంటలతో పాటుగా పిండివంటలని చెప్పుకునే పరిస్థితి కాలక్రమేణాల కొత్త రూపు దాల్చుతోంది.

డూడూ బసవన్నలు, కోడి పందాలతో కోలాహాలంగా కనిపించే సంక్రాంతి పండుగలో పిండివంటల ఘుమఘుమలు కూడా జనాలను ఎంతో మురిపించేవి. కానీ ఇప్పుడు కోడిపందాలు పూర్తిగా జూదాల మయం అయిపోయింది. పిండివంటల కోసం రెడీమేడ్ దుకాణలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇంటింటా ఉమ్మడిగా సాగించే పిండివంటల కార్యక్రమానికి తీరికలేని జనం తలో మార్గంలో నోరు తీపి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు రెడీమేడ్ పిండివంటల దుకాణాలు వెలుస్తున్నాయి. ఇంటింటా వండుకునే సంప్రదాయ వంటలు ఇప్పుడు ఊరూవాడ వ్యాపారంగా మారింది.

నెలరోజుల సందడి నాడు..

సంక్రాంతి అంటే ఒకప్పుడు నెల గంట పెట్టటంతో మొదలు. ఊళ్లూ, వాకిలి శుభ్రం చేసుకోవడం నుంచి ఇంటిల్లపాదికి అవసరమైన కొత్తబట్టలు కుట్టించడం, కొత్త అల్లుళ్ల కోసం రకరకాల పిండివంటలు సిద్ధం చేయడానికి పడే శ్రమ అంతా ఇంతా కాదు. పప్పు బెల్లాలు సమకూర్చుకోవడం, వాటిని వంటలకు తగ్గట్టుగా మలచుకోవడం అంతా రోజుల తరబడి సాగిన వ్యవహారం.

చివరకు సమీప బంధువులంతా ఓ చోట చేరి పిండివంటల కోసం బియ్యం, ఇతర సరుకులు దంచడం నుంచి వాటిని వండడం వరకూ అంతా ఉమ్మడి కార్యక్రమమే. సమష్టితత్వం అన్నింటా ఉండేది. శ్రమించి, చేతివంటలను సిద్ధం చేసేవారు. చివరకు పండుగకి వచ్చే బంధువులకు, ఒకవేళ రాలేకపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో పిండివంటలను సమకూర్చడం ఓ సంప్రదాయంగా భావించేవారు.

మూణ్ణాళ్ల ముచ్చట నేడు

అన్నీ మారుతూ ఉంటాయి. అనివార్యంగా జీవన విధానంలోనూ మార్పు వస్తుంది. అందుకే కొత్త బట్టలు సెలక్షన్ కొన్ని నిమిషాల్లో పూర్తి చేస్తున్నట్టే, పిండివంటలు కూడా ఇట్టే ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. వాటిని సిద్ధం చేసి అందించే దుకాణాలు దగదగలాడుతున్నాయి. సంక్రాంతికి పిండివంటల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా మారిపోతోంది. అనేక మందికి ఉపాధి మార్గంలా మారిపోయింది.

సంక్రాంతి సెలవుల పేరుతో మూడు రోజుల కోసం దూర ప్రాంతాల నుంచి సొంతూరికి వస్తున్న వారికి అన్ని రకాల వంటలు సిద్ధం చేయగల స్థితిలో లేని పల్లెవాసులు కూడా ఇప్పుడు రెడీమేడ్ పిండివంటల వైపు మొగ్గుచూపుతున్నారు. అంతేగాకుండా దూర ప్రాంతాల్లోనూ, విదేశాల్లోనూ ఉన్న వారికి తమ సంప్రదాయ పిండివంటలను ప్యాక్ చేసి మరీ పంపిస్తున్నారు. దాంతో పిండివంటల తయారీ, అమ్మకం విస్తృతమవుతోంది.

సర్వవేళలా అందుబాటులో..

అరిసెలు, బొబ్బట్లు, బూరెలు, పోకుండలు, సున్నండలు, గోరి మీఠలు, చక్రాలు, జంతికలు వంటివి ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో చేసుకునేవారు. కానీ ఇప్పుడు రెడీమేడ్ మార్కెట్ విస్తరించడంతో నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడికి కావాలంటే అక్కడికి కొన్ని గంటల్లోనే వచ్చి వాలిపోతున్నాయి. జనాలకు అలా సిద్ధం చేసేందుకు ప్రస్తుతం పలుచోట్ల రెడీమేడ్ పిండివంటల దుకాణాలు వెలిశాయి.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినఅమిరం , కృష్ణా జిల్లా పెనమలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం వంటి గ్రామాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లే ఇలాంటి పిండివంటలను సిద్ధం చేసే పనిలో ఉంటున్నాయి. సంక్రాంతి వేళ సందడిగా మారుతున్నాయి. ఏడాది పొడవునా తమ స్థానిక వంటకాలను ఎగుమతి చేస్తూ వ్యాపారం విస్తరిస్తున్నాయి.

ఇప్పుడు సంక్రాంతి పూర్తిస్థాయి వ్యవసాయ పండుగ కాదు కాబట్టి వ్యాపారం పిండివంటల్లోనూ పరిఢవిల్లుతోంది. ఒక్క ఫోను కాల్‌ దూరంలో ఏ సందడినైనా, ఏ పనినైనా ఈవెంటుగా మార్చేసే పేమెంటు సేవలు అందుబాట్లోకి వచ్చిన తరుణంలో పిండివంటలు కూడా అందులో భాగంగా మారాయి. అమలాపురం నుంచి అమెరికాకి, భీమవరం నుంచి బ్రిటన్ కి నిత్యం ఎగుమతి అవుతున్నాయి.

తీరిక, ఓపికా ఎక్కడివీ

ఒకనాడు పెద్దవాళ్లంతా ఓపికగా ఓ చోట చేరి పిండివంటలు వండేందుకు ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు అలాంటి ఓపిక, అంతటి తీరిక లేదని చింతా శిరీష అనే యువతి అభిప్రాయపడ్డారు.

"సెలవులు వచ్చిన నాటి నుంచి ఉన్న పనులకే సమయం సరిపోవడం లేదు, అదనంగా పిండివంటల పనిపెట్టుకుంటే ఇక ఇతర పనులన్నీ అగిపోతాయి. అందుకే పిండివంటల కోసం రెడీమేడ్ దుకాణాల మీద ఆధారపడుతున్నాం. పైగా కొద్ది సమయంలో ఏదోటి చేద్దామన్నా ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించడం లేదు. అప్పట్లో ఇళ్లలోనే ఉండే ఆడోళ్లకు ఇంటిపని, వంటపని తప్ప మరో యావ లేదు. ఇప్పుడలా కాదుగా. ఇరువురు కష్టపడాలి. అప్పుడే కుటుంబాలు నెట్టుకురాగలం" అంటూ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శిరీష వివరించారు.

రెడీమేడ్ పిండివంటలకు డిమాండ్ పెరుగుతోందని చిన అమిరం పిండివంటల తయారీదారు రామ సీత అన్నారు.

"చాలామంది సంక్రాంతికి సొంతూళ్లకి రాలేకపోయినా కనీసం పిండివంటల రుచి చూసి ఆనందించాలని భావిస్తుంటారు. అందుకే సంక్రాంతి సమయంలో మా వ్యాపారం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు కేవలం పండుగ వేళలే కాకుండా నిత్యం ఆర్డర్లు ఉంటున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలకు పంపిస్తుంటాం. ఇలాంటి పిండివంటల తయారీ కేంద్రాలు అన్ని చోట్లా విస్తరిస్తున్నాయి" అంటూ చెప్పుకొచ్చారు.

జనాల అభిరుచులకు తగ్గట్టుగా పిండివంటల వ్యాపారం విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది.

Read More
Next Story