ఇక తెలంగాణ గీతం జయ జయహే   అందెశ్రీకి అపూర్వ గౌరవం
x
అందెశ్రీ కవిత

ఇక తెలంగాణ గీతం 'జయ జయహే' అందెశ్రీకి అపూర్వ గౌరవం

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాడే అనుకున్నారు అందరూ.. ప్రజాకవి అందెశ్రీకి గుర్తింపు రాబోతోందని.. అనుకున్నట్టే జరిగింది. పదేళ్లు మరుగున పడిన ఆణిముత్యం బయటపడింది.


“ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర చిహ్నం రాజరిక పాలనను గుర్తుచేసేలా ఉంది. దాన్ని రూపుమాపేలా.. మన ప్రాంతపు గుర్తులు కనిపించేలా.. తెలంగాణ పోరాటం, అందులో జైలుకెళ్లిన వారిని జ్ఞప్తికి తెచ్చేలా.. రాచరికపు పునాదుల నుంచి త్యాగానికి, పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, జీవన విధానాన్ని, కళారూపాలనను పునరుజ్జీవింప చేసేలా.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు.. పునర్నిర్వచించుకోవాలని తీర్మానించింది. ఇందులో కవులు, కళాకారులు, మేధావులు, ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రజాకవి అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర అధికార గీతంగా చేస్తూ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉర్రూతలూగించి, తెలంగాణ సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతానికి తగిన గౌరవం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది“ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.


అందెశ్రీకి అపూర్వ గౌరవం...

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగమే ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతంతో ప్రారంభమవుతుంది. అందెశ్రీ గీతమే తమ పాలనకు స్ఫూర్తిదాయకం అంటారు ఆయన.

‘ఏందిరా.. ఏందిరా తెలంగాణం

ఎలా మూగబోయిందిరా,

ఏందిరా.. ఏందిరా.. తెలంగాణ

ఎముల పాలవుతోందిరా

రాష్ట్రమొస్తే కుక్కలా కాపాలా అంటివి..

అధికారం వచ్చె.. అహంకారంతో

కొంకనాలకు పోయి రంకెలేసుడేందిరో.. అంటూ రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం అవుతుంది. అందరూ ఆరోజే అనుకున్నారు అందెశ్రీకి గుర్తింపురాబోతోందని. అనుకున్నట్టే నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశం అందెశ్రీ గీతానికి గుర్తింపు ఇచ్చింది. రాష్ట్ర గీతంగా ఆయన రాసిన జయజయహే పాటను ప్రకటించింది. దీంతో పదేళ్లుగా మరుగున పడిన ఆణిముత్యం అందెశ్రీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

అందెశ్రీ రాసిన జయజయహే గీతం ఇదీ

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరిత గల తల్లీ నీరాజనం

పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

పోతనదీ పురిటిగడ్డ.. రుద్రమదీ వీరగడ్డ

గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప

గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

జానపద జన జీవన జావళీలు జాలువార

జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర

వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి

తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగ

పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!


అందెశ్రీ

పదేండ్లు బందీ అయిన తెలంగాణ గీతం..

ఇకముందు ముక్కోటి గొంతుకల్లో

స్వేచ్ఛా గేయమై వినిపించెన్ !!

Read More
Next Story