తెలంగాణకు జ్వరం తగిలింది...
x
గాంధీలో జ్వరపీడితుడికి మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శ

తెలంగాణకు జ్వరం తగిలింది...

తెలంగాణను డెంగీ,స్వైన్ ఫ్లూ, వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి.వర్షాలు,వరదలు తగ్గుముఖం పట్టడంతో దోమలు వ్యాప్తి చెందాయి.వైరల్,స్వైన్ ఫ్లూ, డెంగీ కేసులు నమోదయ్యాయి.


తెలంగాణను డెంగీ,స్వైన్ ఫ్లూ, వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి.భారీవర్షాలు,వరదలు తగ్గుముఖం పట్టడంతో దోమలు వ్యాప్తి చెందడంతో కేవలం ఐదు రోజుల్లో వెయ్యికిపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి.గాంధీ, ఉస్మానియా,ఫీవర్ ఆసుపత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి.దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

- తెలంగాణ రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య 6,405 కు పెరిగింది.హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఈ ఏడాది డెంగీ కేసుల సంఖ్య ఆరువేల మార్కును దాటింది.
- డెంగీతోపాటు వెక్టార్-బోర్న్, స్వైన్ ఫ్లూ, వైరల్ ఫీవర్ వ్యాధులు పెరిగాయి.డెంగీ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ పేర్కొంది.
-వైరల్ జ్వరాలేకాదు చికున్ గున్యా, మలేరియాలు కేసులు కూడా పెరిగాయి. చికున్‌గున్యా కేసులు 152 నుంచి 178కి పెరిగాయి. మలేరియా కేసులు 191 నుంచి 200కి పెరిగాయి.

పది జ్వరపీడిత హైరిస్క్ జిల్లాలు
తెలంగాణ రాష్ట్రంలో 10 జ్వరపీడిత హైరిస్క్ జిల్లాలను వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది.హైదరాబాద్, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ప్రజలు జ్వరాలతో వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజువారీగా జ్వరపీడితుల సమాచారం సేకరిస్తున్నామని ప్రజారోగ్యశాఖ అదనపు సంయుక్త సంచాలకులు టి.బాలాజీ తెలిపారు.

90 శాతం వైరల్ ఫీవర్ కేసులే...
నల్లకుంటలోని ప్రభుత్వ ఫీవర్‌ ఆస్పత్రిలో 90 శాతం వైరల్‌ ఫీవర్‌ కేసులు ఉన్నాయని డాక్టర్‌ ఎ.జయలక్ష్మి చెప్పారు.ఫీవర్ ఆసుపత్రిలో 689 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.ఆహారం , నీరు కలుషితం కావడమే ఈ సీజన్‌లో అనారోగ్యానికి ప్రధాన కారణం అని వైద్యులు చెప్పారు. రాష్ట్రంలో జ్వరపీడితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.
తెలంగాణలో వెలుగుచూసిన స్వైన్ ఫ్లూ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి.కొన్నేళ్లుగా మాయం అయిన స్వైన్ ఫ్లూ కేసులు నగరంలో వెలుగుచూడటం కలకలం రేపింది. నారాయణగూడలోని ప్రీవెంటీవ్ మెడిసిన్ జరిపిన పరీక్షల్లో నలుగురికి స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారణ అయింది. మాదాపూర్, టౌలీచౌకీ, హైదర్ నగర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురికి స్వైన్ ఫ్లూ సోకిందని ఐపీఎం పరీక్షల్లో తేలింది.నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ సోకింది.



గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు

భారీవర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో డెంగీ, చికున్‌గున్యా, నోరోవైరస్‌, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులతో రోగులు గాంధీ ఆసుపత్రికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్శింహ గాంధీ ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, వైద్యులతో మంత్రి సమావేశమై చికిత్సల గురించి సమీక్షించారు. నర్సింగ్ సిబ్బంది, డ్యూటీ డాక్టర్ల డ్యూటీ రిపోర్టులు, ఆసుపత్రి సిబ్బంది నిర్వహిస్తున్న డయాగ్నసిస్ డేటాతో సహా ఆసుపత్రి స్థితిగతులపై మంత్రి ఆరా తీశారు.మంత్రి వెంట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, రాష్ట్ర వైద్య విద్య ప్రత్యేక అధికారి డాక్టర్ ఎన్ వాణి కూడా పాల్గొన్నారు.

ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష
ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 5,294 రక్తనమూనాలను పరీక్షించగా, అందులో 163 డెంగీ కేసులు నమోదయ్యాయి.హైదరాబాద్ నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని పరీక్షల్లో తేలింది.తెలంగాణలో గత సంవత్సరాల కంటే ఈ ఏడాది 152 చికున్‌గున్యా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దోమల వ్యాప్తిని నియంత్రించడానికి ఫాగింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు.

ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, మందులు సిద్ధం
ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్‌లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలను సమాయత్తం చేశారు. ఓఆర్‌ఎస్ సాచెట్‌లను అందుబాటులో ఉంచారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని కింగ్ కోఠీ లోని హైదరాబాద్ జిల్లా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను మంత్రి పరిశీలించారు.ఆస్పత్రి లో చేరి చికిత్స తీసుకుంటున్న రోగులతో మాట్లాడి, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను మంత్రి ఆరా తీశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.


Read More
Next Story