కేసీఆర్ లో నిద్రలేచిన ఉద్యమకారుడు!
x
కేసీఆర్ ఫైల్ ఫోటో

కేసీఆర్ లో నిద్రలేచిన ఉద్యమకారుడు!

తెలంగాణా మాటల మాంత్రికుడు, పదునైన పదాలతో తిమ్మినిబమ్మిన చేయగల దిట్ట. ప్రజా సమ్మోహితుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) లో ఉద్యమకారుడు మళ్లీ మేల్కొన్నాడు


తెలంగాణా మాటల మాంత్రికుడు, యాస, భాషల్లో ఆరితేరిన ఉద్దండుడు, వక్త, పదునైన పదాలతో తిమ్మినిబమ్మిన చేయగల దిట్ట. ప్రజా సమ్మోహితుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలియాస్ కేసీఆర్. సమయస్పూర్తి మెండు. సమయానుకూలత దండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆయనకు బాగా తెలుసన్నది జగద్వితం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన మళ్లీ తన విశ్వరూపాన్ని చూపేందుకు సమయాత్తం అయ్యారు” అన్నారు 20 ఏళ్లుగా బీజేపీ బీట్ వార్తలు రాస్తున్న ఓ సీనియర్ జర్నలిస్టు సతీష్. ఆయన వ్యాఖ్యలో కాస్తం వ్యంగం పాలున్నా కేసీఆర్‌ మళ్లీ పోరుబాట పట్టిన మాట నిజం. చలో నల్గొండ సభలో కేసీఆర్ చెరిగిన నిప్పులే సంకేతాలు.


‘అధికారం పోయింది కదా ఐదేళ్లు ఆరాంగా కూర్చుందామనుకున్నా. ఈ కాంగ్రెస్సోళ్ల తీరు చూస్తుంటే మళ్లీ ఉద్యమించక తప్పడం లేదు.. సద్ది మూటలతో సిద్ధంగా ఉండండి’ అని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. తన లోని పూర్వపు ఉద్యమకారుణ్ణి మళ్లీ మేల్కొలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలో వాడిన భాషను ఉపయోగించారు. బహుశా వయసు పైబడుతున్నందు వల్లనేమో... ఉద్యమ కాలం నాటి వాడి లేకపోయినా వేడి మాత్రం తగ్గలేదు. తిట్లు, శాపనార్థాలు, ప్రత్యర్థుల్ని ఆత్మరక్షణలో పడేసే నేర్పు, స్పీచ్ లో మెరిసిన మెరుపులతో సాగిన ఆయన 40 నిమిషాల ప్రసంగం.. ‘మరో పోరుకు సిద్ధం కండి, బజార్లో అటో ఇటో తేల్చుకోవడానికి సన్నద్ధం కండి’ అనే పిలుపే ఎక్కువ మందికి వినిపించింది.

పదేళ్ల తర్వాత కేసీఆర్ నోట ఉద్యమాభినందనల మాట...

‘నిజానికి ఆయన మంచి ప్రతిపక్ష నేతగా ఉంటేనే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందేమోనన్న‘ సీనియర్ పాత్రికేయుడు నందిరాజు రాధాకృష్ణ వ్యాఖ్య.. కేసీఆర్ యుద్ధ సన్నద్ధతను తెలియజేస్తోంది. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో కేసీఆర్ ఎప్పుడు ప్రసంగం మొదలు పెట్టినా ముందు చెప్పే మాట ‘ఉద్యమాభినందనలు’. మళ్లీ ఇంతకాలానికి విన్నాం. ‘కేసీఆర్ చాలా గ్రేటబ్బా. పదేళ్ల పాలన తర్వాత మళ్లీ జనానికి ఉద్యమాభినందనలు చెప్పారు. అంటే కేసీఆర్ స్వరం మారినట్టే కదా’ అన్నారు నల్గొండ సభకు వెళ్లి వచ్చిన హైదరాబాద్ రాంనగర్ వాసి చీకట్ల మహేశ్.

ఇది రాజకీయ సభ కాదు, ఉద్యమ సభ...

ఏమైతేనేం, అధికారం పోయిన తర్వాత ఉద్యమకాలం నాటి స్పిరిట్‌ ను చూపించారు కేసీఆర్. రానున్న రోజుల్లో రాజకీయం మరింత వాడీవేడిగా ఉండనుంది. ‘ఇది రాజకీయ సభ కాదు, ఉద్యమ సభ‘ అని కేసీఆర్ స్పష్టంగా తేల్చిచెప్పడంతో మున్ముందు రాజకీయం రంజుగా ఉంటుందనే దాన్లో ఎటువంటి సందేహం లేదు. ‘అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులు దుర్మార్గంగా మాట్లాడారు’ అని కేసీఆరే అన్నందున మున్ముందు ఆయన అసెంబ్లీలో కూడా కాలుదువ్వుతారని అర్థమవుతోంది. అదే జరిగితే ముందుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు ఉద్యమాభినందనలు చెప్పాల్సిందే.

కేసీఆర్ అసెంబ్లీకి వెళితే కాంగ్రెస్ కు చెమటలే...

‘కాంగ్రెస్ సర్కార్ని ఎవడ్రా కూల్చేది’ అంటూ సీఎం రేవంత్ పెట్టిన గావుకేకకు కేసీఆర్ స్పష్టంగానే బదులిచ్చారు. ‘ఐదేళ్ల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండబోతోంది. ఉద్యమానికి సిద్ధం కావాలి. మళ్లీ సద్ది కట్టుకుని రావాలి’ అని కేసీఆర్ చెప్పడమంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని, వచ్చే ఐదేళ్లలో చుక్కలు చూపిస్తామనే అర్థం చేసుకోవాలి.

“కాలు విరిగిపోయినా.. కట్టె పట్టుకొని నల్లగొండ సభకు వెళ్లినట్టే” మున్ముందు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా వస్తే తెలంగాణ ప్రజలకు చాలా వాస్తవాలు, ఏ ఉద్యమం వెనుక ఎవరి ప్రయోజనమేంటో కూడా తెలుస్తుందన్న సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు మాటలు నిజమవుతాయి.

మంటలు పుట్టించిన కేసీఆర్ ప్రసంగం..

కేసీఆర్ వాగ్ధాటికి సామాన్యుడు ఫ్లాట్ అయిపోవాల్సిందే. బహుశా ఇప్పుడున్న శాసనసభ్యుల్లో కూడా అంత ఇంపుగా, సొంపుగా మాట్లాడే వారు లేరంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఇంట్లో ఉండి లైవ్ చూసే కన్నా సభకు వెళితే నిజంగానే ప్రజలకు మేలు జరుగుతుంది. నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వడానికి పనికివస్తారు. వాస్తవానికి ఆయన అంశాలపై పట్టుంది. నిన్న ఆయన చేసిన ప్రసంగం నిజంగానే మంటలు పుట్టించింది.

“కృష్ణా జలాల్లో మన హక్కులు జీవన్మరణ సమస్య. నీళ్లు దొంగిలించే వారికి హెచ్చరిక“ అంటూ కేసీఆర్ పెట్టిన పొలికేక సభకు హాజరైన వారిలో కొత్త ఉత్సాహాన్ని రెకెత్తించింది. “కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయమిది” అన్నప్పుడు యువత కేరింతలు కొట్టింది.

పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు...

“నిజాన్ని మసిపూసి మారేడు కాయ చేయడంలో ఆయనకు (కేసీఆర్) ఆయనే సాటి. కృష్ణా జలాల్లో ఏమి జరిగిందో ఆయనకు తెలియదా.. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని చూసింది ఆయన, ఆయన పార్టీ వాళ్లే“ అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దాన్ని కూడా కేసీఆర్ సమర్థంగానే తిప్పికొట్టారు. “ఓట్లు వచ్చినప్పుడే కొందరు వస్తారు. పచ్చి అబద్ధాలు చెబుతారు. తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించిందే నేను. నిధులు, నీళ్లు, నియామకాలే మన ఉద్యమానికి పునాది. అలాంటోళ్లి నేను కృష్ణా జలాల్ని పోనిస్తానా, ఈ సన్నాసులకు ఏమి తెలుసు“ అని కేసీఆర్ తిప్పికొట్టారు. ఇదేసమయంలో ప్రజలతో ఓ నిష్టూరం కూడా ఆడారు.

“ప్రజలకు ఏం కోపం వచ్చిందో ఏమో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు. నా కట్టే కాలే వరకు తెలంగాణ కోసం కొట్లాడుతా. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం కానివ్వను. పులి లాగా కొట్టాడుతా తప్ప పిల్లి లాగా సైలెంట్‌గా ఉండను” అని కేసీఆర్ గర్జించారు.

ఉరికెత్తించడానికి కావాల్సిన ముడిసరుకంతా...

శ్రీ.శ్రీ. మహాప్రస్తానం మాదిరి కాళోజీ నారాయణ రావు కవిత్వం మాదిరిగా జనాన్ని ఉద్యమం వైపు నడిపించడంలో కేసీఆర్ కి మించిన వాళ్లు ఎవరు ఉండరన్నది అందరికీ తెలిసిన విషయమే. అందువల్లే చాలా మంది మేధావులు ఉన్నా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్లు కేసీఆర్ ను ఉద్యమానికి ముందు పెట్టారు. పార్టీని పెట్టించారు. లక్ష్యాన్ని చేరుకున్నారు.

కేసీఆర్ నిన్న చెప్పిన మాటల్నే చూడండి.. ఎంత కన్వీన్సింగ్ గా, జనాన్ని ఉరికెత్తించేలా ఉన్నాయో..

“కాంగ్రెస్‌ వాళ్లకు పదవులు, డబ్బులు కావాలి తప్ప ప్రజలు ముఖ్యం కాదు”

“ఎవరికి పదవి శాశ్వతం కాదు, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం”

“నీళ్లు, కరెంట్‌కు ఇబ్బందులు సృష్టితే ఎక్కడికక్కడ నిలదీస్తాం”

“రైతుబంధు ఇవ్వాలంటే చెప్పుతో కొడతామంటారా?”

“రైతుల చెప్పులతో కొడితే మూతి పళ్లు ఊడిపోతాయి”

“కేసీఆర్‌ను చంపుతారా? నన్ను చంపి మీరు ఉంటారా?”

“సమస్యలపై ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తుంది, బలాదూర్‌గా తిరుగుతామంటే ఊరుకోం”

“కేసీఆర్‌ను బద్నాం చేయాలని రైతుల పొలాలు ఎండబెడతారా?”

“మేడిగడ్డ పిల్లర్లు కుంగితే బాగు చేసి నీళ్లు ఇవ్వండి, నాగార్జునసాగర్‌ కుంగలేదా?”

“తెలంగాణను నాశనం కానివ్వం’

“కృష్ణా జలాలపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి”

“24ఏళ్ల నుంచి రాష్ట్రమంతా పక్షిలా తిరిగి నీళ్లగురించి చెప్పా”

“కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయమిది”

“పులి లాగా కొట్టాడుతా తప్ప పిల్లి లాగా సైలెంట్‌గా ఉండను”

ఈ మాటల్ని బట్టి చూస్తుంటే కేసీఆర్ మరోసారి ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. తనలోని ఉద్యమకారుణ్ణి నిద్రలేపారు. ఉద్యమకారునిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉండనే ఉంది. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడానికి కావాల్సినంత ముడిసరుకు కేసీఆర్ సొంతం. ఇకపై కేసీఆర్ వేగం 3.0 ఎలా ఉండనుందో తెలంగాణ వీధుల్లో చూడాల్సిందే.

Read More
Next Story