‘తగ్గేదేలే అని.. తగ్గి.. టికెట్ రేట్లు పెంచేశారు’
x

‘తగ్గేదేలే అని.. తగ్గి.. టికెట్ రేట్లు పెంచేశారు’

టికెట్ రేట్ల పెంపు విషయంలో పట్టుమని పదిరోజులు కూడా లేని ప్రభుత్వం


తెలంగాణలో సినిమాల టికెట్ రేట్ల పెంపు అనేది ఉండదని అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారని అందరూ సంతోషించారు. అయితే ఆ నిర్ణయం పై ప్రభుత్వం పట్టుమని పది రోజులు కూడా నిలబడలేకపోయింది.

రేపు విడుదల కాబోతున్న‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయంలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదలైన రోజు అంటే జనవరి 10న ఉదయం నాలుగు గంటల నుంచే షోలు వేసుకోవచ్చని, రిలీజైన రోజు ఆరు షోలకు అనుమతి ఇచ్చారు.

అదే రోజు మల్టిప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 150 పెంచుకునేలా, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ఒక్కో టికెట్ పై అదనంగా రూ. 100 పెంచుకోవచ్చని తెలిపింది. జనవరి 11 నుంచి జనవరి 19 వరకూ రోజుకు ఐదు ఆటలు, మల్టిప్లెక్స్ లో రూ. 100, సింగిల్ స్క్రీన్ లో రూ. 50 ఒక్కో టికెట్ పై అదనంగా రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బెన్ ఫిట్ షో లకు మాత్రం అనుమతి లేదని ప్రకటించింది.

పుష్ఫ సినిమా సందర్భంగా
పుష్ఫ సినిమా విడుదల సందర్భంగా బెన్ఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, నిర్మాతలు భారీగా టికెట్ల రేట్లు పెంచి అమ్ముకున్నారు. ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళా అభిమాని మృతి చెందడం, ఆమె కుమారుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడంతో ప్రభుత్వం తన విధానాన్ని పున: సమీక్షించుకున్నట్లు ప్రకటించింది.
అందులో భాగంగా టికెట్ల రేట్లను పెంచేది లేదని, బెన్ ఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని స్వయంగా మంత్రులు, సీఎం ప్రకటించారు. తొక్కిసలాట జరిగిన తరువాత దానికి కారణంగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. విడుదల అయిన తరువాత హీరో అల్లు అర్జున్ పరామర్శించిన సినీ ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏకిపారేశారు.
‘‘ ఆయనకేమైనా కాలు పోయిందా.. కన్ను పోయిందా’’ అని ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించారు. చావు బతుకుల్లో ఉన్న పిల్లగాని దగ్గరకు ఎన్నిసార్లు వెళ్లారని గట్టిగా టాలీవుడ్ ను మందలించారు. దాంతో హీరో అల్లు అర్జున్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ దానిపై వివరణ ఇచ్చారు.
ఓ రకంగా చెప్పాలంటే తిరుగుబాటు లాంటి ధోరణే ప్రదర్శించారు. తరువాత రోజు తొక్కిసలాటలో చనిపోయిన అభిమాని కుటుంబానికి నష్టపరిహారం పెంచి పంపారు. తరువాత టాలీవుడ్ ప్రముఖులు సీఎం, మంత్రులతో సమావేశం అయ్యారు. అప్పుడు కూడా టికెట్ రేట్ల పెంపు విషయంలో మాత్రం ఎటువంటి ప్రకటన రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఓ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లోపల సెటిల్ మెంట్ జరిగిందని కామెంట్ చేశారు. దీనిపై దిల్ రాజు సమాధానిమిస్తూ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దని అన్నారు. ఇప్పుడూ టికెట్ రేట్ల పెంపు నిర్ణయాన్ని చూస్తే కేటీఆర్ చేసిన కామెంట్ నిజమనే అనిపిస్తోంది.
చట్టబద్ధమైన దోపిడి..
సాధారణంగా ప్రభుత్వం దోపిడి వ్యవస్థలను కనిపెట్టి, వాటిని అరికట్టి ప్రజలకు అందుబాటులో సేవలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇందుకు విరుద్దంగా ప్రభుత్వాలే టికెట్ రేట్లను పెంచి ప్రజల జేబులకి చిల్లులు పెడుతున్నాయి. సరే ఇన్ని సంవత్సరాలకు తెలంగాణ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుందని అనుకుంటే.. కనీసం పది రోజులు కూడా ఆ సంతోషం నిలవకుండా తిరిగి పాత విధానంలోనే టికెట్ రేట్లను పెంచుకోవాలని ప్రకటించింది. ఈ మాత్రం దానికే ఆర్భాటంతో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రైతు భరోసా విషయంలో..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రచారంలో రైతులకు ప్రతి ఏటా ఎకరాకు రూ. 15 వేల రైతు భరోసా ఇస్తానని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకూ దానిని అమలు చేయలేకపోయింది. తాజాగా దాని కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. అధికారులే స్వయంగా పంట వేశారా లేదా అని పరిశీలించి మరీ రైతుభరోసా ఇస్తారంటా.. అది కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా హమీ ఇచ్చినట్లు రూ. 15 వేలు కాదు.. 12 వేలు మాత్రమే అని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మెట్ట పంటలు పండిస్తారు. వాటిలో కంది లాంటి పంటలు ఫిబ్రవరిలో కోతలకు వస్తాయి. తరువాత జూన్ వరకూ ఖాళీగా ఉంటుంది. అంటే రెండో విడత పంట వేయలేదని కారణం చెప్పి రైతు భరోసాకు కోత పెడతారు. అంటే పరోక్షంగా పప్పు దినుసుల సాగుకు ప్రభుత్వమే అధికారికంగా మంగళం పాడినట్లు అవుతుంది. అందరికి వచ్చి, మెట్ట ప్రాంత రైతులకు రైతుభరోసా రాకపోతే తిరిగి రైతులు బోర్లు వేయడం దృష్టి పెడతారు. మెట్ట భూమిని మొత్తం చదును చేసి తిరిగి వరి, మొక్కజోన్న లాంటి పంటలు పండించడానికి ప్రయత్నిస్తారు.
వరి పంట వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఓ వైపు ప్రభుత్వాలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వరి సాగు చేస్తే కొన్ని పథకాలు అమలు చేయడం లేదు. కానీ అందుకు విరుద్దంగా ప్రభుత్వమే ఇప్పుడు వరి లాంటి పంటలు వేయమని చెప్పినట్లు అవుతుంది. ఇదే విధానంతో మరో వైపు పాడి పరిశ్రమ సైతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయకుండా కేవలం నిధుల మొత్తాన్ని తప్పించుకోవడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రుణమాఫీ లో కొర్రిలు..
రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఎన్నికల సందర్భంగా ఆ మొత్తం 35 నుంచి 40 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రైతులందరూ అప్పులు తీసుకోవాలని, తాము అధికారంలోకి రాగానే ఏకమొత్తంలో రూ. 2 లక్షల మొత్తంలో మాఫీ చేస్తామని అన్నారు.
కానీ అధికారంలోకి వచ్చి మాఫీ విషయం రాగానే ఆ మొత్తం రూ. 17 వేల కోట్లకు తగ్గించారు. ఇదే విషయాన్ని పీఎంఓ కార్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చెప్పింది. అది కూడా హర్యానా ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చి హమీలు ఎగవేశారని ఆరోపించడంతో తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చెప్పి, తానే నిజం బయటపెట్టుకుంది.
ఇదే విషయంపై ఈ మధ్య ఓ మంత్రి ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ... రెండు లక్షలు పైన అప్పలు ఉన్న వాళ్లకు అప్పులు మాఫీ చేస్తామని ఏమైనా చెప్పామా అంటూ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తినే ప్రశ్నించారు.
తులం బంగారం విషయంలో..
ఆడ పిల్లల పెళ్లి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మీ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించింది. తాము రాగానే వచ్చే లక్షకు పైగా మొత్తంతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తానని ప్రకటించారు. ఈ విషయం పై అసలు ప్రభుత్వం నోరు మెదపడం లేదు.
దీనిపై సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు, అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పినవి.. కలిపి ‘ పొంకనాల పోతిరెడ్డి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. పింఛన్ల విషయంలో కూడా ఎన్నికల సందర్భంగా ప్రతి సభలోనూ తాను అధికారంలోకి రాగానే నాలుగు వేలు ఇస్తానని ప్రకటించారు.దానిపై కూడా ఎలాంటి చర్యలేదు.
ఫ్రీ బస్ విషయంలో కూడా బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ న్యూస్ పేపర్ వాళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫ్రీ బస్ విషయంలో ఎం జరుగుతుందో ఫొటో స్టోరీని ప్రచురించారు. ఉన్న ఒక్క బస్సు కోసం గంటల తరబడి వేచి చూడటం, వచ్చిన బస్సులో వందలమంది ఎక్కడంతో డ్రైవర్లు బస్సులు ఆపి నిరసన వ్యక్తం చేస్తున్న వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా కాంగ్రెస్ ముందు హమీలు ఇవ్వడం, తరువాత వాటిని అమలు చేయలేక నానా ఇబ్బందులు పడడం రివాజుగా మారింది. ఇవన్నీ గమనించే కొన్ని నెలల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. అమలు చేద్దామనుకున్న హమీలు మాత్రమే ఇవ్వాలని కోరారు. కానీ ఆయన మాటలు ఎక్కడా పట్టించుకున్నట్లు కనపడటం లేదు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
Read More
Next Story