
ఐదుగురు ఫిరాయింపు ఎంఎల్ఏలపై సంచలన తీర్పు
ఐదుగురు ఎంఎల్ఏలు బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తీర్పిచ్చారు
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎంఎల్ఏలు సేఫ్ అయ్యారు. ఐదుగురు ఎంఎల్ఏలు బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం తీర్పిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో పాటు మరికొందరు బీఆర్ఎస్(BRS) ఎంఎల్ఏలు పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపిస్తు కోర్టులో కేసులు దాఖలు చేశారు. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ పదిమంది ఎంఎల్ఏలను విచారించారు. పదిమంది ఎంఎల్ఏల్లో ఇద్దరు విచారణకు హాజరుకాకపోయినా మిగిలిన ఎనిమిది మంది విచారణకు హాజరయ్యారు.
డిసెంబర్ 18వ తేదీలోగా మొత్తం పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలపైన నిర్ణయం ప్రకటించాలని స్పీకర్ ను సుప్రింకోర్టు ఆదేశించింది. అందుకనే ఈరోజు ఐదుగురు ఎంఎల్ఏలపైన స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, గద్వాల ఎంఎల్ఏ కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆధారాలు లేవన్నారు. కాబట్టి ఈ ఐదుగురు ఎంఎల్ఏలు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలుగానే కంటిన్యు అవుతారని కూడా ప్రకటించారు.
స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ ఎంఎల్ఏలు మండిపోతున్నారు. స్పీకర్ తీర్పును సవాలుచేస్తు మళ్ళీ సుప్రింకోర్టులో మరో పిటీషన్ దాఖలుచేసేందుకు పార్టీ ఎంఎల్ఏలు రెడీ అవుతున్నారు. ఈరోజు ఐదుగురు ఎంఎల్ఏల అనర్హతపై తీర్పు చెప్పిన స్పీకర్ గురువారం మరో ముగ్గురు చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య, జగిత్యాల్ ఎంఎల్ఏ సంజయ్ కుమార్, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో తీర్పు చెప్పబోతున్నారు. ఐదుగురు ఎంఎల్ఏలు పార్టీ మారలేదని చెప్పిన స్పీకర్ మరో ముగ్గురు ఎంఎల్ఏల విషయంలో కూడా ఇలాంటి తీర్పే చెప్పబోతున్నారని సమాచారం. కాకపోతే మిగిలిన స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ విషయంలో ఎలాంటి తీర్పు చెబుతారో చూడాలి.

