BRS l బీఆర్ఎస్ లో టెన్షన్ టెన్షన్..రేపు ఏమి జరుగుతుందో ?
x
BRS former MLA Chirumarti Lingaiah

BRS l బీఆర్ఎస్ లో టెన్షన్ టెన్షన్..రేపు ఏమి జరుగుతుందో ?

గురువారం నాడు నకిరేకల్ మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య(Chirumarti Lingaiah) టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసు విచారణకు హాజరుకాబోతున్నారు.


ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే గురువారం నాడు నకిరేకల్ మాజీ ఎంఎల్ఏ చిరుమర్తి లింగయ్య(Chirumarti Lingaiah) టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసు విచారణకు హాజరుకాబోతున్నారు. బీఆర్ఎస్(BRS) పాలన పదేళ్ళల్లో వేలాది మొబైల్ ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసిన విషయం తెలిసిందే. తాము చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ వివరాలను అరెస్టయిన పోలీసులు కోర్టుక అఫిడవిట్ ద్వారా అందించారు. టెలిఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడినపుడు సంచలనం సృష్టించింది. రాజకీయ పార్టీల్లోని ప్రత్యర్దులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, వివిధ వృత్తుల్లోని ప్రముఖులు, జర్నలిస్టులు చివరకు జడ్జీల కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయి. దాంతో ట్యాపింగ్ కు పాల్పడిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్, తిరుపతయ్యతో పాటు మరికొందరు అరెస్టయ్యారు. ట్యాపింగ్ అంశాన్ని విచారించేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసింది.

ట్యాపింగ్ అంశంలో ఇంతకాలం పోలీసులను మాత్రమే విచారించిన సిట్(SIT) అధికారులు గురువారం నుండి ప్రజాప్రతినిధులుగా చేసిన వారిని కూడా విచారించబోతోంది. ఇందులో భాగంగానే చిరుమర్తిని విచారణకు రమ్మని నోటీసులు జారీచేసింది. ఎప్పుడైతే ట్యాపింగ్ అంశం వెలుగుచూసిందో పై పోలీసు అధికారులు తమ మొబైల్ ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని డిలీట్ చేసేశారు. కొందరు అధికారులు సమాచారం మొత్తాన్ని రీసెట్ చేశారు. దాంతో వీళ్ళ ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. డిలీట్ అయిన సమాచారం మొత్తాన్ని ల్యాబ్ నిపుణులు వెనక్కు రప్పించారు. దాంతో ఒక్కో పోలీసు ఫోన్ ను విశ్లేషించిన సిట్ కు తిరుపతయ్య-చిరుమర్తి మధ్య చాలాసార్లు ట్యాపింగ్ కు సంబంధించిన మాటలు జరిగినట్లు బయటపడింది. నల్గొండ జిల్లాలోని తన ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టేందుకు చిరుమర్తి తిరుపతయ్య సాయాన్ని తీసుకున్న విషయం బయటపడింది.

అందుకనే చిరుమర్తికి సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు. బంజారాహిల్స్(Banjara Hills) లోని సిట్ ఆఫీసుకు రేపు ఉదయం చిరుమర్తి విచారణకు హాజరవబోతున్నారు. విచారణలో చిరుమర్తి చెప్పబోయే విషయాలపైనే బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే ట్యాపింగుకు కేసీఆర్, కేటీఆరే బాధ్యులు కాబట్టి వెంటనే ఇద్దరినీ అరెస్టు చేయాలని ఇప్పటికే మంత్రులు చాలామంది డిమండ్లు చేసిన విషయం తెలిసిందే. అయితే మంత్రులు డిమాండ్ చేశారని కేసీఆర్(KCR), కేటీఆర్ ను అరెస్టు చేయటం సాధ్యం కాదుకాబట్టి సిట్ అధికారులు ప్రోసీజర్ ను ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగానే ముందుగా మాజీ ఎంఎల్ఏకి నోటీసు జారీచేసింది. చిరుమర్తి లాగే నాగర్ కర్నూలు మాజీ ఎంఎల్ఏ మర్రి జనార్ధనరెడ్డి, అచ్చంపేట మాజీ ఎంఎల్ఏ గువ్వల బాలరాజు, భువనగిరి మాజీ ఎంఎల్ఏ పైళ్ళ శేఖరరెడ్డి, కోదాడ మాజీ ఎంఎల్ఏ బొల్లం మల్లయ్యను విచారించేందుకు కూడా సిట్ నోటీసులు సిద్ధం చేసినట్లు ప్రచారం పెరిగిపోతోంది.

అంటే ముందు చిరుమర్తి విచారణ తర్వాత పై నలుగురు మాజీ ఎంఎల్ఏల విచారణ తథ్యమని అర్ధమవుతోంది. పై నలుగురు మాజీ ఎంఎల్ఏల ప్రత్యర్ధులు ఎవరు ? వీళ్ళు అరెస్టయిన పోలీసు అధికారుల్లో ఎవరిద్వారా తమపనులను చక్కబెట్టుకున్నారనే విషయం తొందరలోనే బయటపడబోతోంది. చిరుమర్తి విచారణ జరిగిన వెంటనే పై నలుగురు మాజీల విచారణకు సిట్ ముహూర్తం రెడీచేసిందనే ప్రచారం తెలిసిందే. మొత్తంమీద బీఆర్ఎస్ లోని చాలామంది మాజీలు, పార్టీలోని కీలక నేతలను విచారించిన తర్వాత అరెస్టులు కూడా ఉంటాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చిరుమర్తి విచారణ సందర్భంగా గురువారం సిట్ ఆలోచనలు ఏమన్నా బయటపడతాయేమో చూడాలి.

Read More
Next Story