జూబ్లీహిల్స్..నియోజకవర్గానికి ఆ పేరే తప్పు
x
Jubilee Hills constituency

జూబ్లీహిల్స్..నియోజకవర్గానికి ఆ పేరే తప్పు

జూబ్లీహిల్స్ అంటే మామూలుగా అందరిలోను ఉన్న అభిప్రాయం ఏమిటంటే అత్యంత సంపన్నులు, సెలబ్రిటీలు, అత్యంత ప్రముఖులు, వీవీఐపీలుండే ప్రాంతమని


కొన్నిసార్లు తెలిసో, తెలీకో తప్పులు జరిగిపోతుంటాయి. జరిగిన తప్పు ఎందుకు జరిగింది ? ఎలా జరిగింది ? ఎవరు కారణం అంటే ఎవరూ చెప్పలేరు. ఇపుడు విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills by poll) నియోజకవర్గం ఉపఎన్నిక మొత్తం రాష్ట్రం దృష్టినే ఆకర్షిస్తోంది. ఉపఎన్నికలో గెలుపుకోసం కాంగ్రెస్(Telangana Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలు ప్రచారంతో, రోడ్డుషోలతో హోరెత్తించేస్తున్నాయి. జూబ్లీహిల్స్ అంటేనే మామూలుగా అందరిలోను ఉన్న అభిప్రాయం ఏమిటంటే అత్యంత సంపన్నులు, సెలబ్రిటీలు, అత్యంత ప్రముఖులు, వీవీఐపీలుండే ప్రాంతమని. అయితే విచిత్రం ఏమిటంటే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గంలో అసలు జూబ్లీహిల్స్ ప్రాంతమే లేదు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏడు డివిజన్లున్నాయి. అవేమిటంటే షేక్ పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్ నగర్, వెంగళరావునగర్, యూసుఫ్ గూడ, సామోజీగూడలోని కొంత ప్రాంతం అంతే. పైన చెప్పిన ఏడు డివిజన్లలో జూబ్లీహిల్స్ అన్నదే లేదు గమనించారా. మామూలుగా నియోజకవర్గంలో ఉండే ప్రముఖ ప్రాంతం పేరే ఆ నియోజకవర్గానికి ఉంటుంది. ఉదాహరణకు ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే ఖైరతాబాద్ డివిజన్ పేరుతోనే వచ్చింది. ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటే ఎల్బీ నగర్ డివిజన్ పేరుతోనే ఏర్పడింది. మునుగోడు నియోజకవర్గం అంటే మునుగోడు మండలంపేరుతో ఏర్పడింది. ఖమ్మం నియోజకవర్గం అన్నది ఖమ్మం పేరుమీద ఏర్పడింది. ఏ నియోజకవర్గం తీసుకున్నా ఇదే పద్దతిలో ఏర్పడుతుంది.

మరి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనే పేరు ఇపుడు ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గానికి ఎలాగ వచ్చిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతం ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్ వ్యవస్ధీకరణలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడింది. కొత్తగా నియోజకవర్గం ఏర్పడినపుడు ఆ నియోజకవర్గం పరిధిలో ఉండే ఏడు డివిజన్లలోని ఏదో ఒక డివిజన్ పేరునే నియోజకవర్గానికి పెట్టుండాలి. కాని అప్పుడు అలా జరగకకుండా విచిత్రంగా నియోజకవర్గంతో ఎలాంటి సంబంధంలేని జూబ్లీహిల్స్ పేరును ఎవరు పెట్టారో ? ఎందుకు పెట్టారో కూడా అర్ధంకావటంలేదు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికం బస్తీలే. నియోజకవర్గంలో ఎగువమధ్య తరగతి జనాలు కొందరున్నారు. మిగిలిన జనాలంతా మధ్య తరగతి, దిగువమధ్యతరగతి జనాలే. నియోజకవర్గంలోని 4 లక్షల ఓటర్లలో అత్యధికులు బస్తీల్లోనే ఉంటారంటేనే నియోజకవర్గం పరిస్ధితి ఏమిటో తెలుస్తోంది. ఈనియోజకవర్గంలో 70 బస్తీలున్నాయంటేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంతగా వెనకబడుందో అర్ధమైపోతోంది.

Read More
Next Story