కేటీఆర్‌కి రాఖీ కట్టడంపై మహిళా కమిషన్ సీరియస్
x

కేటీఆర్‌కి రాఖీ కట్టడంపై మహిళా కమిషన్ సీరియస్

మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడానికి మహిళా కమిషన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పలువురు కమిషన్ సభ్యులు కేటీఆర్‌కు రాఖీలు కట్టారు.


మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడానికి మహిళా కమిషన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పలువురు కమిషన్ సభ్యులు కేటీఆర్‌కు రాఖీలు కట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కాగా మహిళలను అవమానించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్‌కు రాఖీలు కట్టడంపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. కేటీఆర్‌కు రాఖీలు కట్టిన కమిషన్ సభ్యులకు ఆరుగురు కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారు తమ చర్యలపై వివరణ ఇవ్వాలని మహిళ కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద కోరారు. మహిళలను అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడానికి వచ్చిన కేటీఆర్‌కు రాఖీ కట్టడం వెనక అసలు ఉద్దేశం ఏంటో సభ్యులు వివరించాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందే హెచ్చరించిన శారద

అయితే కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నేరెళ్ల శారద.. కమిషన్ సభ్యులకు ముందే హెచ్చరించారు. అయినా వాటిని పెడచెవిన పెట్టి కేటీఆర్ రాఖీ కట్టడంపై, కమీషన్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్‌కు అనుమతి లేకున్నా సీక్రెట్‌గా ఫోన్లు తీసుకెళ్లి కేటీఆర్‌కు రాఖీ కట్టడాన్ని చిత్రీకరించడంపై కూడా శారద మండిపడ్డారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ సభ్యులే ఇలా చేశారంటూ ఆమె సీరియస్ అయ్యారు. ఈ విషయంపై కమిషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వడంతో పాటు న్యాయ సలహా కూడా తీసుకుంటున్నట్లు కమిషన్ తెలిపింది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కమిషన్ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మహిళ కమిషన్ వెల్లడించింది.

స్పందించిన కేటీఆర్

అయితే తనకు రాఖీ కట్టిన మహిళ కమిషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. రాఖీనే భయపెడితే ఎలా అంటూ తనకు కమిషన్ సభ్యులు కట్టిన రాఖీలను చూపిస్తున్న ఫొటోను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు.

Read More
Next Story