తీవ్రంగా శ్రమిస్తున్నా కవితకి మళ్ళీ నిరాశే...
x

తీవ్రంగా శ్రమిస్తున్నా కవితకి మళ్ళీ నిరాశే...

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం తిప్పలు పడాల్సి వస్తోంది.


ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. లిక్కర్ స్కాం సీబీఐ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పై విచారణ మరోసారి వాయిదాపడింది. సోమవారం ఆమె బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. అనంతరం విచారణను ఆగస్టు 5కు కోర్టు వాయిదా వేసింది. కవిత తరపు న్యాయవాదులు నిర్దేశించిన 60 రోజుల గడువులో పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయిందని జూలై 8న పిటిషన్ వేసి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. జుడీషియల్ రిమాండ్ లో ఉన్న కవితను సీబీఐ 2024 ఏప్రిల్ 11న అక్రమంగా అరెస్టు చేసిందని కోర్టులో వాదించారు.

జూన్ 7న సీబీఐ అసంపూర్తి ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని కోర్టుకు తెలిపారు. సీబీఐ చార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని కోర్టు కూడా పేర్కొంది. సీఆర్పీసీ167(2) ప్రకారం కవిత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉందని, ఏడేళ్ల శిక్ష పడే కేసులో 60 రోజుల వరకు మాత్రమే కస్టడీకి అవకాశం ఉందని, తాము డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జూలై 6 వ తేదీ నాటికి కవిత 86 రోజుల కస్టడీ పూర్తి అయ్యిందని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు గతంలో వాదనలు వినిపించారు. ఈరోజు మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరగగా.. కోర్టు ఆగస్టు 5కు వాయిదా వేసింది.

కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత మనీష్ సిసోడియాల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జులై 3తో గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో... దర్యాప్తు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఇద్దరి కస్టడీని జూలై 25 వరకు పొడిగించారు. దీంతో తదుపరి విచారణ జులై 25 కి వాయిదా పడింది.

ఇక, లిక్కర్ కేసులో మార్చ్ 15న అరెస్టైన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రతిసారి నిరాశే మిగులుతోంది. తాజాగా ఆమె వేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా వాయిదా పడింది. అయితే, ఇటీవల ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావులు మూడు నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండి సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడంపై న్యాయసలహాలు తీసుకున్నారు. త్వరలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Read More
Next Story