
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
ఫిర్యాదుదారు మరణిస్తే.. పిటిషన్‌కు విచారణ అర్హత ఎలా ఉంటుంది? అని న్యాయస్థానం ప్రశ్నించింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన అంశంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా కేసీఆర్, హరీష్ రావు పిటిషన్‌లపై హైకోర్టు తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది. ఈ అంశంలో భూపాలపల్లి న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం వాదలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుపాటుపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
ఈ అంశంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల స్పందించిన కేసీఆర్, హరీష్.. తన పరిధిలేకుండా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఫిర్యాదుదారు రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. దీంతో ఈ అంశం మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఫిర్యాదుదారు మరణిస్తే.. పిటిషన్‌కు విచారణ అర్హత ఎలా ఉంటుంది? అని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో ఫిర్యాదుదారు మరణించిన పిటిషన్‌ను విచారించవచ్చని పీపీ(పబ్లిక్ ప్రాసిక్యూటర్) వాదనలు వినిపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పీపీ.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాకోర్టు పరిధిలేకుండా నోటీసులు జారీ చేసిందని కేసీఆర్, హరీష్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.