ఎంఎల్ఏపై అనర్హత వేటు వేయటం ఇంత సులభమా ?
x
BRS MLAs

ఎంఎల్ఏపై అనర్హత వేటు వేయటం ఇంత సులభమా ?

ఎంఎల్ఏలపై అనర్హత వేటు విషయంపై ఇపుడు రాజకీయపార్టీల మధ్య బాగా చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి అనుకుంటే ప్రతిపక్షంలోని ఎంఎల్ఏల మీద అనర్హత వేటు వేయచ్చా ?


ఎంఎల్ఏలపై అనర్హత వేటు విషయంపై ఇపుడు రాజకీయపార్టీల మధ్య బాగా చర్చ నడుస్తోంది. కారణం ఏదైనా సరే ముఖ్యమంత్రి అనుకుంటే ప్రతిపక్షంలోని ఎంఎల్ఏల మీద అనర్హత వేటు వేయచ్చా ? ఇపుడీ చర్చ ఎందుకు జరుగుతోందంటే మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతు ఆరుగురు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేస్తే మిగిలిన ఎంఎల్ఏలకు బుద్ధి వస్తుందని బీఆర్ఎస్ ఎంఎల్ఏలపై మండిపడ్డారు. ఇదివరకేమో ఒకరిద్దరు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని చెప్పిన రేవంత్ తాజాగా ఏకంగా ఆరుమంది అనర్హత వేటు వేయాలని అనటమే ఆశ్చర్యంగా ఉంది.

రేవంత్ మాటలను బట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో ఆరుగురిపైన అనర్హత వేటు వేయటానికి డిసైడ్ అయ్యారని. అయితే ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే ముఖ్యమంత్రి అనుకుంటే ప్రతిపక్షాల్లోని ఎంఎల్ఏలపైన అనర్హత వేటు వేయచ్చా ? ప్రతిపక్షాల్లోని ఎంఎల్ఏలపైన అనర్హత వేటు వేయటం అంత సులభమా ? అన్న చర్చ పెరిగిపోతోంది. అనర్హత వేటు విషయమై గతంలో కేసీఆర్ నిర్ణయాన్ని ఇపుడు రేవంత్ పదేపదే గుర్తుచేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో టెన్షన్ పెంచేస్తోంది. తమలో ఎవరిపైన అనర్హత వేటు పడుతుందో ఎంఎల్ఏలకి అర్ధంకావటంలేదు. అసలు అనర్హత వేటు వేయాలనే ఆలోచన రేవంత్ కు ఎందుకొచ్చింది ?

ఎందుకొచ్చిందంటే బీఆర్ఎస్ తరపున రెండు పాయింట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. అవేమిటంటే మొదటిపాయింట్ తనకు తప్ప రాష్ట్రాన్ని పాలించే అర్హత మరో పార్టీకి లేదని కేసీఆర్ అనుకోవటం. అనేక కారణాల వల్ల 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్-కేసీఆర్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ స్ధానంలో ఇంకెవరైనా సీఎం అయ్యుంటే బీఆర్ఎస్ తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత గోలుండేది కాదేమో.

రేవంత్ కు కేసీఆర్ మధ్య పెరిగిపోయిన విభేదాల కారణంగా ప్రతిచిన్న విషయానికి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ప్రత్యేకించి కేటీఆర్, హరీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ బయట లేదా మీడియా సమావేశాల్లో వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత గోలచేసినా ఎవరు పట్టించుకోరు. కాని అసెంబ్లీ సమావేశాల్లో కూడా పదేపదే గోలచేస్తున్నారు. తమ పదేళ్ళు పాలన అద్భుతమని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే తెలంగాణా ఆగమైపోయిందని, భ్రష్టుపట్టిపోయిందని, దివాలాతీసిందని ఇలా రకరకాలుగా ఆరోపణలు, విమర్శలతో ప్రభుత్వంపై బాగా బురదచల్లేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి పదేపదే అడ్డుపడుతున్నారు.

ఇలాంటి అనేక కారణాలతో ఆరుగురు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వస్తే మిగిలిన వాళ్ళకి బుద్దొస్తుందని రేవంత్ డిసైడ్ అయినట్లున్నారు. రేవంత్ ఈ ఆలోచనకు రావటానికి కూడా కేసీఆరే కారణం. 2014-18 మధ్య సభలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ బాగా దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఎంఎల్ఏ సభ్యత్వాలను కేసీఆర్ రద్దుచేయించారు. ప్రజలెన్నుకున్న తమపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కు లేదని ఇద్దరూ హైకోర్టులో పిటీషన్ వేసినా ఉపయోగంలేకపోయింది.

దాంతో అందరికీ అర్ధమైంది ఏమిటంటే అధికారపార్టీని ఇబ్బంది పెడుతున్న ప్రతిపక్షాల్లోని ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయటం చాలా సులభమని. అయితే దీనికి ప్రత్యేకంగా చట్టమంటు ఏమీలేదు. నియమ, నిబంధలను అడ్డుపెట్టుకుని ఇష్టంలేని వాళ్ళపై సభలో తీర్మానం చేసేసి యాక్షన్ తీసేసుకోవటమే. అసెంబ్లీ నిర్వహణపై ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్షాలకు చెందిన వివిధ పార్టీల సభా నేతలు స్పీకర్ ఆధ్వర్యంలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు. చాలా సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు సభలో అమలు కావని అందరికీ తెలిసిందే. సభ నిర్వహణపై అధికార, ప్రతిపక్షాల నేతలు తీసుకునే నిర్ణయాలనే స్పీకర్ నియమ, నిబంధనల పేరుతో అమలుచేస్తారు. నియమ, నిబంధనలను అమలుచేయటంలో స్పీకర్ దే ఫైనల్ నిర్ణయం. ఈ పద్దతిలోనే సభలో గొడవలు చేస్తున్నారని కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలను స్పీకర్ ద్వారా కేసీఆర్ రద్దుచేయించారు.

సభ్యత్వాల రద్దు విషయంలో అప్పట్లో కేసీఆర్ అవలంభించిన విధానాన్నే తొందరలో రేవంత్ కూడా ఫాలో అవబోతున్నట్లు అర్ధమవుతోంది. అనర్హత వేటు వేయాలని డిసైడ్ అయిన సభ్యులకు స్పీకర్ ముందుగా నోటీసులు ఇస్తారు. వాళ్ళపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయంలో ప్రివిలేజ్ కమిటితో విచారణ చేయిస్తారు. కమిటి సిఫారసుచేసిందని చెప్పి సభ్యులపై చర్యలకు స్పీకర్ సభలో తీర్మానం ప్రవేశపెడతారు. ఎలాగూ అధికారపార్టీకి మెజారిటి ఉంటుంది కాబట్టి స్పీకర్ ప్రతిపాదన లేదా మెజారిటి సభ్యుల ప్రతిపాదన నెగ్గుతుంది. దాంతో సభ్యత్వాలు రద్దయిపోతాయి. మామూలుగా అయితే గోలచేస్తున్న సభ్యులను పర్టిక్యులర్ సెషన్ వరకు సభలోకి అడుగుపెట్టకుండా సస్పెన్డ్ చేస్తారంతే. కాని ముఖ్యమంత్రి గట్టిగా నిర్ణయించుకుంటే సభ్యత్వాలు రద్దవ్వటం పెద్ద విషయమేమీ కాదు. కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలు రద్దయ్యింది ఈ పద్దతిలోనే. కాబట్టి రేవంత్ కూడా గట్టిగా అనుకుంటే ఇపుడు చెబుతున్నట్లుగా ఆరుగురి సభ్యత్వాలను రద్దుచేయటం పెద్ద కష్టమేమీ కాదని అర్ధమైపోతోంది.

Read More
Next Story