
సుప్రీంకోర్టు
‘కంచ గచ్చిబౌలి’ భూములపై ప్రభుత్వానికి లభించని ఊరట
స్టేటస్ కో కొనసాగుతుందన్న సుప్రీంకోర్టు
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించలేదు. ఈ భూముల వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టంచేసింది.
కేసు విచారణ మే 15 తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం , వృక్షాలను, జంతువులను ఎలా సంరక్షిస్తారో నివేదిక ఇవ్వాలని కోరింది. నాలుగు వారాలలో తగిన ప్రణాళిక తమ ముందుంచాలని ఆదేశించింది.
జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మరోమారు తెలంగాణ ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ, చెట్ల నరికివేతను ఎలా సమర్దించుకుంటారని నిలదీసింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే అది అటవీ భూమి కాదని, ప్రభుత్వ భూమేనని ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మన్ సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఫేక్ వీడియోలు, ఫొటోలతో కొందరు కావాలనే దుష్ప్రచారం చేశారని, నిబంధనలకు లోబడే ప్రభుత్వం అక్కడ భూమిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిందని వాదించారు.
ప్రభుత్వం తరుపున వాదనను పట్టించుకోకుండా వంద ఎకరాలలో ముందుగా జరిగిన పర్యావరణ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో , తగిన ప్రణాళికలు కావాల్సిందేనని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. నాలుగు వారాల గడువిస్తూ, తదుపరి విచారణ ను మే 15 తేదీకి కోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసి విక్రయించాలని చూడటం తొలుత వివాదానికి కారణమైంది.
పర్యావరణానికి పెను విఘాతం అంటూ, వర్శిటీ విద్యార్దులు ఆందోళన లు చేపట్టడం, విపక్షాలు కూడా రంగంలో దిగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
రాజకీయ దుమారం గా కూడా ఈ వ్యవహారం మారింది. పర్యావరణం దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అభివృద్ధి పనులను ఆపివేసింది.
ఈ కేసులో నేడు జరిగిన విచారణ లో కూడా సుప్రీం కోర్టు పర్యావరణం అంశలో రాజీ పడే లేదని మరోమారు తెల్చిచెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందో ఆసక్తిగా మారింది.
Next Story