
కేంద్రం యూరియా సరఫరా చేయడం లేదు : తుమ్మల
రాష్ట్ర బిజెపి నేతలు బాధ్యత తీసుకోవాలి
రాష్ట్రంలో యూరియా సరఫరాపై కేంద్రంతో ఏప్రిల్ నుంచి పలు దఫాలు చర్చించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్ని సంప్రదింపులు జరిపినా యూరియా సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యం చేసిందని మంత్రి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. ఇప్పటివరకు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేంద్రం సరఫరా చేసిందన్నారు. జూన్‌లో 45 శాతం లోటు ఉందని మంత్రి తెలిపారు. కేంద్రం మాటలకు, చేతలకు పొంతనలేదన్నారు. ప్రకటనలకు, సరఫరాకు చాలా తేడా ఉందని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు యూరియా కొరత మీద లేఖలు రాశామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకు కూడా లేఖ రాసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా రాజకీయాలు ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బిజెపి నేతలు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. యూరియా సరఫరాకు రాష్ట్ర భాజపా నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు. రైతులకు అన్యాయం చేయొద్దని తుమ్మల సూచించారు.