
ట్యాపింగ్ పై రెండో ‘సిట్’ విచారణలో అయినా ప్రభాకర రావు నోరిప్పుతాడా ?
మొదటి సిట్ అధికారులకు ఏడాదిన్నర గడువిచ్చినా ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారి ఎవరనే విషయాన్ని రాబట్టలేకపోయారు
తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ విచారణకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటుచేసింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే ట్యాపింగ్ విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పటికప్పుడు రెండో సిట్ ఏర్పాటు అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే ఇప్పటికే నియమించిన సిట్ అధికారులు చేతులెత్తేశారు. ట్యాపింగ్ కేసులో కీలక పాత్రదారి అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ ప్రభాకరరావు నుండి విచారణలో సరైన ఆధారాలను రాబట్టడంలో సిట్ అధికారులు ఫెయిలయ్యారనే అనుకోవాలి. అందుకనే అర్జంటుగా రెండో సిట్ ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
రెండో సిట్ బృందం హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో పనిచేస్తుంది. కొత్త సిట్ లో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సీపీ ఎస్ఎం విజయకుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ కే నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏడీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ పీ వెంకటగిరి(మొదటి సిట్ లోదర్యాప్తు అధికారి)నాగేందర్ రావు, సీహెచ్ శ్రీధర్ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ట్యాపింగ్ కేసు దర్యాప్తును నెలరోజుల్లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించడం. మొదటి సిట్ అధికారులకు ఏడాదిన్నర గడువిచ్చినా ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారి ఎవరనే విషయాన్ని రాబట్టలేకపోయారు. అలాంటిది రెండో సిట్ కు కేవలం నెలరోజుల గడువిస్తే అసలు సూత్రధారిని ఎలా కనిపెట్టగలదు ?
కేసీఆర్ పాలనలో ఏళ్ళతరబడి వేలాదిఫోన్లు ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవం. ట్యాపింగ్ లో పాల్గొన్న నలుగురు పోలీసులు అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతయ్య, భుజంగరావు, ప్రణీత్ రావును సిట్ అధికారులు చాలాకాలం క్రితమే అరెస్టుచేసి విచారించారు. కోర్టు వీళ్ళకు రిమాండు కూడా విధించింది. రిమాండు, విచారణల తర్వాత నలుగురూ బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ట్యాపింగ్ చేయాలని తమకు ఆదేశాలిచ్చింది ఇంటెలిజెన్స్ మాజీ బాస్ టీ ప్రభాకరరావే అని వీళ్ళ నలుగురు వాగ్మూలాలు ఇచ్చారు. ఇదే విషయాన్ని అఫిడవిట్ల రూపంలో కోర్టుకు కూడా చెప్పారు.
ట్యాపింగ్ చేయాల్సిన ఫోన్ల నెంబర్లపై ప్రభాకరరావు నుండి తమకు వచ్చిన మొబైల్ ఫోన్ల ఆదేశాలను కూడా వీళ్ళు సిట్ అధికారులకు చూపించారు. కాబట్టి ట్యాపింగు చేసిన వాళ్ళు, వీళ్ళకు ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చింది ప్రభాకరరావే అన్నవిషయం సాక్ష్యాలతో తేలిపోయింది. ట్యాపింగుకు ఉపయోగించిన కంప్యూటర్లు, ల్యాప్ టాపులతో పాటు మరికొన్ని టెక్నికల్ డివైజెస్ ను కూడా స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు సిట్ అధికారులు. అలాగే ట్యాపింగ్ చేయాల్సిన నెంబర్లపై రాతమూలక ఆదేశాలను కూడా మొబైల్ సర్వీసు ప్రొవైడర్ల నుండి సిట్ సంపాదించింది.
ఇక్కడవరకు అంతా ఓకేనే కాని వేలాది ఫోన్లను ట్యాప్ చేయాలని ప్రభాకరరావుకు ఆదేశాలిచ్చిన అసలు సూత్రధారి ఎవరు ? అన్నపాయింట్ దగ్గరే విచారణ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే విచారణలో ప్రభాకరరావు అసలు నోరిప్పటంలేదు. నోరువిప్పకపోవటానికి కారణం ఏమిటంటే సుప్రింకోర్టు రక్షణ ఉండటమే. ట్యాపింగ్ కేసు బయటపడగానే అమెరికాకు పారిపోయిన నిందితుడు ఏడాది తర్వాత హైదరాబాదుకు వచ్చేముందు సుప్రింకోర్టులో కేసు వేసి రక్షణ పొందాడు. అరెస్టు చేయకూడదని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిట్ అధికారులను సుప్రింకోర్టు స్పష్టంగా ఆదేశించింది. పోలీసులు విచారణను తమదైన శైలిలో చేస్తేనే నిందితులు అసలు నిజాలు బయటకు కక్కుతారు.
అలాంటిది నిందితుడిని అరెస్టుచేయద్దని, ముట్టుకోవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సుప్రింకోర్టు రక్షణ ఉన్నపుడు ప్రభాకరరావు ఎందుకు నోరిప్పుతాడు ? ప్రభాకరరావును కస్టడీ విచారణకు అనుమతించాలని సిట్ అధికారులు అడిగిన ఆరుమాసాల వరకు కోర్టు అంగీకరించలేదు. పదిరోజుల క్రితమే నిందితుడిని మొదటిసారి కస్టడీ విచారణకు అనుమతించింది. కస్టడీ విచారణలో కూడా నిందితుడిని ముట్టుకునేందుకు లేదని ఆదేశించింది కాబట్టే ప్రభాకరరావు విచారణకు ఏమాత్రం సహకరించటంలేదు. నిందితుడు నోరిప్పేంతవరకు ట్యాపింగ్ కేసులో అసలు సూత్రదారుడు ఎవరన్న విషయం బయటకురాదు. సుప్రింకోర్టు రక్షణ ఉన్నంతవరకు నిందితుడు నోరిప్పడు.
గ్రౌండ్ రియాలిటి ఏమిటంటే ఇప్పట్లో ప్రభాకరరావు నోరిప్పే సూచనలు కనిపించటంలేదు. కారణం ఏమిటంటే నిందితుడు కూడా ఐపీఎస్ అధికారిగా సుమారు 35 ఏళ్ళు వివిధ హోదాల్లో పనిచేశాడు. పోలీసు ట్రిక్కులు, విచారణ విధానాలు అన్నీ క్షుణ్ణంగా తెలుసు. సుప్రింకోర్టు రక్షణ ఉన్నంతవరకు ప్రభుత్వం ఎన్ని సిట్ లు వేసినా ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ట్యాపింగ్ ద్వారా వేలాదిమంది వ్యక్తిగత జీవితాల్లోకి అక్రమంగా చొరబడిన ప్రభాకరరావు మీద సుప్రింకోర్టు ఎందుకింత దయచూపిస్తోంది ? ఎందుకు రక్షణగా ఉంటోందో అర్ధంకావటంలేదు.
రెండోసారి కస్టడీ
ట్యాపింగ్ కేసుకు సంబందించి శుక్రవారం సుప్రింకోర్టులో కీలక పరిణామం జరిగింది. అదేమిటంటే ట్యాపింగ్ కేసులో కీలక పాత్రదారి టీ ప్రభాకరరావును మరోవారంపాటు సిట్ కస్టడీ విచారణకు అనుమతించింది. మొదటిసారి కస్టడీ విచారణ శుక్రవారంతో ముగుస్తుంది. అందుకనే సిట్ అధికారులు సుప్రింకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. వారంరోజుల కస్టడీ విచారణలో నిందితుడు నోరిప్పని కారణంగా కస్టడీ విచారణను మరో వారంరోజులు పెంచాలని విజ్ఞప్తిచేశారు. సిట్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సుప్రింకోర్టు మరో వారంరోజులు కస్టడీ గడువు పొడిగించింది. అయితే నిందితుడి విషయంలో ఎలాంటి తొందరపాటు(థర్డ్ డిగ్రీ లాంటివి)చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశించింది. మరీ వారంరోజుల్లో ప్రభాకరరావు ఏమిచెబుతాడు ? రెండో సిట్ అధికారుల బృందం ఏ పద్దతిలో నిందితుడి నుండి అసలు విషయాన్న ఎలా రాబడుతుందో చూడాలి.

