తెలంగాణలో ‘సెప్టెంబర్ 17’ పై రగులుతున్న వివాదం
x
Nizam bows to Sardar Patel

తెలంగాణలో ‘సెప్టెంబర్ 17’ పై రగులుతున్న వివాదం

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలాగ మాట్లాడిన పార్టీలు అధికారంలోకి రాగానే పూర్తి భిన్నంగా మాట్లాడుతుండటంతో వివాదం రాజుకుంటోంది


కొన్నిఅంశాలు తెలంగాణలో రావణకష్టంలాగ ఎప్పటికీ రగులుతునే ఉంటాయి. అవి ఏపీతో నీటి వివాదాలు కావచ్చు, విభజన చట్టం అమలూ కావచ్చు లేదా రాజకీయ అంశాలు కూడా కావచ్చు. అలాంటి అంశమే ఒకటి ఇపుడు రగులుతోంది. అదేమిటంటే ‘తెలంగాణ దినోత్సవం’. ప్రతిఏడాది సెప్టెంబర్ 17వ(September 17) తేదీ రాజకీయపార్టీల మధ్య బాగా వివాదాస్పదమవుతోంది. కారణం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలాగ మాట్లాడిన పార్టీలు అధికారంలోకి రాగానే పూర్తి భిన్నంగా మాట్లాడుతుండటం. ఇపుడు పాయింట్ ఏమిటంటే సెప్టెంబర్ 17వ తేది విషయమై అధికార కాంగ్రెస్(Telangana Congress), ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS), ప్రతిపక్ష బీజేపీ(Telangana BJP) మధ్య పెద్ద వివాదం రగులుతోంది. అదేమిటంటే సెప్టెంబర్ 17, 1948లో నిజాం(Nizam) స్టేట్ ఇండియన్ యూనియన్లో కలిసింది.

ఇండియన్ యూనియన్లో నిజాం స్టేట్ కలిసిన రోజును బీజేపీ ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ గా నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా అభివర్ణించేది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నపుడు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకాలంలో బీఆర్ఎస్ కూడా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ అని చెప్పేది. తాము అధికారంలోకివస్తే తెలంగాణవిమోచనదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అధినేత కేసీఆర్ చాలాసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించటంలేదని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు ఎన్నోసార్లు డిమాండ్లు చేశారు. 2014లో ప్రత్యేక తెలంగాణ వచ్చినతర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మాటమార్చారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రకటించిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ళు సెప్టెంబర్ 17వ తేదీని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ గా నిర్వహించారు.

ఏఐఎంఐఎం మిత్రపక్షం ఒత్తిడిమేరకే తెలంగాణ విమోచనోత్సవాన్ని కేసీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా మార్చారని అప్పట్లో బీజేపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కూడా తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఎంఐఎం ఒత్తిడి మేరకే జాతీయ సమైక్యతా దినోత్సవంగా మార్చినట్లు మండిపడ్డారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన లేదా తెలంగాణ విలీన దినోత్సవంగా సంబరాలు చేసుకోవటం ఎంఐఎంకు ఇష్టంలేదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నోసార్లు ఆరోపించారు. ఎవరిఆరోపణలు ఎలాగున్నా కేసీఆర్ మాత్రం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగానే నిర్వహించారు.

2023ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2024 సెప్టెంబర్ 17వ తేదీని రేవంత్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం అని కాకుండా ప్రజాపాలనా దినోత్సవం అని మార్చేసింది. దీనికి ముఖ్యకారణం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతుండటమే అని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రజాకార్ల భవజాలంతో ఏర్పాటైన ఎంఐఎం తెలంగాణ విమోచన, తెలంగాణ విలీన దినోత్సవాలను మొదటినుండి వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు చాలామంది బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. బుధవారం జరగబోయే సెప్టెంబర్ 17వ తేదీని రేవంత్ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహించబోతున్నట్లు ఉత్తర్వులుజారీచేసింది.

ఇదేసమయంలో కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాధ్ సింగ్ హైదరాబాదుకు వస్తున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొనేందుకు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో బుధవారం రేవంత్ ప్రజాపాలనా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. పోయినతఏడాది సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొన్నారు. బుధవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమిచేస్తారో తెలీదు.

నిజానికి సెప్టెంబర్ 17వ తేదీన జరిగే కార్యక్రమాన్ని బీజేపీ చాలాకాలం పార్టీపరంగానే జరిపింది. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మాత్రమే కేంద్రప్రభుత్వంతో తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటింపచేశారు. అప్పటినుండి సెప్టెంబర్ 17ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకపేరుతో నిర్వహిస్తుంటే కేంద్రప్రభుత్వం మాత్రం మరోపేరుతో నిర్వహిస్తోంది. రేవంత్ ప్రభుత్వం సెప్టెంబర్ 17కి ప్రజా పాలనా దినోత్సవం అని కొత్తపేరు పెట్టింది. ఒకే అంశంపై పార్టీలనేతలు తలోరకంగా మాట్లాడుతు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న కారణంగా సెప్టెంబర్ 17 రగులుతున్న వివాదంగా మారిపోయింది.

విమోచనం కాదు విలీనమే : నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మాట్లాడుతు సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవమే అన్నారు. ముస్లింలపై సాధించిన విజయంగా చూపించేందుకు మాత్రమే బీజేపీ సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి(విమోచన)దినంగా ప్రచారం చేస్తున్నదని మండిపోయారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో 4 వేలమంది చనిపోయినట్లు చెప్పారు. కమ్యూనిస్టుల త్యాగాలను మిగిలిన పార్టీలు తక్కువచేసి చూపిస్తున్నాయని ఆరోపించారు. సెప్టెంబర్ 17వ తేదీన నిజాంనవాబు విధిలేక కేంద్రప్రభుత్వానికి లొంగిపోయిన విషయం అందరికీ తెలుసన్నారు. నిజాంస్టేట్ ను ఇండియన్ యూనియన్లో కలిపేందుకు రాజీచర్చల తర్వాత నిజాం అంగీకరించినట్లు తెలిపారు. కాబట్టే సెప్టెంబర్ 17ను సీపీఐ తెలంగాణ విలీనదినంగా పరిగణిస్తున్నట్లు నారాయణ చెప్పారు.

అధికారికంగా నిర్వహించాలి: సీహెచ్

అప్పట్లో పార్టీలకు అతీతంగా తెలంగాణ విమోచన ఉద్యమం జరిగినట్లు మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీమంత్రి సీహెచ్ విద్యాసాగరరావు గుర్తుచేశారు. కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి నాయకత్వంలో జరిగిన సత్యాగ్రహంలో ఆర్యసమాజ్, కాంగ్రెస్ తో పాటు అన్నీపార్టీలు పాల్గొన్నట్లు చెప్పారు. అప్పటి పోరాటంలో బీజేపీ కూడా పోరాటాలు చేసింది అనే అర్ధం వచ్చేట్లుగా పరోక్షంగా విద్యాసాగర్ రావు మాట్లాడారు. బీజేపీ ఒత్తిడికి తలొంచి సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా నిర్వహించేందుకు ఒకపుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ అంగీకరించినా అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చి పేర్లు మార్చేశాయని సీహెచ్ మండిపోయారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా గుర్తిస్తు పోయిన ఏడాది కేంద్రప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన విషయాన్ని విద్యాసాగర్ గుర్తుచేశారు. సెప్టెంబర్ 17ను ప్రజాపాలనా దినోత్సవం పేరుతో కాకుండా రేవంత్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని సీహెచ్ డిమాండ్ చేశారు.

బీజేపీకి ఏమి సంబంధం ? వీహెచ్

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వీ. హనుమంతరావు(వీహెచ్) మాట్లాడుతు తెలంగాణ విమోచన దినం పేరుతో హడావుడి చేస్తున్న బీజేపీకి సెప్టెంబర్ 17వ తేదీతో ఏమి సంబంధమని ప్రశ్నించారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలోను, తెలంగాణ సాయుధ పోరాటంలోను కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు మాత్రమే పాల్గొన్నారని గుర్తుచేశారు. అప్పట్లో జరిగిన నిజాం వ్యతిరేక పోరాటంపై ఇపుడు బీజేపీ హడావుడి చేయటమే చాలా ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఏకైక కారణంగానే నిజాంస్టేట్ ఇండియన్ యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవంగా గెజిట్ విడుదల చేసినట్లు మండిపడ్డారు.

Read More
Next Story