ప్రతిపక్షాల్లో పెరిగిపోతున్న ‘మూసీ’ గందరగోళం
కేవలం రాజకీయ వైరంతో మాత్రమే మూసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని రేవంత్, మంత్రులు మండిపోతున్నారు.
మూసీనది సుందరీకరణ లేదా ప్రక్షాళన వ్యవహారం ప్రతిపక్షాల్లో బాగా గందరగోళం పెంచేస్తోంది. మూసీనది పునరుజ్జీవనం లేదా సుందరీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం టేకప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే నదికి రెండువైపులా ఉన్న నిర్మాణాలు, ఆక్రమణలను తొలగిస్తోంది. ఇప్పటికి సుమారుగా 200 ఇళ్ళల్లోని వాళ్ళకి ఇంకోచోట ఇందిరమ్మ డబుల్ బెడ్ రూములు కేటాయించింది. అక్కడినుండి కదిలేదిలేదని గట్టిగా భీష్మించుకుని కూర్చున్న వారితో పాటు కోర్టుల్లో కేసులు వేసి స్టే తెచ్చుకున్న ఇళ్ళ యజమానులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ నేపధ్యంలోనే కొందరు బాధితులు బీఆర్ఎస్ పార్టీ ఆపీసు తెలంగాణా భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తదితరులతో భేటీ అయ్యారు. తాము మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటామని బాధితులు చెప్పటంతో బీఆర్ఎస్ అండగా నిలబడింది.
నదిని ప్రక్షళన చేయాలంటే ఇళ్ళను, నిర్మాణాలను కూల్చాల్సిన అవసరంలేదని ముందుగా సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలని హరీష్ సూచించారు. మూసీలోకి విషపూరితాలు, డ్రైనేజి రాకుండా అడ్డుకోవాలని చెప్పారు. నదికి రెండువైపులా వేలది ఇళ్ళలోని సూవేజీ, డ్రైనేజి మూసీనదిలోకే చేరుతోంది. డ్రైనేజి చెత్తంతా నదిలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటే అప్పుడు ఇళ్ళలోని డ్రైనేజీ, సూవరేజి ఎక్కడకు వెళ్ళాలన్న ప్రశ్నకు హరీష్ సమాధానం చెప్పటంలేదు. ఫ్యాక్టరీలు, పరిశ్రమల వ్యర్ధాలు, విషపూరితాలు మూసీలో కలవకకుండా ఆపేస్తే మరెందులో కలపాలన్న ప్రశ్నకు సమాధానం లేదు. అందుకనే ప్రభుత్వం ముందుగా ఇళ్ళను, ఫ్యాక్టరీలను ఖాళీ చేయించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీఆర్ఎస్ హయంలో మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించిన కేటీఆర్ ఇపుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండటమే అయోమయానికి అద్దంపడుతోంది.
తొందరలోనే స్ధానిక సంస్ధల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓట్లకోసం మూసీ ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వనిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఇళ్ళను కూల్చకుండా కూడా మూసీనదిని ప్రక్షాళన చేయచ్చని, సుందరీకరణ చేయచ్చని హరీష్ పదేపదే అంటున్నారు. ఆక్రమణలు తొలగించకుండా, బఫర్ జోన్లో చొచ్చుకుని వచ్చిన 10 వేల ఇళ్ళను తొలగించకుండా నది ప్రక్షాళన చేయటం, సుందరంగా తీర్చిదిద్దటం ఎలా సాధ్యమని రేవంత్ బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్నారు. అయినా సరే రేవంత్ మాటలను బీఆర్ఎస్ నేతలు పట్టించుకోకుండా తమ దారిలోనే తాము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే మూసీ డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించాలని కేటీఆర్ ఆదేశించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. కేవలం రాజకీయ వైరంతో మాత్రమే మూసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని రేవంత్, మంత్రులు మండిపోతున్నారు.
ఇక బీజేపీ విషయంచూస్తే ఇక్కడ కూడా అయోమయమే కనబడుతోంది. కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు మూసీ ప్రక్షాళన, సుందీరకరణ, పునరజ్జీవనం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టంగా ప్రకటించారు. అలా చెబుతునే కిషన్ ఒక మెలికపెట్టారు. ఇంతకీ ఆ మెలిక ఏమిటంటే నదికి రెండువైపులా ముందు రీటైనింగ్ వాల్ నిర్మించాలట. రీటైలింగ్ వాల్ నిర్మిచిన తర్వాత పునరుజ్జీవనం పనులు మొదలుపెట్టాలని చెప్పారు. అయితే నదికి రెండువైపులా ఇళ్ళను మాత్రం కూలగొట్టకూడదట. ఇళ్ళని, నిర్మాణాలను కూలగొట్టి చేసే మూసీనది పునరుజ్జీవనం ఎవరికోసం అంటు రేవంత్ ను కిషన్ ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది.
నిజానికి కిషన్ చెప్పినట్లుగా నదికి రెండువైపులా రీటైనింగ్ వాల్ నిర్మించేసి పునరుజ్జీవనం లేదా సుందరీకరణ ఏమాత్రం సాధ్యంకాదు. మూసీనదికి రెండువైపుల నిర్మాణాలను తొలగించినపుడు మాత్రమే నదికి పూర్వవైభవం సాధ్యమవుతుందని అందరికీ తెలుసు. అయితే బీఆర్ఎస్ లాగే బీజేపీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోందంటే తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో గెలుపు కోసమే అని చెప్పాలి. మూసీ గందరగోళమే హైడ్రా విషయంలో రెండుపార్టీల్లోనూ కనబడుతోంది. జలవనరులను పునరుద్ధరించాల్సిందే అంటూనే మళ్ళీ ఆక్రమించి నిర్మించిన ఇళ్ళను కూల్చకూడదని అంటున్నారు. మొత్తంమీద మూసీ, హైడ్రా అంశాలపై ప్రతిపక్షాల్లోని అయోమయం స్పష్టంగా బయటపడింది.