రాఖీ పండగ ఆర్టీసీలో సూపర్ హిట్, రికార్డు స్థాయిలో కలెక్షన్
రాఖీ పౌర్ణమి నాడు ఆర్టీసీ బస్సుల్లో ఒక్కరోజే 63.86 లక్షల మంది ప్రయాణం.మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్న 41.74 లక్షల మహిళలు.
ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) రికార్డు స్థాయిలో 63.86 లక్షల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో 41.74 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నరు. 21.12 లక్షల మంది నగదు చెల్లించి బస్సుల్లో ప్రయాణం చేశారు.
రాఖీ పర్వదినం రోజున రికార్డు స్థాయిలో 32 కోట్ల రాబడి ఆర్టీసీకి వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు పోతే, టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేదు. ఈవివరాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసి తన మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగించుకుందని, ఉద్యోగులు రాత్రి ,పగలు నిరంతరం శ్రమించారని వారి సేవలను కొనియాడారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని రద్దీ ఉన్న రూట్లలో బస్సులు అదనంగా నడిపించి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యారన్నారు.
రాఖీ పండగ ఉన్నప్పటికీ సిబ్బందికి నిరంతరం శ్రమించారని ,ఆర్టీసి డ్రైవర్లు , కండక్టర్లకు కూడా ఫీల్డ్ లోనే బస్సుల్లో వారి సోదరీమణులు రాఖీలు కట్టారని వారందరికీ అభినందనలు తెలిపారు.
మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్టీసి లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సోదరులకు రాఖీ కట్టారని, వారందరినీ అభినందిస్తూ శుభకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతంగా ఆర్టీసీ అమలు చేస్తోందని గుర్తు చేశారు.ఆర్టీసీని ఆదరిస్తోన్న, ప్రొత్సహిస్తోన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.