తెలంగాణ హైకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. 2015-16 నాటి గ్రూప్-2 పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. టీజీపీఎస్సీ తనకున్న అధికార పరిధి దాటి వ్యవహరించిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఎనిమిది వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జాబితాను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుతో గ్రూప్-2 నియమాక ఉద్యోగులలో గందరగోళం ఏర్పడింది. తమకు ఉద్యోగం వచ్చి ఆరు సంవత్సరాల తరువాత వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు కూడా న్యాయస్థానాలతో పాటు ప్రభుత్వ పెద్దలను కలవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
2015 లో నోటిఫికేషన్ విడుదల చేస్తే, 2016 లో పరీక్ష నిర్వహించారని, అనేక వివాదాల తరువాత చివరకు 2019 లో తుది ఫలితాలు ఇచ్చారని కొంతమంది గ్రూప్-2 ఉద్యోగులు ‘ది ఫెడరల్’ తో(తమ పేరు వెల్లడించకూడదని షరతు విధించారు) అన్నారు. అన్ని అడ్డంకులు దాటుకుని ఉద్యోగం సాధించామనే ఆనందం నిల్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ విడుదల చేసిన ప్రతి గ్రూప్స్ నోటిఫికేషన్ వివాదాల పుట్టగా మారింది. ఇంతకుముందు గ్రూప్స్ పరీక్ష నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష, గ్రూప్-2 పరీక్షలో వాయిదా పర్వం కొనసాగించి, అభ్యర్థుల సహనానికి పరీక్ష పెట్టింది.
ఇప్పటి వరకూ కూడా గ్రూప్-3 పరీక్ష నియమాకాలను ఇంకా పూర్తి చేయలేదు. గత నెలలోనే అభ్యర్థుల ధృవ పత్రాలను పరిశీలన ప్రారంభించింది. ఇంతలోనే దశాబ్ధం క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష మెరిట్ జాబితాను రద్దు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
ఎందుకు రద్దు చేసింది..
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్దంగా డబుల్ బబ్లింగ్, వైట్ నర్ వినియోగం, రఫ్ చేసిన పార్ట్ బి పశ్నా పత్రాలను పునర్: మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొంది.
ఇది హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్దంగా వ్యవహరించిందని అభిప్రాయపడింది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని, వాటిని పక్కన పెట్టి 2019, అక్టోబర్ 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్దమని వాటిని రద్దు చేస్తున్నట్లు జస్టిస్ భీమపాక నరేష్ తీర్పు చెప్పారు.
గ్రూప్-2 నోటిఫికేషన్..
అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు అయ్యాక టీస్పీఎస్సీ ఏర్పాటు చేసి, తొలిసారిగా 1032 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. తరువాత పరీక్షకు సరైన సమయం దొరకడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో మొదట ప్రకటించిన పరీక్ష తేదీల్లో మార్పులు చేసి, 2016కు పరీక్షను పోస్ట్ చేసింది.
దీనికి అనుబంధంగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. చివరకు నవంబర్ 11, 13 తేదీలలో రాత పరీక్షలు నిర్వహించింది. అయితే పరీక్షలలో ప్రశ్నపత్రం బుక్ లెట్ నంబర్ కు, ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరలేదు. దీనితో కమిషన్ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది.
అన్ని అంశాలను అధ్యయనం చేసిన కమిటీ పార్ట్- ఏ అభ్యర్థులు చేసిన చిన్నచిన్న పొరపాట్లు ఉంటే మన్నించవచ్చని సూచించింది. పార్ట్- బీలో మాత్రం ఎటువంటి పొరపాట్లు ఉన్నా అంటే వైట్ నర్ వినియోగం, బబ్లింగ్, తుడిచివేతలకు పాల్పడితే వాటిని మూల్యాంకనం చేయరాదని పేర్కొంది.
కమిషన్ వీటిని పట్టించుకోకుండా చివరకు 2019 లో తుది ఫలితాలను విడుదల చేసింది. వారికి 2020 జనవరిలో పోస్టింగ్ లు సైతం ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ లు విచారించిన న్యాయస్థానం చివరకు మెరిట్ లిస్ట్ రద్దు చేస్తునట్లు ప్రకటించింది.
ఇప్పుడు ఏం చేయాలి..
తీర్పు కాపీ కోసం ప్రస్తుతం వేచి చూస్తున్నామని కమిషన్ ప్రకటించింది. ఈ తీర్పు వచ్చిన తరువాత మరోసారి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం లో అప్పీల్ చేసే ఆలోచనలో కమిషన్ ఉంది.
భౌతికంగా రీవాల్యూయేషన్ చేపట్టాలన్న ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసిందని తెలిపింది. ఇప్పటికే నియమాకాలు పూర్తయ్యాయని తెలిపింది. దురుద్దేశం, పక్షపాతం ఉంటేనే కోర్టులు జోక్యం చేసుకోవాలి. లేదంటే నియామక ప్రక్రియలోకి న్యాయవ్యవస్థ వెళ్లకూడదని సుప్రీంకోర్టు పలు సందర్భాలలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించింది.
కొనసాగుతున్న గ్రూప్-1 వివాదం..
తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రకటించిన గ్రూప్-1 పరీక్ష కూడా ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలకు గానీ తొలి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకటించని కమిషన్, దాని నిర్వహణలో ఘోరంగా విఫలం అయింది.
ఏకంగా మూడు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. మొదట 2022 లో కమిషన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అది కమిషన్ లీక్ చేసినట్లు తేలడంతో తరువాత ప్రభుత్వం రద్దు చేసింది.
రెండోసారి హడావిడిగా పరీక్ష నిర్వహించడంలో హైకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం మారడంతో కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ సర్కార్ పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. కొత్తగా మరికొన్ని పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇక్కడ కూడా కమిషన్ నిర్వహణ లోపాలు బయటపడ్డాయి.
తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థుల సంఖ్యలోనూ తేడాలు రావడంతో కమిషన్ పై అందరికి అనుమానాలు ముసురుకున్నాయి.
ఈ విషయంపై దాఖలైన కేసులను విచారించిన హైకోర్టు మెయిన్స్ ను రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై కమిషన్ ద్విసభ్య బెంచ్ ను ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనం కేసు పై స్టే విధించింది.
తుది నియమాకాలు హైకోర్టు తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి నిన్న కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ విషయంపై కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో అని గ్రూప్-1 ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.