గ్రూప్-1 మెయిన్స్ కు తొలగిన అడ్డంకులు.. పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
ప్రిలిమ్స్ పరీక్షలో ఏడు ప్రశ్నలకు తుది కీలో సరైన జవాబులు ఇవ్వలేదని, వాటికి మార్కులు జతచేసి కొత్తగా మెయిన్స్ జాబితా ఇవ్వాలని కోరుతూ పలువురు అభ్యర్థులు కోర్టును..
మూడు సంవత్సరాలుగా తెలంగాణలో నలుగుతున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో ఏడు ప్రశ్నలకు తుది కీ లో సరైన జవాబులు ఇవ్వలేదని, కాబట్టి ప్రస్తుత మెయిన్స్ పరీక్ష నిలిపివేసి, కొత్త జాబితాను ప్రకటించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీనితో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. పరీక్షకు సంబంధించి ఇప్పటికే టీజీపీఎస్సీ హల్ టికెట్లను విడుదల చేసింది. ఈ రోజు నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
గ్రూప్ -1 పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. 2022 లో అక్టోబర్ 16 న మొదటి సారి పరీక్ష నిర్వహించి, 1:50 నిష్ఫత్తిలో 25 వేల మందితో 2023 జనవరిలో మెయిన్స్ జాబితాను విడుదల చేసింది.
అయితే మార్చిలో కమిషన్ ఉద్యోగులు పేపర్ లీక్ చేసినట్లు తేలడంతో జూన్ లో జరగాల్సిన మెయిన్స్ ను రద్దు చేసింది. తరువాత అదే సంవత్సరంలో రెండో సారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే సరియైన నిబంధనలు పాటించలేదన్న కారణంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ పరీక్షను సైతం రద్దు చేసింది. ఈ పరిణామంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి అదనంగా మరో 60 పోస్టులను జతచేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా అందరూ తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతకుముందే కమిషన్ ను సంస్కరించింది. కొత్త ఉద్యోగులకు నియమించింది. సుప్రీంకోర్టు లో తానే దాఖలు చేసిన కేసును కమిషన్ విత్ డ్రా చేసుకుంది.
ఈ ఏడాది జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన కమిషన్, అక్టోబర్ నుంచి మెయిన్స్ పరీక్ష నిర్వహించడానికి సిద్దమైంది. అయితే తుది కీలో సరియైన జవాబులు లేవని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కొన్ని రోజులుగా విచారణ జరపుతున్న న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టి వేసింది.
Next Story