కోమటిరెడ్డి పంతం... బీఆర్ఎస్ లో టెన్షన్
x

కోమటిరెడ్డి పంతం... బీఆర్ఎస్ లో టెన్షన్

గత కొన్ని నెలలుగా నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ సెంటర్ పాయింటుగా కూల్చివేత రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే.


గత కొన్ని నెలలుగా నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ సెంటర్ పాయింటుగా కూల్చివేత రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. అనుమతులు లేని ఆఫీసుని కూల్చివేయాల్సిందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ పంతం పట్టుకుని కూర్చున్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున వందకోట్ల విలువైన స్థలంలో పార్టీ కార్యాలయాన్నిఅనుమతులు లేకుండా నిర్మించారని ఆరోపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా అక్కడి నుంచి పార్టీ ఆఫీసును తరలిస్తామని వార్నింగులు కూడా ఇచ్చారు. దీంతో నల్గొండలో కూల్చివేతల రాజకీయాలు వేడెక్కాయి.

కోమటిరెడ్డి హుకుం...

గతంలో ఛాలెంజ్ చేసిన మంత్రి తన పంతం నెగ్గించుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అనుమతులు లేకుండా నిర్మించే భవనాలను కూల్చివేసే మున్సిపల్ అధికారులు.. పర్మిషన్ లేని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని ఎందుకు టచ్ చేయడం లేదని అధికారులను గట్టిగానే ప్రశ్నించారు. అనుమతులు లేకుండా నిర్మించిన ఆ భవనంపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని హుకుం జారీ చేశారు. ఇక మంత్రి ఆదేశాలతో ఫైనల్ నోటీసులు కూడా జారీ చేశారు మున్సిపల్ అధికారులు.

అనుమతులు లేకుండానే...

అధికారంలో ఉంది మనమే, నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కూడా మనమే అనే ధీమాతో సరైన అనుమతులు లేకుండా గులాబీ కార్యాలయం నిర్మించేసిన పార్టీ నేతలకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. అధికారంలో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారు. కానీ, మున్సిపల్ అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అధికారం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కోమటిరెడ్డి అన్నంత పని చేసేస్తే? కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టించుకున్న పార్టీ ఆఫీస్ నేలమట్టం అవ్వాల్సిందేనా ఆందోళన పట్టుకుంది. పైకి మాత్రం నిబందనలకు విరుద్దంగా నిర్మించిన ఇతర పార్టీల కార్యాలయాలను కూడా కూల్చి తమ ఆఫీసు మీదకి రండని బీఆర్ఎస్ నేతలు సవాళ్లు చేస్తున్నారు. కానీ, లోలోపల మాత్రం భయపడుతున్నట్టే కనిపిస్తోంది. దీనికి కారణం లోకల్ బీఆర్ఎస్ నేతలు తాజాగా అనుమతుల కోసం దరఖాస్తు చేయడం, అందుకున్న నోటీసులను పట్టుకుని కోర్టును వెళ్లడమే.

Read More
Next Story