
కేసీఆర్ ఒప్పందమే తెలంగాణకు మరణశాసనం
కేసీఆర్ విదానాలే కృష్ణాజలాల్లో పాలమూరుకు అన్యాయం జరగటానికి కారణమైనట్లు వెదిరే స్పష్టంగా చెప్పారు
కృష్ణా జలాల పంపకాల విషయంలో అప్పట్లో కేసీఆర్ చేసుకున్న ఒప్పందమే ఇపుడు తెలంగాణకు మరణశాసనంగా మారిందని కేంద్ర జలశక్తి మాజీ సలహదారుడు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(Vedire Sriram) వెదిరే శ్రీరామ్ చెప్పారు. వెదిరే నదీజలాలు, నీటి ప్రాజెక్టుల అంశాల్లో అపారమైన పరిజ్ఞానం ఉన్న నిపుణుడు. మంగళవారం శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతు ఆదివారం కేసీఆర్(KCR) నీటిపంపిణీ, ప్రాజెక్టులపై చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతు కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు కృష్ణాజలాల పంపిణీలో తెలంగాణకు 299 టీఎంసీల వాటా చాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించి సంతకాలు పెట్టినట్లు ఆరోపించారు.
299 టీఎంసీల నీరుచాలని అప్పట్లో కేసీఆర్ ఒప్పందంచేసుకుని సంతకాలు పెట్టిన కారణాలు ఏమిటో తానే చెప్పాలని అన్నారు. 811 టీఎంసీల జలాల్లో కేసీఆర్ 299 టీఎంసీల జలాల వాటా చాలని అంగీకరించి ఎందుకు సంతకాలు చేశారు అని నిలదీశారు. అప్పుడు 299 టీఎంసీల నీటికి కేసీఆర్ చేసుకున్న ఒప్పందమే ఇపుడు తెలంగాణకు మరణశాశనంగా మారిందన్నారు. కేసీఆర్ విదానాలే కృష్ణాజలాల్లో పాలమూరుకు అన్యాయం జరగటానికి కారణమైనట్లు వెదిరే స్పష్టంగా చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని 299 టీఎంసీల నీటికి కేసీఆర్ అంగీకరించారా ? అని శ్రీరామ్ ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్లానింగ్ ఉన్నపుడు కేసీఆర్ అప్పుడు ఏ విధంగా 299 టీఎంసీల జలాలకు ఒప్పందం చేసుకున్నారని నిలదీశారు. అగ్రిమెంట్ ప్రకారం తెచ్చుకున్న 299 టీఎంసీల జలాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించుకోవటంలో ఫెయిలైందని మండిపోయారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ హడావుడి చేయటం తప్పితే ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేదని ఎద్దేవాచేశారు. 1050 టీఎంసీల జలాలను రెండు తెలుగురాష్ట్రాలకు కేటాయించే విషయమై కేంద్రప్రభుత్వం కొత్తగా ట్రైబ్యునల్ వేసిందని చెప్పారు. ట్రైబ్యునల్ లో ప్లానింగ్ ప్రకారం గట్టి లాయర్లను పెట్టుకుని వాదనలు వినిపిస్తే తెలంగాణకు 650 టీఎంసీల జలాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెదిరే శ్రీరామ్ చెప్పారు.
కృష్ణా, గోదావరి జిల్లాల ఉపయోగంపై కేసీఆర్-రేవంత్ తో పాటు బీఆర్ఎస్-మంత్రుల మధ్య గడచిన మూడురోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తికాకపోవటానికి, నీటి వాటాల్లో అన్యాయం జరగటానికి మీరు కారణమంటే కాదుకాదు మీరేకారణమని ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న విషయాన్ని అందరు చూస్తున్నదే. ఈ సమయంలోన నదీ జలాలు, నీటి ప్రాజెక్టులపై నిపుణుడు వెదిరే శ్రీరామ్ మాట్లాడుతు తెలంగాణకు అన్యాయం జరిగింది కేసీఆర్ కారణంగానే అనిచేసిన ఆరోపణలు సరికొత్త మాటల యుద్ధానికి దారీతీయటం ఖాయంగా కనబడుతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

