మొదటి గిరిజన స్వాతంత్య్ర యోధుడు ఎవరో తెలుసా ?
x
Tribal Freedom Fighter Ramji Gond

మొదటి గిరిజన స్వాతంత్య్ర యోధుడు ఎవరో తెలుసా ?

దేశంలో బ్రిటీషువారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం మొదట గిరిజనుల నుండే ప్రారంభమైంది. అదికూడా తెలంగాణలోని రాంజీగోండు(Ramji Gond) నాయకత్వంలోనే


దేశంలో బ్రిటీషువారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటం మొదట గిరిజనుల నుండే ప్రారంభమైంది. అదికూడా తెలంగాణలోని రాంజీగోండు(Ramji Gond) నాయకత్వంలోనే. గిరిజన స్వాతంత్ర్య పోరాటాల్లో(Guerrilla Fighting) తెలంగాణ(Telangana) చాలా కీలకమైన ప్రాంతం. 1857లో సిపాయిల తిరుగుబాటుకు(1857 Sepoy Mutiny) ముందే గోదావరి నదికి ఉత్తర భాగంలోని గిరిజన ప్రాంతాలు రాంజీ గోండ్ నేతృత్వంలో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం(Nizam), బ్రిటిష్(British) పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. రాంజీ గోండ్ దాదాపు 500 మంది గోండ్ యోధులను, 500 మంది రోహిల్లాలు, దక్కనీలను సమీకరించి నిజాం, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు.

గోదావరినది(Godawari River) పరిహాక ప్రాంతమైన ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాలను కేంద్రంగా చేసుకుని రాంజీగోండ్ చేస్తున్న పోరాటాలను అణిచివేసేందుకు నిర్మల్ కలెక్టర్ సమాచారం ఆధారంగా నిజాం, బ్రిటీష్ సైన్యాలు పెద్ద ప్రయత్నాలే చేశాయి. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిజాం, బ్రిటీష్ పాలకుల దగ్గర ఆయుధాలున్నా ఏ విధంగాను పనిచేయలేదు. ఎందుకంటే దట్టంగా ఉండే ఆదిలాబాద్ అడవుల్లో రాంజీ గోండ్ గెరిల్లా తరహా పోరాటాలు చేశాడు. గెరిల్లా తరహా పోరాటాలు చేయటంలో రాంజీ బాగా ఆరితేరిపోయాడు. గెరిల్లా తరహా పోరాటాల్లో ఎలాంటి నైపుణ్యంలేని సైన్యాలు అడువుల్లోకి రెండుసార్లు వెళ్ళి బాగా దెబ్బతిన్నాయి. ఇదే విషయాన్ని కలెక్టర్ హైదరాబాదులోని బ్రిటీష్ ఉన్నతాధికారులకు వివరించాడు. హైదరాబాద్ లో ఉండే బ్రిటీష్ రెసిడెంట్ అధికారి ఆదేశాల ప్రకారం కల్నల్ రాబర్ట్ నాయకత్వంలో బళ్ళారి నుండి భారీ సైన్యం నిర్మల్ కు చేరుకుంది. తనగెరిల్లా పోరాటాలను రాంజీ ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని నిర్మల్-నారాయణఖేడ్ నుండి ఆదిలాబాద్ తూర్పుదిశలోని చెన్నూర్ వరకు, గోదావరి నది దక్షిణ సరిహద్దుగా విస్తరించిన అడవుల్లో చేశాడు. గెరిల్లా పోరాటాల్లో రాంజీని ఓడించలేమని అర్ధమైన సైన్యాలు చివరకు నాలుగువైపుల నుండి రాంజీతో పాటు గోండువీరులు దాక్కున్న అడవులను చుట్టుముట్టాయి.

స్ధానికుల్లో కొందరిని మాయచేసి లోబరుచుకున్న బ్రిటీష్ అధికారులు రాంజీ తన అనుచరులతో గోదావరి తీరంలో క్యాంపు వేసిన విషయాన్ని తెలుసుకున్నారు. రాంజీ తన సహచరులతో విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతంమీదకు సైన్యాలు సడెన్ గా ఒకరోజు రాత్రి దాడిచేశాయి. రాత్రిపూట సైన్యందాడిని రాంజీ గోండ్ ఊహించలేదు. గోదావరి తీరంలోని సోన్ అనే ప్రాంతంలో రాంజీతో పాటు వెయ్యిమంది గెరిల్లా వీరులను సైన్యం అదుపులోకి తీసుకున్నది. పట్టుకున్న ప్రాంతంలోనే అందరినీ విచారించిన సైన్యాలు చివరకు అందరినీ రోడ్లపైన ఈడ్చుకుంటూ తీసుకొచ్చి నిర్మల్ శివార్లలో ఉన్న ఊడలుదిగిన పెద్ద మర్రిచెట్టుకు కట్టేశాయి. చుట్టుపక్కల గ్రామాల్లోని జనాలందరినీ పిలిపించి ఏదో తూతూమంత్రంగా విచారణ జరిపినట్లుగా నాటకాలు ఆడిన సైన్యం రాంజీతో పాటు అందరికీ మరణదండన విధిస్తున్నట్లు ప్రకటించింది. కట్టేసిన మర్రిచెట్టుకే పట్టుబడిన వెయ్యిమందిని వేలాదిమంది జనాలు చూస్తుండాగానే సైన్యం ఉరితీసింది. అప్పటినుండి ఆ మర్రిచెట్టుకు వెయ్యిఊడల మర్రిచెట్టనే పేరొచ్చింది. (వెయ్యిమందిని ఉరితీశారు కాబట్టే వెయ్యిఊ(డ)ర్లు అనే పేరు స్ధిరపడింది.) అందుబాటులోని రికార్డుల ప్రకారం రాంజీతో పాటు వెయ్యిమందిని ఉరితీసింది 1860, ఏప్రిల్ 9వ తేదీ. దాదాపు 130 ఏళ్ళ తర్వాత 1995లో పెద్ద గాలివానకు ఆ మర్రిచెట్టు కూలిపోయింది.

అయితే ఇక్కడ విషాధం ఏమిటంటే రాంజీతో పాటు గోండు, రోహిల్లాల పోరాటాలు చరిత్రలో పెద్దగా రికార్డు కాలేదు. సంవత్సరాల పాటు నిజాం, బ్రిటీషు పాలకుల మీద రాంజీ గోండ్ చేసిన స్వాతంత్ర్య పోరాటాన్ని చరిత్రకారులు కూడా గుర్తుంచుకోవాల్సినంతగా రికార్డుచేయలేదు. బ్రిటీషు వాళ్ళపై మొదటి తిరుగుబాటు అనగానే అందరికీ 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటే గుర్తుకొస్తుంది. 1836 నుండి 1860 మధ్యకాలంలో గోండ్వానా ప్రాంతం కేంద్రంగా బ్రిటీష్, నిజాం పాలకులకు వ్యతిరేకంగా (ఉమ్మడి ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాలు) మర్సికోల్ల రాంజీగోండ్ చేసిన పోరాటాలకు చరిత్రలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదు. చరిత్రకారులను పక్కన పెట్టేసినా స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత పాలకులు కూడా గుర్తించలేదు.

తెలంగాణ ఉద్యమసమయంలో అనేకమంది ఉద్యమకారులు నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ దగ్గర రాంజీగోండ్ విగ్రహాన్ని, వెయ్యిఊర్ల మర్రిచెట్టు ఉండే ప్రాంతానికి దగ్గరలోనే మరో స్ధూపాన్ని ఏర్పాటుచేశారు. తెలంగాణ ఉద్యమకాలంలో రాంజీగోండ్ పేరుతో మ్యూజియం, అమరుల గుర్తుగా స్మారకభవనం ఏర్పాటు చేస్తామని చాలా హామీలిచ్చారు. 2014లో ప్రత్యేక తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా రాంజీగోండ్ మ్యూజియం ఏర్పాటుకాలేదు, స్మారకభవనం నిర్మాణమూ జరగలేదు. అయితే 2021, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చారు. రాంజీగోండ్ తో పాటు వెయ్యిమంది వీరులకు నివాళులర్పించటంతో జాతీయస్ధాయిలో రాంజీగోండ్ గురించి చర్చ జరిగింది.

గోండ్వానా చరిత్ర

మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లోని అనేక గిరిజన తెగలతో గోండ్వానా రాజ్యం ఉండేది. బ్రిటీషు వాళ్ళు మనదేశంలోకి అడుగుపెట్టకుముందే గోండ్వానా రాజ్యం ఉండేది. గోండుల పాలన 1240-1750 వరకు సుమారుగా 500 ఏళ్ళపాటు బ్రహ్మాండంగా సాగింది. గోండురాజుల్లో చివరివాడైన నీల్ కంఠ్ షా మరాఠీలు బంధించి రాజధాని చంద్రాపూర్ కు తరలించారు. ఎప్పుడైతే నీల్ కంఠ్ షా ను పట్టుకున్నారో గోండ్వానా రాజ్యం మరాఠాల వశమైంది. ఆ తర్వాత మరాఠాలను అణిచివేసిన బ్రిటీషర్లు గోండ్వానా రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత నిజాం పాలకులతో బ్రిటీషువారికి జరిగిన ఒప్పందంలో గోండ్వానా ప్రాంతాన్ని నిజాంకు బ్రిటీషర్లు అప్పగించేశారు. గోండ్వానా వాళ్ళే కాలక్రమంలో గోండులయ్యారు. గోండ్వానా నుండి వచ్చిన గిరిజన వీరుడే రాంజీ గోండ్. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం, ప్రముఖ చరిత్రకారుడు ద్వావనపల్లి సత్యనారాయణ రచనల కారణంగానే రాంజీ గోండ్ పోరాటాలు జనాలకు కొంతైనా పరిచయమైంది.

Read More
Next Story