హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేసిన టీజీపీఎస్సీ
x

హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేసిన టీజీపీఎస్సీ

న్యాయస్థానం తీర్పుతో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వాదన.


తెలంగాణ గ్రూప్-1 పరీక్షల ఫలితాల అంశం మరో కీలక మలుపు తీసుకుంది. ఇందులో మర్చి నెలలో విడుదల చేసిన ర్యాంకులు, మూల్యాంకనాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా పునఃమూల్యాంకనం చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC)కి ఎనిమిది నెలల సమయం ఇచ్చింది. అయితే ఈ విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని టీజీపీఎస్సీ ఛాలెంజ్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. పునఃమూల్యాంకనం అంటే పరీక్షా ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని, అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని టీజీపీఎస్సీ తన పిటిషన్‌లో పేర్కొంది. పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్దతను కాపాడటానికి తాము అన్ని చర్యలు తీసుకున్నామని వివరించింది.

సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ వాదన..

కోర్టు ఆదేశించిన ప్రకారం రీవాల్యుయేషన్ చేస్తే సాంకేతిక సమస్యలు రావొచ్చని టీజీపీఎస్సీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కాపీపై టీజీపీఎస్సీ లీగల్ టీమ్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తోంది. గ్రూప్-1 మూల్యాంకనంలో లోపాలు లేవని వాదించడానికి టీజీపీఎస్సీ సిద్ధమయింది. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా వెనకాడకూడదని కమిషన్ భావిస్తోంది.

హైకోర్టు తీర్పు ఏంటంటే..

మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల లిస్ట్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా పునఃమాల్యాంకనం చేయాలంటూ అధికారులకు ఆదేశించింది. సంజయ్ వర్సెస్ యూపీఏస్సీ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అంతేకాకుండా ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో మెయిన్స్ పరీక్షలనే రద్దు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్‌లు ఇవ్వడంలో, కేంద్రాల కేటాయింపులో కూడా పాదర్శకత లోపించిందని సింగిల్ జడ్జి బెంచ్ తన తీర్పులో పేర్కొంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను, సమగ్రతను కొనసాగించలేదని, పక్షపాతంతో వ్యవహరించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కమిషన్‌ తన సొంత నియమ, నిబంధనలను సైతం ఉల్లంఘించిందని పేర్కొంది కోర్టు. మూల్యాంకనం కోసం చేసిన ప్రొఫెసర్ల ఎంపికలోనూ పారదర్శకత పాటించలేదని, ఫలితంగా తెలుగు మాధ్యమ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Read More
Next Story