
ప్రజల గొడవే కాళోజి కవిత్వం గొడవ
'అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు,' అని కాళోజి గర్వంగా తన కవిత్వ సారాంశాన్ని ప్రకటించుకున్నాడు
కాళోజి నారాయణరావు(Kaloji Narayana Rao)పై కవితా పంక్తులను చూస్తుంటే అవలోకిస్తే ఆయన కవిత్వం యొక్క అర్థం పరమార్ధం బోధపడుతుంది.కాళోజీగా కాళన్నగా ప్రసిద్ధుడు. ఆయన తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం ఊపిరిగా ముందూ వెనకా తన వంతు పాత్రను చురుకుగా పోషించాడు. కాళోజి ముఖ్యంగా గాంధీయవాది. మీది మిక్కిలి సున్నిత మనస్కుడు కావున కవి రచయితగా ప్రజా కవిగా రూపాంతరం చెందాడు. అందుకోసం ఆయన ఉపన్యాసం ఇచ్చినా ఆయనతో సంభాషించినా నెత్తిమీద కన్నీటి కుండ ఎత్తుకున్నట్టే కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలిపడుతుంటాయి.
కాళోజి నిజాం అలచివేతకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో విద్యార్థి నాయకుడిగా పాలుపంచున్నాడు. ఆయనదైన ముద్ర ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది. భారత ప్రధాని పి.వి. నరసింహారావు లాంటి వాళ్ళకు కాళోజీ అంటే అమితమైన గౌరవ ఆదరాభిమానం . ఆయనకు తెలుగు మాతృభాష అంటే మిక్కిలి ఇష్టం. తెలంగాణలో జరిగిన గ్రంధాలోద్యమంలో భాషోద్యమంలో ఆయన పాత్ర ఎన్నదగినది. అందుకే "బడి పలుకుల భాష కాదు మనకు పలుకుబడుల భాష కావాలి" అంటాడు.
కాళోజి నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న అప్పటి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కర్ణాటక బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. అతని తల్లి రమాబాయి కన్నడికుల ఆడపడుచు. తండ్రి కాళోజి రంగారావు మహా రాష్ట్రమునకు చెందినవాడు. నిజాం కాలంలో భూముల గణాంకాలు చూడడానికి మహారాష్ట్ర బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు వచ్చి మడికొండ గ్రామంలో స్థిరపడ్డారు. తన ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులో అనంతరం వరంగల్ లోని కాలేజియేట్ పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. హైదరాబాదులో న్యాయ శాస్త్రం పట్టా పొందినాడు. అంతేగాక కాళోజి తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఇంగ్లీష్ భాషలలో కవిగా ప్రసిద్ధి పొందాడు. ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో ఆయన ప్రముఖుడు. సమకాలీన సమస్యల పైన ప్రజల వైపు నిక్కచ్చిగా నిలబడి నా గొడవ కవిత్వంగా రాజ్యం పైన అక్షరాయుధాలను గురి చూసి సంధించిన ప్రజా వైతాళికుడు.
కాళోజీ ఆరు సంవత్సరాల వయసులో తల్లి రమాబాయి చనిపోవడం వలన తనకన్నా ఆరు సంవత్సరాలు పెద్దయిన అన్న రామేశ్వరరావు సర్వమై కాళోజీని ఆయన కుటుంబాన్ని పోషించాడు. తన సోదరుడు రామేశ్వరరావు చనిపోయినప్పుడు నారాయణరావు "ఆరవ ఏటా మా అన్న భుజాల మీద ఎక్కినాను. అతను చనిపోయేదాకా దిగలేదు. నేను అతని భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. నాకు 70 ఏళ్లు వచ్చేవరకు అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప అన్నాడు. అంటే వారి అన్నదమ్ముల అనుబంధం ఎంత ఉన్నతమైనదో ఎరుక పరుస్తుంది .
కాళోజి నారాయణరావు 1958 నుండి 1960 వరకు శాసనమండలి లో స్వతంత్ర సభ్యుడిగా రెండేళ్ల కాలం పాటు పని చేశాడు. నాటి ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్తు సంస్థ వ్యవస్థాపక సభ్యుడు. ఆయన తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. అంతేకాకుండా కేవలం కవి రచయితనే కాదు తన అనివార్యంగా అవసరమైనప్పుడు 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత 1977 జరిగిన శాసనసభ ఎన్నికలలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి నాటి ముఖ్యమంత్రి వెంగళరావుకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన లెబనేనియన్ కవి ఖలీల్ జిబ్రాన్ "ది ప్రాఫిట్" ను కాళోజీ "జీవన గీత" పేరున తెలుగు సేతగా అనువాదం తెనిగించారు. ఈ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఈ ప్రసిద్ధి జీవన గీత ను 1968లో నాటి యువభారతి సంస్థ ప్రచురించింది. ఈ సంస్థ తెలుగు సాహిత్య పుస్తకాలను ప్రచురించి సాహితీ మిత్ర పేరున తన సభ్యులకు అత్యుత్తమ గ్రంధాలను అందజేసి ఎనలేని సాహిత్య సేవ చేశారు. 1992లో భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అయినా పద్మ విభూషణ్ కాళోజికి అందజేసి కవుల పట్ల తనకు గల గౌరవం నిరూపించుకున్నది. ఆయనను అనేక ప్రముఖమైన సంస్థలు అవార్డులు ఇచ్చి సన్మానించుకొన్నవి. 1981లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కారం పొందారు. కాకతీయ విశ్వవిద్యాలయం 1992లో కాళోజీకి డాక్టరేట్ ప్రధానం చేసినది. మద్రాస్ కళాసాగర్ రామినేని ఫౌండేషన్ బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం ఇలాంటివి ఎన్నో సంస్థలు కాళోజి ని సత్కరించడం ద్వారా తమ తమ సంస్థల పుష్కారాలకు గౌరవం చేకూరినట్టు అయింది.
కాళోజి గాంధీ అహింస మార్గాన్ని అనుసరించినా పరిస్థితులను బట్టి ప్రతి హింసను స్వాగతించాడు. ఆయన బతికినంత కాలం నిజాం వ్యతిరేకంగానే కాకుండా యువకులను చైతన్యం పరుచేస్తూ, పాలకులు చేసే అన్యాయాన్ని అక్రమాలను తన ప్రభావవంతమైన ఉపన్యాసాలు, కవితల ద్వారా ఎదుర్కొన్నాడు. అందుకే ఆయన ఒకానొక చోట ఇతిహాసాల్లోని ప్రహ్లాదుడు మొదటి తిరుగుబాటుదారుడు అంటాడు. నిజాం ను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా తన కవితలను మరింత పదునెక్కించాడు. 1939, 1943లో రెండుసార్లు జైలు జీవితం గడిపాడు. ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1 ఏర్పడినప్పుడు పాములపర్తి సదాశివరావు తో కలిసి తెలంగాణ ప్రత్యేక సంచికను విడుదల చేశాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ కావాలని జరిగిన అన్ని ఉద్యమాలలో తన వంతు బాధ్యతగా పాలుపంచుకున్నాడు. జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు" పుట్టుక నీది చావు నీది బతకంతా దేశానిది"అన్నాడు. ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని కాళోజి కలం గళమెత్తి విలక్షణంగా పలికాడు. ఆయన ప్రజల పక్షం వహించే కవి రచయితనే కాకుండా ప్రజల ఆకాంక్షలకు ప్రముఖంగా ఎలుగెత్తి చాటిన అసలు సిసలైన ఉద్యమకారుడు. అన్నిటి కన్నా మిక్కిలి తెలుగు భాష అన్న అభిమానం గౌరవం.
"తెలుగు వాడైనా తెలుగు రాదనుచు
సిగ్గు లేక ఇంక చెప్పుడెందుకురా
అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెఃదుకురా "
తెలుగు భాష పైన గల ఆత్మాభిమానంతో తన కవిత ద్వారా కాళోజి తీవ్ర స్వరంతో తెలుగు సమాజాన్ని హెచ్చరిక చేసాడు.